జాలిపడాల్సిన అవసరమేమీ లేదంటారా కొందరు..? ఏమో… ఒకింత జాలిపడాలనే అనిపిస్తుంది ఈటీవీ తాజా పరిస్థితి చూస్తుంటే..! ఈనాడు తాజా పాత్రికేయ నాణ్యత ప్రమాణాల్ని చూస్తుంటే ఎలా బాధ కలుగుతుందో, ఈటీవీ తాజా స్థితి కూడా అంతే… ఈనాడు కాస్త నయం… రంగు, రుచి, చిక్కదనం, వాసన ఏమీలేని చప్పిడి పథ్యం తిండిలా ఉన్నా సరే, కొత్తగా నష్టం ఏమీ ఉండదు… తినడానికి సయించదు… కానీ ఈటీవీ ఘోరం… బూతును నమ్ముకుని, దాన్ని ఇంటింటికీ వ్యాప్తిచేయడం…
ఒక్కసారి దిగువన ఇస్తున్న టేబుల్స్ పరిశీలించండి,.. ఈటీవీ బాధ్యులు, పరోక్షంగా ఔట్‌సోరింగ్స్ తీసుకున్నట్టుగా వ్యవహరిస్తున్న మల్లెమాల బాధ్యులు చదివితే ఇంకా బెటర్… ఇవేమీ పుక్కిటి అంకెలు కావు… అన్ని చానెళ్లు ప్రామాణికంగా తీసుకునే బార్క్ తేల్చిన అంకెలే… తాజా రేటింగ్స్ పరిశీలిస్తే మాటీవీ 831, జీతెలుగు 656… ఒకప్పుడు ఆ రెండింటితో పోటీపడిన ఈటీవీ మాత్రం 385… అసలు మేనేజ్‌మెంట్ పూర్తిగా వదిలేసిన జెమిని కూడా 314 జీఆర్పీ… జెమినికీ, ఈటీవీకి నడుమ తేడా స్వల్పం… అంటే మూడు, నాలుగు స్థానాల కోసం జెమినితో పోటీపడుతుందా ఈటీవీ..? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉంటుందా ఆర్గనైజేషన్‌కు..?!
Ads
కింద ఉన్న మరో టేబుల్ చూడండి… సాధారణంగా వినోద చానెళ్లు మూడు విభాగాల్లో రేటింగ్స్ కోసం ప్రయత్నిస్తుంటాయి… ఫిక్షన్, అంటే సీరియళ్లు గట్రా… నాన్ ఫిక్షన్ అంటే, రియాలిటీ షోలు గట్రా… మూవీస్ మూడో కేటగిరీ… మూవీస్ కేటగిరీలో రేటింగ్స్ రావాలంటే ఎక్కువ డబ్బు పెట్టి, కొత్త సినిమాలు కొని ప్రసారం చేయాలి… ఈటీవీ అలా డబ్బు పెట్టదు… సో, అందులో వీక్… అందులో సీరియళ్లను ఆ టీవీలో పనిచేసేవాళ్లు కూడా పెద్దగా చూడరు… సో, అదీ వీక్… తనకున్న బలమే నాన్ ఫిక్షన్… అయితే క్రమేపీ దాన్ని చేజేతులా భ్రష్టుపట్టించడమే ఈటీవీ డౌనఫాల్‌కు కారణం…
ఈ దిగువన టేబుల్ చూడండి… ఏ సీరియల్ కూడా 2, 3 దాటవు… ఒక్కటి మినహా… ఇప్పటికీ ఓ వినోద చానెల్ రేటింగ్స్ కోసం న్యూస్ బులెటిన్ మీద ఆధారపడటం విచిత్రమే… దానికే స్థిరమైన జీఆర్పీలు వస్తుంటాయి… (ఆ బులెటిన్ బాగుంటుంది కూడా…) ఇక నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఆలీతో సరదాగా పనైపోతోంది… మరీ 1.39 రేటింగ్స్ అంటే ఆలీతో ఈటీవీ ఏదో ఒకటి తేల్చుకోవడం బెటర్… వావ్ కూడా అంతే… నానాటికీ దాని వ్యూయర్ షిప్ పడిపోతోంది…
సుడిగాలి సుధీర్, రష్మి వెళ్లిపోయాక ఢీలో కామెడీ చార్మ్ లోపించింది… అది ఇప్పటికీ రేటింగుల్లో లేవడం లేదు… (తాజా ఢీ ప్రోమోలో నిర్వాకం ప్లస్ పైత్యం చివరలో చెప్పుకుందాం…) పాడుతా తీయగా ప్రోగ్రాంను భ్రష్టుపట్టించబోతున్నారు అని ముందే చెప్పుకున్నాం కదా… అదే జరుగుతోంది… మరీ 1.45 రేటింగ్స్ అంటే ఆ బాలు పేరు దెబ్బతీయడమే… క్యాష్ అంతంతమాత్రమే… స్టార్ కమెడియన్లు అందరూ వెళ్లిపోయాక జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోల పరిస్థితీ అలాగే మారింది… ఎటొచ్చీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్కటే 5 రేటింగ్స్… ఇప్పుడు సుధీర్‌ను తరిమేశారు కదా… ఇక దాని సంగతీ వేచిచూడాలి…
అదే క్యాష్, అదే వావ్, అదే ఆలీతో సరదాగా… ఓ కొత్త ప్రోగ్రాం లేదు, క్రియేటివ్ ఆలోచన లేదు… అదీ దాని దురవస్థ… చివరకు ఆ ఢీ షోలో కామెడీ స్థాయిని కూడా ఎలా పైత్యీకరిస్తున్నారో చూద్దాం… తాజా ప్రోమో… హైపర్ ఆది ఎవరినో పట్టుకుని… ‘‘ఈ మైక్ ఇక్కడ గాకుండా…’’ అని ఆపేస్తాడు… మిగతాది సదరు చానెల్ సంస్కార స్థాయిని మనం ఊహించుకోవాలి…
పార్టీ పేరు అడిగితే… ‘‘వేస్తే వెయ్ లేకపోతే…’’ తరువాత పదాన్ని మనం అర్థం చేసుకోవాలి… రెగ్యులర్‌గా ఈటీవీ బూతు ప్రపంచాన్ని చూసే ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది… మూడునాలుగుసార్లు పదే పదే అదే వాక్యం… పడీ పడీ నవ్వుతోంది ప్రియమణి… తను ఏమీ తెలియని ఎడ్డిమొహం ఏమీ కాదు, తనకు మొత్తం తెలుసు ఆ భాష… కానీ తప్పదు… నందితా శ్వేత అయితే సిగ్గుతో తలదించుకుంది… ఒకవేళ నవ్వకపోతే డబ్బులు ఇవ్వరేమో అని సందేహించి జానీ మాస్టర్ కూడా ఇకఇక నవ్వాడు… మరి జగన్‌ను వెక్కిరించారో ఏమిటో తెలియదు గానీ, ఇంకో పార్టీ పేరును ‘‘మేం విన్నాం, మేం ఉన్నాం…’’ అని చెప్పించారు… మరోచోట టవర్ బయట వద్దు గానీ… అని అర్థంతరంగా ఆపేస్తాడు ఆది… అర్థమైందా అదేమిటో…!!
జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ, డ్రామా కంపెనీ… ఏ షో అయినా ఇక ఇలాంటి భాషను, వెగటుతనాన్ని నింపేస్తారా..? మొన్న చెప్పుకున్నాం కదా, చివరకు సుమ షోలో కూడా బుగ్గలు కొరికే కార్యక్రమానికి తెరతీసింది… ఏమాటకామాట… వావ్ మాత్రం పద్దతిగా ఉంటుంది… సో, అర్థమైంది కదా… కనీసం ఆ మూడో స్థానంలోనైనా నిలబడాలా..? నాలుగో స్థానం వైపు పరుగు తీయాలా..? అనేది ఆ చానెలే తేల్చుకోవాలి…!!
Share this Article