ఆఁ ఏముందిలే… సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు విరాటపర్వం అనే ఓ సినిమా తీశారు… ప్రమోషన్ టూర్లు చేస్తూ వరంగల్ వెళ్లారు… ఆత్మీయ సభ అని ఓ మీటింగు పెట్టి సినిమాకు డప్పు కొట్టుకున్నారు… అదొక ప్రిరిలీజ్ ఫంక్షన్… ఎవరెవరో వచ్చి మాట్లాడారు… అదొక సాదాసీదా సగటు సినిమా ఫంక్షన్… ఓ యాంకర్, చీఫ్ గెస్టుగా ఓ మంత్రి, మధ్యమధ్యలో కాస్త వినోదం…… అంతేనా..? అంతేకాదు.., ఒకటీఅరా టచింగు దృశ్యాలు…
ఏదో సినిమా మీటింగు కోణంలో చూస్తే నిజానికి అది అస్సలు మనం చెప్పుకునే వార్తేమీ లేదు… కానీ ఒక్కచోట మంచిగా అనిపించింది… దర్శకుడు తరుణ్ భాస్కర్ ది వరంగలే… విరాటపర్వం సినిమా దర్శకుడు వేణుది కూడా వరంగలే… వరంగల్ అనేక తరాలుగా తెలంగాణ సాంస్కృతిక కేంద్రం… అందుకే వేణు అన్నట్టు… వరంగల్‌లో కట్టెపుల్ల కూడా కవితలు రాస్తది, కథలు చెప్తది…
హీరో రానా, నటుడు నవీన్ చంద్ర, సాయిపల్లవితోపాటు ఈ ప్రమోషన్ టూర్‌లో నటి ప్రియమణి కూడా పాల్గొన్నది… ఆమెను తనతో కలిసి డాన్స్ చేయాలంటూ బిత్తిరి సత్తి చేసిన ఒత్తిడి చిరాకెత్తించింది… ఆమె కూడా చాలా ఇబ్బందిగా ఫీలైంది… తనకు ఇలాంటి స్వేచ్ఛను నిర్వాహకులు ఇవ్వడం నిర్వహణపరంగా చేసిన తప్పు… ఇలాంటి చికాకు సీన్లను వదిలేస్తే… తరుణ్ భాస్కర్ హీరోహీరోయిన్లను ప్రశ్నలు వేసి, వేదిక మీదే జవాబులు రాబట్టిన ఎపిసోడ్ బాగుంది…
Ads
సాధారణంగా సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లలో స్వడప్పు అధికం… అందరికీ థాంక్స్ చెప్పుకోవడం పరిపాటి… చివరలో హీరో గొప్పలూ ఉంటాయి… అందరూ హీరోకు పొర్లుదండాలు పెడుతుంటారు… అంతా హిపోక్రసీ, ఆర్టిఫిషియాలిటీ దట్టంగా ఆవరించి ఉంటుంది… కానీ ఈ సభ విభిన్నం… రానా ఎక్కడా ఓవరాక్షన్ చేయలేదు… ప్రియమణి కూడా సాయిపల్లవి పట్ల ప్రజల్లో కనిపిస్తున్న అభిమానం హోరును అలా చూస్తుండిపోయింది… సాయిపల్లవి మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టి అభినందించింది… ముఖ్యలుందరూ స్పాంటేనియస్‌గా మాట్లాడారు… దాంతో సినిమా ఫంక్షన్ల సహజలక్షణమైన ‘కృత్రిమత్వం గాఢత’ బాగా తగ్గిపోయింది…
ఆసక్తికరంగా కనెక్టయింది ఏమిటంటే..? వేదిక మీద తరుణ్ భాస్కర్ సాయిపల్లవికి సారె పెట్టాడు… అర్థం కాలేదా..? నిజమే… సకినాలు, అరిశెలు, మురుకులు, గరిజెలతో కూడిన సంచీని అందించాడు… ఆఫ్టరాల్, రెండు మూడొందల రూపాయల విలువ కాదు అది… ఆమెను మన ఇంటి మనిషిగా ఓన్ చేసుకోవడం… అది ఓరుగల్లు సంస్కారం అనిపించింది… తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ ఫిదా సినిమాలో సాయిపల్లవితోపాటు నటించింది… ఆమె ఈ సారె పంపించింది… అదీ హృద్యంగా అనిపించింది…
ఎహె, ఇందులో ఏముంది పెద్ద గొప్ప అని తేలికగా తీసిపడేసేవాళ్లూ ఉంటారు… గొప్ప అని కాదు, అక్కడ ఇద్దరు హీరోలు, ఇంకో హీరోయిన్, ఇద్దరు దర్శకులు, సినిమా ముఖ్యులు అంతమంది ఉన్నా సరే, ఆఫ్టరాల్ ఓ సినిమా నటికి, పదీపన్నెండు సినిమాలు కూడా చేయని ఓ యాక్ట్రెస్ పట్ల ఎందుకంత గౌరవం..? ఆమెపై ఏమిటంత అభిమానం..? ఓ చెల్లిగానో, ఓ బిడ్డగానో ఎందుకు ఓన్ చేసుకోవడం..? దానికి జవాబు కష్టం… కానీ ఆ తెలుగుదనపు ఇంటి సారె ఓ అవ్యక్త అభిమానానికి సూచిక…! ఓ పట్టుచీరె అక్కడే పెట్టడం పెద్ద విషయం కాదు… అది అతిశయం… రెండు అరిశెలు, రెండు సకినాలు ఇవ్వడం అభిమానంలోని స్వచ్ఛత… అదే తేడా…!! అందరికీ అర్థం కాదు, అనుభూతించేవాడికి తప్ప..!! దాన్ని వేదిక మీద ఇవ్వడం చిన్నతనం కాదు, నామోషీ కాదు… దర్శకుడు తరుణ్ భాస్కర్ దాన్ని మా ప్రివిలేజ్ అనుకోవడంలోనే ఉంది అసలు కనెక్టయ్యే ఫీల్…!!
Share this Article