బాలయ్య బర్త్ డే… ఓ సినిమా సంగతి చెప్పుకుందాం… బాలయ్య సినిమాల ‘‘అతి పోకడల’’ గురించి నవ్వుకునేవి, తిట్టుకునేవి, చీదరించుకునేవి, చప్పట్లు కొట్టేవి బోలెడు ఉండవచ్చుగాక… తనకు నప్పని పాత్రలు కూడా ఉండవచ్చుగాక… కానీ ఆదిత్య-369 సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో సరిగ్గా ఫిట్టయ్యాడనిపిస్తుంది… గాంభీర్యం, రాజసం అనే కాదు… తన ఇతర పాత్రలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని అర్థం…
ఎస్పీ బాలు ఓసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర ఉన్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు… అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పేసుకున్నాడు… (ఈ చిత్ర సమర్పకుల్లో బాలు కూడా ఉన్నాడు…) కృష్ణదేవరాయల కాలం అనగానే నిర్మాతకు బాలకృష్ణ గుర్తొచ్చాడు…
బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు… శ్రీకృష్ణదేవరాయల పాత్రే తనను బాగా ఆకర్షించి ఉంటుంది… మాటలు, కథన రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు…. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు పి.సి.శ్రీరాం ఛాయాగ్రాహకుడు… ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి.ఎస్.ఆర్.స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు…
Ads
మొదట్లో కోటి ఖర్చు అంచనా… అది కాస్తా మరో 30 లక్షలు పెరిగింది… ఆ తరువాత అదీ సరిపోలేదు… ఇంకో 30 లక్షలు పెట్టారు… చిత్రం పట్ల బజ్ క్రియేట్ అవుతుండటంతో ఎక్కువ పెట్టుబడికి సిద్ధపడ్డారు నిర్మాతలు… సినిమాకు ఏం పేరు పెడదాం అని కూడా చర్చ… యుగపురుషుడు అనుకున్నారు… ఆల్‌రెడీ ఎన్టీయార్ ఆ పేరుతో ఓ సినిమా చేశాడు… ఆదిత్యుడు అనుకున్నారు… అందులో ఆధునికత కనిపించడం లేదు… దాంతో ఆదిత్య అని పెట్టేసి, టైం ట్రావెల్ కాబట్టి 369 అని సరదాగా యాడ్ చేశారు…
కథానాయికగా మొదట విజయశాంతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. తర్వాత పి. సి. శ్రీరాంకి పరిచయమున్న మోహినికి ఆ అవకాశం దక్కింది. టైం మెషీన్ తయారు చేసే పాత్రకు విభిన్నంగా కనిపించడం కోసం హిందీ నటుడు టిన్నూ ఆనంద్ ని ఎంపిక చేశారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు. కథాప్రయోగాలకు, కథన ప్రయోగాలకు సింగీతం ఎప్పుడూ సిద్ధమే కదా… ఈ కథను కూడా కొత్తకొత్తగా చెప్పటానికి ప్రయత్నించారు… ఒక సైంటిస్టు తయారు చేసిన టైం మెషీన్ లో హీరో, హీరోయిన్లు భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్ళడం అనే అలోచన తెలుగు ప్రేక్షకుడికి బాగా నచ్చింది…
వాతావరణ కాలుష్యం, భావి యుద్ధాలు ఎలాంటి ఆందోళనను రేకెత్తిస్తున్నాయో చెప్పటానికి భవిష్యత్ కాలంలోని కొన్ని సీన్లను భలే రాసుకున్నారు దర్శక, రచయితలు… రేడియేషన్, కాసేపు కూడా భూఉపరితలంపై ఉండలేని దుస్థితి, పాతాళంలో జనావాసాలు గట్రా జనం అబ్బురంగా చూశారు…
వాళ్లు భూత కాలంలోని శ్రీకృష్ణ దేవరాయలు కాలంలోకి వెళ్ళడం, అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు భలేగా ఉంటాయి…. నిజానికి ఈ కథను బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది రాసుకున్నారు… అయితే దాన్ని తెలుగీకరించుకోవడంలోనే అసలు నైపుణ్యం, క్రియేటివిటీ పనిచేశాయి…
ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎప్పుడూ అబ్బురంగా చెప్పుకునే శ్రీకృష్ణదేవరాయుడి కాలంలోకి మనల్ని తీసుకుపోతారు… తెలుగు పద్యాలు, ఆస్థాన కవులు, సవాళ్లు, రాజనరక్తిగా స్మిత, కుట్రలు, మోహాలు గట్రా అదొక సపరేట్ కథ… ఆ కథకు అచ్చమైన తెలుగుతనం అద్దారు… అదీ తెలుగు ప్రేక్షకుడిని బాగా కనెక్ట్ చేసింది… టైం ట్రావెల్ కంటెంటుకు క్రైం యాంగిల్ జతచేసి, కథలోకి పిల్లనటుల్ని పట్టుకొచ్చి, మొత్తానికి జనరంజకంగా మలిచారు… కానీ ఏమాటకామాట… సినిమా సక్సెస్‌కు మరో ప్రధాన కారణం పాటలు… జాణవులే, స్వరవీణవులే, కిలికించితాలలో అనే పాట ఈరోజుకూ స్వరణీయమే… స్మరణీయమే… అలాగే రాసలీల వేళ, రాయబారమేల, మాటే మౌనమై మాయ సేయనేలా అనే పాట కూడా వినసొంపు… ఆ బాలయ్య కనిపించక చాన్నాళ్లయింది…!!
Share this Article