కొన్నిసార్లు నవ్వొస్తుంది… ఎవరో ఓ పెద్దాయన తన పాండిత్య ప్రకర్షను మొత్తం వినియోగించి, మర్మగర్భంగా ఏదో సమాజానికి చెబుతున్నట్టుగా ఓ బిల్డప్ ఇస్తూ ఓ కవిత రాస్తాడు… అసలు తోటి కవులే ఎవరూ చదవరు… బుర్రకెక్కని ఆ కవిత్వం జనానికి అక్కర్లేదు… నయాపైసా ప్రయోజనం లేదు… కానీ ఆ కవితను అపూర్వమైన సాహిత్యసృష్టిగా, సేవగా చిత్రీకరిస్తూ, పత్రికల్లో ఎవడూ చదవని మండే సాహిత్యం పేజీల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వస్తుంటాయి…
కానీ జనం ఇంకా కాస్తోకూస్తో చదువుతున్న నవలల సమీక్ష మాత్రం తెలుగులో పెద్దగా ఉండదు… ఇంగ్లిషు పుస్తకాలకు సంబంధించిన రివ్యూలు ఇంగ్లిషు సైట్లలో, పత్రికల్లో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి, అంతే… అదీ పలు రంగాల్లో లబ్ధిప్రతిష్టులు రాసిన పుస్తకాలు అయితేనే… అంతేతప్ప ప్రొఫెషనల్ రైటర్స్ రాసే పుస్తకాల మీద రివ్యూలు ఉండవు… సరే, ఈ రివ్యూల గోల అటుంచితే… మిత్రుడు ప్రభాకర్ జైనీ రాసిన నిఘా పుస్తకం గురించి చెప్పాలి…
ఇది నవ్య అనే ఆంధ్రజ్యోతి అనుబంధ పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది… నిజానికి రచయితను అభినందించాలి… తన గట్స్, తన స్టడీ గురించి… తన శైలి బిగి సడలకుండా, ఏకబిగిన చదివేలా ఉంటుంది… మొత్తం చదివాక మరోసారి జనగణమన సినిమా గుర్తొచ్చింది… ఆ సినిమాలాగే ఇది కూడా మన వ్యవస్థల్లోని డొల్లతనాన్ని, కీలక పదవుల్లో ఉండే వ్యక్తుల చీకటి కోణాల్ని బట్టలిప్పి బజారున నిలబెట్టేలా ఉంది…
Ads
గట్స్ అని ఎందుకు అన్నానంటే… లీగల్ చిక్కులు రాకుండా ఇది కల్పితం అని రచయిత రాసుకున్నాడు గానీ… ఇందులోని సంఘటలన్నీ నిజంగా జరిగినవే… పత్రికల్లో రిపోర్ట్ అయినవే… అవన్నీ ఒక్కచోట ఓ కథలో గుదిగుచ్చి ప్రజెంట్ చేశాడు… సాధారణంగా ప్రాంతాల పేర్లను తమ నవలల్లో రాసుకోవడానికి కూడా కొందరు రచయితలకు ధైర్యం చాలదు… పత్రికల్లో విస్తృత కవరేజీ వచ్చిన సంఘటనల్లోని పేర్లను వాడుకోవడానికి కూడా భయపడతారు… కానీ ఈ పుస్తకంలో అలాంటి వెనుకంజలు, గింజులాటలు ఏమీ లేవు… అజిత్ ధోవల్ పేరు సహా కథలో ఇమిడ్చి రచయిత రాసుకుంటూ పోయాడు…
అప్పట్లో సీబీఐలో కుమ్ములాటల కథలు చూశాం, చదివాం కదా… ఓ కీలకమైన పాత్ర మన తెలుగువాడిదే… కోనా రాజేష్ బాబు అనే పాత్ర అదే… ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… పత్రిక, టీవీ, రేడియో, సైట్ ఏ కమ్యూనికేషన్ మార్గమైనా సరే, రాజ్యాంగంలోని భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చిన హక్కు… సేమ్, సినిమా, నవల, కథ, కథానిక, నాటకం ఏదైనా అంతే… కాస్త లీగల్ చిక్కులు రాకుండా, పరిధులు దాటకుండా రాస్తే నవలైనా, పత్రికలో వచ్చే న్యూస్ స్టోరీ అయినా ఒకటే… కాకపోతే నవల అయితే క్రియేటివ్ వర్క్, ఓ కథలా చెప్పాలి… పత్రిక అయితే జస్ట్, రిపోర్ట్ చేస్తుంది…
ఒక సీబీఐ సర్వింగ్ జడ్జిని కోర్టులో అరెస్టు చేయడం… సీబీఐ ఉన్నతాధికారికి క్లీన్ చిట్ ఇప్పించుకోవడానికి తమ గ్రూపు అధికారులు పన్నే పన్నాగాలు, ఉగ్రవాదులకు ఉన్నట్టుగానే మిలిటరీ ఇంటలిజెన్స్‌కు కూడా ఉండే అండర్ కవర్ ఆపరేషన్స్, నెట్‌వర్క్… ఇద్దరు లాయర్ సిస్టర్స్… ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపించినట్టుగా చకచకా ఈ కథనం సాగిపోతుంది… సాగదీత ఉండదు… కానీ ఈ కథను ఎంచుకోవడమే సాహసం… అసలు ఇందులో కోర్టులకు సంబంధించిన పలు సాంకేతిక పదాలు బహుశా జూనియర్ లాయర్లకు కూడా తెలిసి ఉండవు…
అదే కాదు, పలు విషయాల్లో రచయిత చాలా పదాల్ని పరిచయం చేస్తాడు… వాటి మీద మంచి స్టడీ ఉంటే తప్ప కథానుసారం, సరైన ప్లేసులో వాడలేం… అయితే రచయిత స్వతహాగా సినిమా దర్శకుడు కదా… కథ కూడా ఓ సినిమా కథలాగే సాగుతుంది… అలాగే అక్కడక్కడా కాస్త సినిమాటిక్ అతిశయోక్తి అనిపిస్తుంది… కళ్లలో అమర్చే స్పయింగ్ లెన్స్ వంటివి… బట్, ఇంత రాసినా అత్యున్నత దర్యాప్తు సంస్థ, న్యాయవ్యవస్థల పట్ల తన గౌరవాన్ని వినమ్రంగా ప్రకటిస్తాడు రచయిత… చివరలో… ఇక కథను ఏం చేయాలో తోచలేదో, ఇక సీరియల్ ఆపేద్దాం అని సదరు వారపత్రికో చెప్పిందో గానీ… ఓ ‘అభినందన్’ తరహా ట్విస్టు ఇచ్చి ముక్తాయించాడు… బాగుంది…!!
Share this Article