నగ్మా… పద్దెనిమిదేళ్లు పార్టీకి సేవ చేశాను… నాకు గుర్తింపేదీ..? రాజ్యసభ సీటేది..? పార్లమెంటుకు దారేదీ..? అని శోకాలు పెట్టింది కదా ఈమధ్య… అదే ఓసారి చెక్ చేస్తుంటే ఈ ఫోటో కనిపించింది… ఒకప్పటి పాపులర్ నటి శ్రీదేవితో ముగ్గురు పిల్లలు కూర్చుని దిగిన ఫోటో… ఇంట్రస్టింగు… వాళ్లెవరో తెలుసా..? నగ్మా అండ్ సిస్టర్స్… ఆ పిల్లలు ఒక్క తల్లి పిల్లలే… కానీ బాటలు వేర్వేరు… అవును మరి, ఎవరైనా పిల్లల్ని కంటారు తప్ప పిల్లల జాతకాల్ని కాదు కదా…
అసలు శ్రీదేవి మరణమే పెద్ద అనుమానాస్పదం… మన దుర్మార్గమైన వ్యవస్థలో, అదీ ఆడదాన్ని నీచంగా చూసే సినిమా ఇండస్ట్రీలో, గతంలోని అనేకానేక అనుభవాలు, కథల నేపథ్యంలో శ్రీదేవి ఆత్మకు న్యాయం జరగడం అనేది కల్ల… బోనీకపూర్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగిస్తే ఒక్క పూటలో తేలిపోయేది శ్రీదేవి మరణం మిస్టరీ ఏమిటో…
సరే, అదంతా గతం… సౌత్ ఫిమేల్స్ నార్త్ మేల్స్‌ను నమ్ముకుని మోసపోవడం ఈరోజు కొత్త కాదు… చాలా కథలున్నాయి… దాన్నలా వదిలేస్తే ఈ ముగ్గురు పిల్లలు ఎవరు..? ఇదీ ప్రశ్న…
Ads
ఇందులో పెద్ద పిల్ల నగ్మా… తరువాత ఇద్దరు చెల్లెళ్లు… ఒకరు జ్యోతిక, మరొకరు రాధిక అలియాస్ రోషిణి… ముగ్గురూ హీరోయిన్లే… ప్రస్తుతం ముగ్గురి బాటలూ వేర్వేరే… నగ్మా తెలుసు కదా… ఫుల్లు మాస్ పాత్రలు చేసింది… అప్పట్లో చిరంజీవితో ‘తట్టిలో సరుకేదో నింపుకెళ్లు’ వంటి మార్మికమైన బూతుపాటల్లో కూడా స్పెప్పులేసింది… సార్, మామూలోడు కాదు కదా మరి… తరువాత రాజకీయాల్లో చేరింది… ఢక్కామొక్కీలు… ఏదో కథ అలాగే కొనసాగుతూ ఉంది…
కాంగ్రెస్‌లో అవకాశం, అదీ రాజ్యసభ అంటే… అంత వీజీ కాదు… అదొక సముద్రం… రకరకాల కేరక్టర్లు వస్తుంటారు, పోతుంటారు… లక్కు తగిలితే అందలం… లేకపోతే ఇదుగో ఇలాగే శోకం… నేను సీనియర్‌ను, నాకేదీ రాజ్యసభ సీటు అంటే రాదు… వచ్చే రాత ఉంటే వస్తుంది… కాంగ్రెస్ అంటేనే అంత… గాలివాటం అదృష్టాలు… దివ్య స్పందన అలియాస్ రమ్య అంతగా సోషల్ మీడియా హెడ్‌గా చేస్తేనే ఎవడూ దేకలేదు… ఇప్పుడు ఆమె ఏమయిందో కూడా ఎవరికీ తెలియదు… సో, నగ్మా గురించి ఇక్కడ వదిలేద్దాం…
జ్యోతిక… తెలివిగా తన కెరీర్, తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంది… హీరో సూర్యను పెళ్లి చేసుకుంది… సినిమా నటిగా కూడా కొనసాగుతోంది… డబ్బు, కీర్తి, కెరీర్, పిల్లలు… అన్నీ సరైన ప్లానింగు… కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తుంది, నిర్మిస్తుంది… అన్నింటా తోడుగా నిలిచే భర్త… అసలే తుమ్మితే ఊడిపోయే బంధాలకు నెలవైన సినిమా ఇండస్ట్రీలో తన పెళ్లి బంధాన్ని, తన కెరీర్‌ను, కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకుంటోంది… అదొక పంథా…
మరో సోదరి అసలు పేరు రాధిక… జ్యోతికకు అక్క, నగ్మాకు చెల్లె… ఈ ముగ్గురి తండ్రి చందర్ సదనాహ్… తల్లి పేరు సీమ, అసలు పేరు షమా ఖాజి… ఈ రాధిక తెరపేరు రోషిణి… మొదట్లో తను కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసింది… తరువాత ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది… ఆమె జీవితమేమిటో ఆమెదే… తెర మీదకు మళ్లీ రాలేదు… వంద శాతం ఓ మామూలు గృహిణి… పిల్లలు…
అదే మరి… ఒక తల్లి పిల్లలే… అందరూ హీరోయిన్లే… కానీ ఇప్పుడు ఒకరు రాజకీయ నాయకురాలు… మరొకరు మామూలు గృహిణి… ఇంకొకరు ఇప్పటికీ హీరోయిన్… అందుకే మరి… ఒకేసారి పుట్టిన కవల పిల్లలైనా సరే, జాతకాలు కలవనక్కర్లేదు… ఒకరి బతుక్కి మరొకరు బతుక్కి పోలిక ఉండదు… మరి సేమ్, పుట్టిన నిమిషం… సేమ్ సంవత్సరం, సేమ్ తేదీ, సేమ్ సమయం అయినా సరే,.. అంతా సేమ్ సేమ్ ఉండదు… ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి బతుకులూ ఒకేలా ఉండవు… ఉండవు…!! అదెలా అనడగండి ఎవరినైనా… అబ్బే, గత జన్మ కర్మల్ని బట్టి ఈ జన్మ పయనం అంటారు… అవును, అదే అంటారు… వాళ్లకూ తెలిస్తే కదా…!!
Share this Article