ఎవరూ తక్కువ కాదు… ఒకరి రాజకీయం క్షుద్రం, ఇంకొకరిది అతిక్షుద్రం… పెద్ద తేడా ఏమీ కనిపించదు ఏపీ పాలిటిక్సులో… టెన్త్ పాస్ పర్సంటేజీ మీద బజారులోని బురదనంతా ఎత్తిపోసుకున్నాయి కదా… నిజంగానే జగన్ తనే స్వయంగా పేపర్లు దిద్ది, కసికసిగా తక్కువ మార్కులేసి, ఫెయిల్ చేసి ఉంటాడా..? లేక ముందుగానే టీడీపీ కుటుంబాల పిల్లల్ని ఐడెంటిఫై చేసి, వాళ్లను ఫెయిల్ చేయాలని మౌఖికంగా అధికారుల్ని ఆదేశించి ఉంటాడా..? అనే రేంజులో టీడీపీ విరుచుకుపడింది… ఫోఫోవోయ్, నీ పాలనలో నువ్వేం ఉద్దరించావ్..? ఉద్దరిస్తే నిన్ను ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటూ వైసీపీ కౌంటర్లు…
జవాబు పత్రాలు దిద్దిన టీచర్లు ప్రభుత్వం మీద కోపాన్నంతా పిల్లల మీద చూపించారా..? ఏమాత్రం ఉదారంగా వ్యవహరించలేకపోయారా..? ఫాఫం, కరోనా బాధిత విద్యార్థులు అనే జాలి కూడా చూపించలేదా..? ఇలా బోలెడు చర్చ, రచ్చ… సరే, ఇంతకీ ఏపీలోనేనా..? అసలు వేరే రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి..? రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దిగువనే ఉండే అస్సోం సంగతి చూద్దాం…
మొన్నటి ఏడో తారీఖును టెన్త్ రిజల్ట్స్ ప్రకటించారు… 56.49 శాతం పాస్… అంతకుముందు రిజల్ట్ ఎంతో తెలుసా..? 93 శాతం… ఒకే ఏడాదిలో అంత తేడా ఏమిటి..? కేవలం కరోనా మాత్రమేనా..? ఇంకా ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయా..? ఇదీ కీలకప్రశ్న… ఉన్నాయి… కరోనా సంబంధ సమస్యలే… అదే సిలబస్, వాళ్లే టీచర్లు, అవే స్కూళ్లు కదా… మరి ఏడాదిలో ఈ తేడా ఎందుకు అంటే..?
Ads
కరోనా కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లనే పెద్ద తేడా కూడా ఏమీలేదు… ప్రభుత్వ స్కూళ్లలో 52, ప్రైవేటు స్కూళ్లలో 58 శాతం… 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు… 80 స్కూళ్లలో పాస్ శాతం పది, ఆలోపు… పేద జిల్లాలుగా పేరొందిన ప్రాంతాల్లో ఎక్కువ ఫెయిల్ శాతం ఉంది… ఎందుకంటే..? కరోనా కారణంగా 2020లో 8 నెలలు, 2021లో ఏడు నెలలు బళ్లు తెరుచుకోలేదు… టీచర్లు పోలేదు… చదువు చెప్పేవాళ్లు లేరు… పేద జిల్లాల్లో పుస్తకాలు కొనడానికే డబ్బుల్లేవు… ఇక ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్లు ఎక్కడివి..? గ్రామీణ ప్రాంతాల్లో అసలు బ్రాడ్ బ్యాండ్ ఏది..? మరి ఈ ఫోన్ల సప్లయ్ మీద ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా..? అస్సలు లేదు…
మరింత శాస్త్రీయ అధ్యయనం కూడా అవసరం… ఎగువ అస్సోంలోని ధేమజి జిల్లాలో 85.46 శాతం పాస్… కానీ దిగువ అస్సోంలోని చిరంగ్ జిల్లాలో పాస్ శాతం కేవలం 34.27 మాత్రమే… తేయాకు తోటల కార్మికులు ఎక్కువగా ఉండే జిల్లాలు, పర్వత ప్రాంతాలు, ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో కరోనా పెద్ద దెబ్బే కొట్టింది… పేదరికం కారణంగా పిల్లల చదువును తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోలేదు… కరోనా వంటి సమస్యలు ఊహించలేదు మనం… అందుకే సన్నద్ధత లేదు… కానీ ఇప్పుడు ఈ చేదు అనుభవాలు చూస్తున్నాం కదా, బడులకు వెళ్లని కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలూ పెరుగుతున్నాయి కదా… మరి ఇప్పటికైనా మనం ఏమైనా విపత్తు సన్నద్ధ ప్రణాళిక వైపు ఆలోచిస్తున్నామా..? అబ్బే… మన అధికారులకు, మన పార్టీలకు, మన ప్రజాప్రతినిధులకు, మన ప్రభుత్వాలకు అంత తీరిక లేదు… లేదు…!!
Share this Article