మీడియా చాలా వార్తలు రాస్తుంది… ఓ సెన్సేషన్ అనుకున్నప్పుడు, ఓ సెలబ్రిటీకి సంబంధించిన కంట్రవర్సీ వార్త దొరికినప్పుడు అతిగా స్పందిస్తుంది… దాన్నే ఓవరాక్షన్ అంటాం… కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లు అవి చూసి, చదివి అంగీలు చింపుకోవద్దు… చింపుకుంటే మన కాళ్ల మీదే పడేది… దురదృష్టం కొద్దీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఏ ముఖ్య అధికారికి ఈ పాలనపరమైన పరిణతి గానీ, సోయి గానీ ఉన్నట్టు కనిపించదు… చేయకూడనివి చేసేస్తూ ఉంటారు… చేయదగినవి అస్సలు పట్టించుకోరు…
ఇదీ అలాంటిదే… విషయం ఏమిటంటే… నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్నారు… నేరుగా తిరుమలకు వచ్చారు దేవుడి ఆశీస్సుల కోసం… అది స్వామివారిపై వాళ్లకున్న భక్తి… నమ్మకం… వాళ్లేమీ శేషవస్త్రాలు ఇవ్వమని అనలేదు, ప్రత్యేక ఆశీర్వచనాలు అడగలేదు… ఢాంఢూం అని సెలబ్రిటీ ఫోజులేమీ కొట్టలేదు… మాడ వీథుల్లో నడుస్తున్నప్పుడు ఆమె పాదాలకు చెప్పులు ఉన్నాయట… ఎవరో పట్టుకుని, సోషల్ మీడియాకు ఎక్కించాడు… ఇంకేముంది..?
నయనతార పైత్యం, ఇంత కావురమా అన్నట్టుగా మీడియా, యూట్యూబర్లు తెగరాసేశారు… అరె, ఆమె జన్మతః క్రిస్టియన్… హిందూమతంలోకి శాస్త్రోక్తంగా మారింది… శ్రీవారి మీద నమ్మకం ఉంది కాబట్టే పెళ్లయిన వెంటనే తిరుమలకు అవే సంప్రదాయిక బట్టల్లోనే వచ్చి, భర్తతోపాటు దేవుడి ఎదుట మోకరిల్లింది… ఆమె చేసింది చిరు తప్పే కావచ్చు, కానీ క్షమించదగిన, క్షమించరాని తప్పులు వేర్వేరు… ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా… సోషల్ మీడియా, మీడియా దట్టించిన వార్తలు చూడగానే దేవస్థానం వీజీవో బాలరెడ్డి స్పందించాడట… ఆగ్రహించాడట… నయనతార దంపతులపై చర్యలు ఉంటాయని హెచ్చరించాడట…
Ads
ఆమె ప్రధాన ద్వారం నుంచి కొంతదూరం వచ్చాక మీడియా ఆపితే అక్కడ చెప్పులు వేసుకున్నట్టుంది… అంతేతప్ప ఆమె ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్టు ఏమీ కనిపించడం లేదు… అక్కడ బోలెడు మంది చెప్పులు వేసుకునే ఉన్నారు… మీడియా కెమెరామెన్ సహా… మరి ఆమె మీదే ఎందుకీ విషం..? సరే, టీటీడీలోని ఏ సెక్షన్ కింద ఏం యాక్షన్ తీసుకుంటావ్ రెడ్డీ… అసలు ఎన్ని పెద్ద పెద్ద తప్పులకు ఎవరిని బాధ్యులను చేయాలి… అవునూ, స్టేట్ సర్వీస్ ఎక్స్‌టెన్షన్ కోసం ఒకాయన ఢిల్లీకి 300 కల్యాణ లడ్డూలు తీసుకెళ్లాడట… ఏం యాక్షన్ తీసుకుందాం మరి..?!
ఫోటో షూట్ చేశారని కూడా సదరు అధికారి కోపగించాడట… నాన్సెన్స్, మా సిబ్బంది వైఫల్యం ఉంది, వాళ్ల మీదా యాక్షన్ తప్పదు అని భీకరంగా ఉరిమాడట… ఏం చేస్తావయ్యా..? మళ్లీ తిరుమలకు రాకుండా నిషేధం విధిస్తావా..? పోనీ, టీటీడీలో ఎవరి మీదనైనా, ఏ వైఫల్యానికైనా చర్యలు ఉంటాయా..? అక్కడ ఉద్యోగుల జోలికి ఎవరైనా పోగలరా..? మాడవీథుల్లో చెప్పులు ధరించడం తప్పే కావచ్చుగాక, ఆమెకు తెలియకపోవచ్చు… అక్కడి సిబ్బంది చెప్పాలి… నోటీసు బోర్డులు రాసి పెట్టాలి… అయినా సరే ధిక్కరిస్తే దాన్ని తప్పు అందాం…
అసలు దేవుడి దర్శనం కాగానే రాజకీయ నాయకులు క్షుద్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు… లైవ్‌లో వచ్చేస్తున్నాయి… అవి ఎందుకు నివారించలేరు..? అసలు దేవుడి దగ్గర ఈ నీచ వ్యాఖ్యల ప్రహసనాలు ఎందుకు..? వాళ్ల మీద యాక్షన్ తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నాయా టీటీడీకి… మొన్నటికి మొన్న ఎవరో టీడీపీ పెద్ద నాయకుడు అదే టీటీడీ శ్రీవాణి ట్రస్టు విరాళాలు, దర్శనాల మీద నోటికొచ్చిన ఆరోపణల్ని ఆ గుడి ప్రధాన గుమ్మం ముందే వాగి వెళ్లిపోయాడు… ఏం యాక్షన్ తీసుకుంటారు..?
ఫలానా ఫలానా వాళ్లు సందర్శించారు అనే బులెటిన్లు అవసరమా..? దేవుడి ముందు హోదాలేమిటి..? ఎవరో వస్తారు… దర్శించుకుంటారు… వెళ్తారు… మరి ప్రోటోకాల్ మెహర్బానీలు దేనికి..? పడి పడి పొర్లుదండాలు దేనికి..? ఎవడో సినిమావాడు వస్తాడు, ఏదో కూస్తాడు… ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు బాల్‌రెడ్డీ..?! అసలు ఎవరైనా సరే, మహాద్వారం దగ్గర నిలబడి, ఈ కూతలు దేనికి..? దానికి ఎందుకు చాన్స్ ఇస్తున్నారు… ముందుగా ఈ బురదను కదా కడగాల్సింది…!! కొత్త దంపతులు ఎవరొచ్చినా సరే, దేవుడి అక్షింతలు వేయకపోయినా పర్లేదు, అదరగొట్టకండి…!!
Share this Article