లోన్ యాప్ మోసాల్లో విద్యాధికులు!
———————–
“పొట్టోడిని పొడుగోడు కొడితే-
పొడుగోడిని పోశమ్మ కొట్టిందట”
తెలంగాణాలో వాడుకలో ఉన్న అద్భుతమైన సామెత ఇది. సామ్యం అంటే పోలిక. ఒకానొక పోలికతో ప్రస్తుత సందర్భాన్ని చెప్పడం సామెత. పుట్టీ పుట్టగానే ట్వింకిల్ ట్వింకిల్ అని షుగర్ ఈటింగ్ చేస్తూ ఫాలింగ్ లండన్ బ్రిడ్జ్ కింద ఉండిపోతాం కాబట్టి పొట్టి పొడుగు- పోశమ్మ సామెతలు మనకు వంటబట్టకపోవచ్చు. ఇదే సామెత మిగతా ప్రాంతాల్లో-
Ads
తాడిని తన్నేవాడొకడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు- అన్న రూపంలో ఉంది. చినచేపను పెదచేప మింగితే ఆ పెదచేపను తిమింగలం మింగాలి. అది సృష్టి ధర్మం. లోకనీతి.
చిన దొంగను వీధి దొంగ దోచేస్తే, వీధి దొంగను ఊరి దొంగ దోచేయాలి. ఊరి దొంగను జిల్లా దొంగ దోచేస్తే, జిల్లా దొంగను అంతర్రాష్ట్ర గజదొంగ దోచేయాలి. అంతర్రాష్ట్ర గజదొంగను అంతర్జాతీయ గజదొంగ దోచేయాలి. అంతర్జాతీయ గజదొంగను ఎవరు దోచుకోవాలో తెలియక ఇన్నేళ్ళుగా సామెత స్తంభీభూతంగా ఆగిపోయి ఉంది. అంతర్జాతీయ గజదొంగను అంతర్జాల గజదొంగ దోచుకోవాలి- అని ఇప్పుడు సామెతకు కొనసాగింపు వచ్చింది.
కాలంలో మార్పు సహజం. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ప్రతి రోజూ అప్డేట్ కావాలి. శరీర శ్రమ తగ్గించుకుని మేధో పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించాలి. తక్కువ పెట్టుబడితో విపరీతంగా రాబడి లాక్కోవాలి.
ఇది వరకు బ్లాక్ కాలర్, వైట్ కాలర్, బ్లూ కాలర్… అని రకరకాల రంగుల కొలువులు ఉండేవి. ఇప్పుడు అందరికీ వైట్ కాలర్ జాబే కావాలి. అందునా సాఫ్ట్ వేర్ కొలువులే శ్రేష్ఠతమం. దాంతో అంతర్జాతీయ గజదొంగలందరూ శూన్యమాసం ఆదివారం అమావాస్య అర్ధరాత్రి దయ్యాలు నిద్రలేచి ఒళ్ళు విరుచుకున్నవేళ సువిశాల గచ్చిబౌలి పదమూడో అంతస్తులో సమావేశమయ్యారు. వారి ఆచారం ప్రకారం దీపాలు ఆర్పి సమావేశం మొదలుపెట్టారు. కన్నుపొడుచుకున్నా కానరాని ఆ అమావాస్య బస్సుచీకట్లో ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా అంతర్జాల గజదొంగలకు శిరోధార్యమయ్యాయి. ఈ దొంగ సిలబస్, దొంగ వ్యాకరణం నిజానికి బయటికి పొక్కదు. అయితే ఆ రోజు అర్ధరాత్రి తప్పతాగి తన ఫ్లోరే అనుకుని పన్నెండో ఫ్లోర్ ఉద్యోగి పదమూడో ఫ్లోర్ దొంగల మీటింగ్ కు హాజరు కావడంవల్ల ఈ విషయాలన్నీ బయటకు లీక్ అయ్యాయి.
తమ విద్యకు కొంత సిలబస్ మార్కెట్లో అందుబాటులో ఉంటే ఔత్సాహిక దొంగవిద్యార్థులకు ఉపయోగపడుతుంది కదా అనుకుని అంతర్జాల గజదొంగలు పెద్దమనసుతో సిలబస్ ను లీక్ చేసినవాడిని క్షమించారని తరువాత తెలిసింది. అంతర్జాల గజదొంగల కాల్ సెంటర్లు, యాప్ లు మానిటర్ చేసే సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ ఆఫీసులు, ఆన్ లైన్లో బెదిరించడానికి వందల మంది పనిచేసే మూడు షిప్ట్ ల కార్యాలయాలు ఇప్పుడు నయా ట్రెండ్. కొన్ని రాష్ట్రాల్లో డిజిటల్ నేరాలు నేర్పించే వృత్తి విద్యా సెంటర్లు కూడా చక్కగా పనిచేస్తున్నాయి. విద్య, నేర్పు, నైపుణ్యం అన్నవి అంతర్జాల గజదొంగల అకెడెమిక్ క్యాలెండర్లో కూడా చాలా ప్రధానమయిన విషయాలు.
లోన్లు ఇవ్వడానికి యాప్ లు, బెదిరించి వసూలు చేసుకోవడానికి యాప్ లు, వీటిని పెద్ద ఎత్తున నిర్వహించడానికి పెద్ద పెద్ద కార్యాలయాలు…కొన్ని రోజులుగా యాప్ యమపాశాల మీద వార్తలే వార్తలు. లోన్ యాప్ డిజిటల్ మాఫియాలో ఒక పెద్ద తలకాయ అమెరికాలో ఎం ఎస్ చేసి ఎం బి ఏ కూడా చేశాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద వార్త ఇచ్చింది.
ఇప్పుడు మళ్లీ పోశమ్మ సామెత దగ్గరికే వెళదాం. చిల్లర దొంగను నోట్ల దొంగ కొడతాడు.
నోట్ల దొంగను ఆన్ లైన్ దొంగ కొడతాడు.
నిరక్షరకుక్షి అయిన దొంగ విద్యాగంధం లేకపోవడం వల్ల చాలా రిస్కు తీసుకుని రాత్రిళ్లు ఇళ్లకు, బ్యాంకులకు కన్నాలు వేస్తున్నాడు సంప్రదాయ పద్ధతిలో. విద్యాధికులయిన యాప్ దొంగలు పగలు రాత్రి కూర్చున్న చోట వైట్ కాలర్ నలగకుండా ఆన్ లైన్లో దోచి పారేస్తున్నారు.
వినడానికి ఇబ్బందిగా ఉన్నా- భవిష్యత్తులో మనం వినబోయే పారిభాషిక పదాలు ఇవి:-
ఆన్ లైన్ చోర్ వాలా
చోర్ చాహియే డాట్ కామ్
చోర్ కాల్ సెంటర్
చోర్ డేటా సెంటర్
రౌడీ యాప్
ఆప్ కా లోన్- ఆప్ కా యాప్
డై యువర్ ఓన్ డెత్ లోన్ యాప్
చైనాసే పైసా యాప్
త్రెటెనింగ్ యాప్
లోన్ లేవో- ప్రాణ్ దేవో
లోన్ ఆయా- జాన్ గయా
ఆన్ లైన్ చోర్ జాబ్
———————
పెళ్లి సంబంధాల ప్రకటన ఇలా ఉండవచ్చు:-
మెసచుసెట్స్ లో డిగ్రీ , స్టాన్ఫోర్డ్ లో ఎం బి ఏ చేసి అంతర్జాతీయ అంతర్జాల మోసాల్లో పదేళ్లుగా ఒక వెలుగుతున్న ఆరడుగుల అందగాడికి- సరితూగగల అంతర్జాల మోసాల్లో ఆరితేరిన అమ్మాయి కావలెను. కులం, మతం, ప్రాంతం, జాతి పట్టింపుల్లేవు.
———————–
కొత్త కోర్సు నోటిఫికేషన్ ఇలా ఉండవచ్చు:-
ఆన్ లైన్ మోసాల్లో అంతర్జాతీయంగా పేరుపొంది ఇప్పటిదాకా పోలీసులకు దొరకని గజదొంగలచే ప్రత్యేక శిక్షణ. దొంగ విద్యలో పాస్ గ్యారెంటీ. బేసిక్ డిజిటల్ పరిజ్ఞానం ఉంటే చాలు. పరిమిత సీట్లు. త్వరపడండి. మీ దొంగబంగారు భవిష్యత్తుకు నేడే బాటలు వేసుకోండి.
————————
ఆఫీస్ స్పేస్ కోసం ప్రకటన ఇలా ఉండవచ్చు:-
ఫోర్ ట్వంటీ మెంబర్ టీం ఆన్ లైన్ దొంగలు ఒకేసారి పనిచేసుకోవడానికి వీలుగా ప్లగ్ అండ్ ప్లే అన్ని వసతులతో ఉన్న ఐదంతస్తుల భవనం అర్జంటుగా అద్దెకు కావాలి. అద్దె ఎంతయినా పరవాలేదు. పవర్ బ్యాకప్ ఉండాలి. హై స్పీడ్ డెడికేటేడ్ నెట్ బ్యాండ్ విడ్త్ తప్పనిసరిగా ఉండాలి.
———————–
ఉద్యోగ ప్రకటనలు ఇలా ఉండవచ్చు:-
టెంత్ టెన్ టైమ్స్ ఫెయిలయినా కొద్దిగా డిజిటల్ నాలెడ్జ్ ఉండి, పాస్ వర్డ్ లు దొంగిలించి ఆన్ లైన్లో మోసాలు చేయగలిగిన చురుకయిన యువతీ యువకులకు చక్కటి ఉద్యోగ అవకాశం. జీతం నెలకు యాభై వేలు. ఎనిమిది గంటల పనివేళలు. వారాంతపు సెలవు. క్యాంటీన్ సదుపాయం కలదు. నెల నెలా మోసాల్లో ప్రతిభను బట్టి ప్రమోషన్లకు అవకాశం.
————————
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article