Priyadarshini Krishna…… వంటంటే యేదో చేసామా తిన్నామా కాదు… యే ఐటెంకి ఎలాంటి కాయగూర ఎంచుకోవాలో దగ్గర నుండి, ఎలా కొయ్యాలి ఉప్పు ఎప్పుడెప్పుడెయ్యాలి, ఎప్పుడెప్పుడు కలియతిప్పాలి, ఎంత సెగమీద వండాలి, నీళ్ళు పొయ్యాలా వద్దా, పోస్తే ఎప్పుడు ఎంత పొయాలి… చింతపండు వాడాలా, టొమాటో వాడాలా… ఇలా ఒకటి కాదు చాలా వుంటాయి….
సింపుల్ ఉప్మాను కూడా లొట్టలేసుకుని తినేలా వండేవారు చాలా తక్కువ. అత్యంత ఈజీ ఐన ఇడ్లీని పువ్వుల్లాగా, దూది పింజెల్లాగా, వెన్నముద్దల్లాగా చేసేవారు అరుదు… అదే చేతిమహిమ అనో ఇంకోటనో అంటాంగానీ…. అదంతా వారు మనసుపెట్టి శ్రద్ధగా చేసిన ఫలితమని రుచిచూసాక మనకు తెలుస్తుంది… అంచేత నే చెప్పొచ్చేదేమంటే వంట అనేది ఆషామాషీకాదు…. ఏకాగ్రతతో, మనసు కేంద్రీకరించి చెయ్యాల్సినది…..
ఈ రెసిపీ మీద ఓసారి దృష్టి పెట్టండి… ముందుగా కొత్తిమీరకారం ముద్దనూరుకోవాలి. దానికేం చేయాలంటే… మూడు లేదా నాలుగు కట్టల కొత్తిమీర తీసుకోవాలి, పది పచ్చిమిరపకాయలు, వేయించిన జిలకర్ర ఓ చెంచా, రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కోసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ దినుసులన్నీ ముద్దలాగ నూరుకోవాలి. నీళ్ళు అస్సలు పొయ్యకూడదు. ఈ ముద్దని పక్కన పెట్టకోవాలి.
Ads
అరకేజీ మువ్వొంకాయలు లేదా గుంటూరు గులాబి అనే పొడవు వంకాయల్లో లేతవి ఎంచుకోవాలి… పువ్వులా గాట్లు పెట్టుకోవాలి , గుత్తివంకాయకి పెట్టుకున్నట్లుగా…! లోపలవైపు కాస్త ఉప్పుని కూరాలి. కాస్త అనగా చిటికెడు. ఇది రెండు విధాలుగా మంచిది. ఒకటి) వంకాయలు కండ్రెక్కి నల్లబడకుండా వుంటాయి. రెండు) తొడిమల దగ్గర కూరలో వేసిన ఉప్పు తగలదు. అంచాత ఇలా ఉప్పు కూరడంవల్ల తొడిమలు ఉప్పుతో మగ్గి రుచిగా వుంటాయి.
తర్వాత అన్ని వంకాయల్లోకి కొత్తిమీర ముద్దను కూరుకోవాలి. అల్లం వెల్లుల్లి తినేవారు ఈ ముద్దలో ఒక స్పూన్ కలుపుకోవచ్చు. అన్ని సిద్ధమయ్యాక ముద్ద ఇంకా మిగిలితే పక్కనుంచుకుని లాస్టులో కూరలో కలపొచ్చు. ఇప్పడు వెడల్పాటి మూకుడులో ఐదారు టేబుల్ స్పూనుల నూనె వేసి, వేడి అయ్యాక వంకాయలని జాగ్రత్తగా మూకుడులో పేర్చాలి. అన్ని వంకాయలు అడుగుకి తగిలేలా వుంటే అన్నీ సమంగా వేగి బ్రహ్మాండంగా వుంటుంది.
ఇప్పుడు సన్నని సెగ మీద – అంటే… సిమ్‌లో లోయెస్టు సెగ మీద వుంచి, మూతపెట్టి మగ్గించాలి… ఈ దశలోనే కూరగా మిగిలిన ముద్దని పైన వెయ్యాలి. కొత్తిమీర వేగిన కమ్మటి వాసన వచ్చేవరకు మగ్గించాలి. చిన్న హస్తంలాంటి గరిటెతో వంకాయలను ఒడుపుగా తిరగతిప్పాలి. హడావిడి చేస్తే కూరిన ముద్ద బైటకొచ్చేయడం, వంకాయ చిదికిపోవడం జరుగుతుంది.
కలియతిప్పకముందు కొంత ఉప్పు, కలియతిప్పాక కొంత ఉప్పు వేసుకోవాలి. ఇది మీ రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు ముందే వేస్తే కొత్తిమీరకుండే ఆకుపచ్చదనంపోయి నల్లగా ఐపోతుంది. కలియతిప్పాక మూతపెట్టి మరో ఐదు నుండి పది నిముషాలు మగ్గిస్తే కూర తయారైనట్లే… నేనైతే వంకాయలన్నీ వేసాక కొంత ఇంగువ కొంత పసుపు వేస్తాను. ఇష్టమున్నవాళ్ళు వేసుకోవచ్చు… ఇంకేముంది, ఒక్కొక్క వంకాయ లాగిస్తూ ఉంటే నాసామిరంగా…
Share this Article