ఈరోజు పొద్దున్నే ఈనాడు తెరిచి మూడో పేజీ చూడగానే బోలెడంత ఆనందం అనిపించింది. రిలయన్స్-జియో ఓనరు ముఖేష్ అంబానీ కాబోయే రెండో కోడలు గురించి వార్త రాసిన తీరు అనితరసాధ్యం. నాలుగో వంతు పేజీ స్థలం ఆక్రమించిన ఈ వార్తలో నీతా-ముకేశ్ కాబోయే కోడలు చి.ల.సౌభాగ్యవతి రాధికా మార్చంట్ భరత నాట్య అరంగేట్రం గురించి చక్కగా రాశారు. ఇది చదివాక- రాముడు, కృష్ణుడు, శబరి, యశోదమ్మ కళ్ళ ముందు కనిపించారు.
ఎక్కడో అరేబియా సముద్ర తీరం ముంబాయిలో ఆదివారం రేత్తిరి జరిగిన నాట్యప్రదర్శన గురించి ప్రాంతీయ తెలుగు దినపత్రికలో రావడం సగటు తెలుగోడి ఎదుగుదలకు అద్దం పడుతోంది. మనం సంపన్నుల కొడుకులు, కూతుళ్ళను ప్రేమించడమే కాదు, అపర గుజరాతీ కుబేరుల కాబోయే కోడళ్ల కళా వైభవాన్ని కూడా మెచ్చుకోగలిగితేనే మన జాతీయ దృష్టి బలోపేతమౌతుంది. ఈనాడులో అంబానీల పైసలున్నాయా?లేదా? అనేది మనం చూడొద్దు. ఈనాడు జాతీయ దినపత్రికగా ఎదిగిందనే వాస్తవం మాత్రమే మనం గుర్తిస్తే మంచిదేమో……… ఇదీ సదరు పోస్టు… పొద్దున్నే షాక్‌కు గురైనట్టున్నారు నాంచారయ్య గారు…
Ads
ఇక్కడ కొంత క్లారిటీ అవసరం… పాఠకులు, ప్రజలు దురభిప్రాయం ఏర్పరుచుకోకుండా కొన్ని నిజాలు అవసరం… ఆమధ్య రామోజీరావు మనమరాలి పెళ్లికి ఫస్ట్ పేజీ ఫోటో కథనాలతోపాటు, ఆరేడు పేజీల్లో ఫోటోలు కుమ్మేసి, ప్రైవేటు ఆల్బమ్ ఫర్ పబ్లిక్ అనే స్కీం అమలు చేశారని గమనించగలరు… మరి ఈనాడు ముఖేష్ అంబానీ పత్రిక కూడా… తనవి 40 శాతం డబ్బులున్నయి ఈనాడులో… మరి తనకు కాబోయే కోడలు తొలి నాట్యప్రదర్శనతో అరేబియా సముద్రం ఉప్పొంగితే అది వార్త గాకుండా పోతుందా..? మన వార్తే మనకు జాతీయ వార్త… అంతే…
ఈనాడు జాతీయ పత్రికగా కాదు, అది ఎప్పుడో అంతర్జాతీయ పత్రిక… ఐనా పత్రిక నిర్వహణ రామోజీరావు చూస్తున్నాడు కాబట్టి ఈ ఘన ఈవెంట్ కవరేజీ విషయంలో అంబానీకి అన్యాయం జరిగిందనేది నా భావన… ఫస్ట్ పేజీలో కనీసం ఫోటో, ఇండికేషన్ లేకపోవడం ఏమిటి..? లెక్కప్రకారం, మొన్నటి మనమరాలి పెళ్లితో పోల్చినప్పుడు కనీసం ఒక పేజీ ఫోటో ఆల్బమ్ ప్రచురించి ఉండాల్సింది… అంతటి అంబానీకి కాబోయే కోడలు ఆమె… గజ్జెకట్టి తొలి డాన్సు చేస్తుంటే దానికి ప్రాధాన్యం లేకపోతే ఎలా..?
కానీ ఏమాటకామాట… ఈ వార్త రాయడానికి సదరు రిపోర్టర్ ఎన్నిపాట్లు పడ్డాడో ఫాఫం… సబ్ ఎడిటర్ జుట్టు సగం రాలిపోయి ఉంటుంది… మొత్తం వార్తలో బాగా నచ్చిన వాక్యం ఏమిటంటే…? ‘‘ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం భరతనాట్యంలో శిక్షణ పొందారు… అప్పుడప్పుడూ ప్రదర్శనలు ఇస్తుంటారు’’… ఔనా… ఇప్పటికీ ఆమె ప్రదర్శనలు ఇస్తుంటారా..? హవ్ గ్రేట్..!!
నీతా అంబానీ పుట్టింటి ఇంటిపేరు దలాల్… అలాగని ఆకట్టుకున్న దలాల్ భరతనాట్యం అని డెక్ పెట్టేయకూడదు… అలాగే మర్చెంట్ భరతనాట్యం అని కూడా రాయకూడదు… నవ్వొచ్చిన మరికొన్ని వాక్యాలు… 1) నాట్య సంప్రదాయాల మేరకు ఆమె ప్రదర్శన సాగింది… 2) అతిథులందరికీ ముందుస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు… 3) ఆడ అతిథులు పట్టుచీరెలు ధరించగా, మగ అతిథులు షేర్వాణీలు, కుర్తాలు ధరించి రావడంలో అక్కడ ఉత్సవ శోభ కనిపించింది… 4) సంప్రదాయ నృత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఓ అద్భుత కళాకారిణి దొరికిందని అందరూ కొనియాడారు……….
ఓ విజ్ఞుడైన పాఠకుడా… మీకు సాగరసంగమం సినిమా గుర్తుందా..? ఎస్పీ శైలజ నాట్యప్రదర్శన గురించి పత్రికల కవరేజీపై ఓ ఘట్టం ఉంటుంది… గుర్తొచ్చిందా..? సరే..!! పైన ఫోటో చూస్తుంటే ‘‘పంచభూతములు ముఖపంచకమై, ఆరురుతువులు ఆహార్యములై’’ దగ్గర సరైన భావప్రకటనే చేసినట్టు కనిపిస్తోంది…!!
ఇది సాక్షి కవరేజ్… ఈనాడు సరే, సాక్షి ఎందుకు అంత హైలైట్ చేసింది అంటారా… జగన్, అంబానీ… నడుమ పరిమళ్ నత్వానీ… అంటే అర్థం కావడం లేదా… ఆ గాఢ బంధాలు..!!
Share this Article