ఫాఫం చంద్రముఖి…! ఓ పోస్టర్ చూడగానే అనిపించింది ఇలాగే..! సదరు పోస్టర్ వార్తేమిటీ అంటే… లారెన్స్ ప్రధానపాత్రలో చంద్రముఖి-2 వస్తోందట… అది సీక్వెలా..? లేక వేరే కథకు ఈ పేరు పెట్టుకుని ‘కాయలమ్ముకుంటారా’ అనేది వేచిచూడాలి… కానీ ఎందుకు జాలేసిందో చెప్పుకోవడానికి మనం కేరళ వెళ్లాలి… రకరకాల కథలు, ప్రయోగాలు, చౌక ఖర్చు, వేగంగా నిర్మాణం, నో రిస్క్ ఇవన్నీ ఒకప్పటి మలయాళ సినిమా విశేషాలు…
మణిచిత్రతాజు సినిమా కూడా ఆ కోవలోనిదే… 1993లో… మోహన్‌లాల్ హీరోగా, సురేష్ గోపి- శోభన జంటగా రూపొందిన ఈ మూవీ దర్శకుడు ఫాజిల్… కథలో ఔచిత్యం దెబ్బతినకుండా ఒక సమస్యను ఫోకస్ చేశాడు… ఒక అమ్మాయికి తలెత్తిన Multiple Personality Disorder (Dissociative Identity Disorder) అనే ఓ మానసిక జబ్బు, తద్వారా ఎదురయ్యే సమస్యలతో కథ చివరకు భూతాలు, క్షుద్రశక్తులనే సందేహాల దాకా వెళ్తుంది… చివరకు ఓ మానసిక వైద్యుడు సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని పరిష్కరిస్తాడు… సినిమాలో శోభన నటన అపూర్వంగా ఉంటుంది… నిజానికి ఇది ఓ శాస్త్రీయ చిత్రం… సమస్యను సరైన కోణంలో ప్రజెంట్ చేస్తుంది…
ఆ కథలో మానసిక వైద్యుడికి సమస్య అర్థమైంది… ఆ కథేమిటో ప్రేక్షకుడికి కూడా అర్థమైంది… కానీ ఆ కథలోని ఆత్మ తరువాత మన సినిమావాళ్లకే అర్థం కాకపోవడం..! ఇదేమిటో అర్థం కావాలంటే మనం ఇంకొన్ని వివరాల్లోకి వెళ్లాలి… మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా కాబట్టి కన్నడంలో విష్ణువర్ధన్ హీరోగా నో రిస్క్ అనుకుని 2004లో ‘ఆప్తమిత్ర’గా రీమేక్ చేశారు… పి.వాసు దర్శకుడు… శోభన స్థానంలో సౌందర్యను తీసుకున్నారు… జస్ట్, విష్ణువర్ధన్ ఇమేజీకి తగినట్టు కొన్ని మార్పులు చేసుకున్నారు తప్ప కథలో వేళ్లు కాళ్లు పెట్టలేదు… అక్కడా సూపర్ హిట్… సౌందర్య కూడా అపూర్వంగా చేసింది…
Ads
మలయాళం, కన్నడంలో హిట్టయింది కదా… రజినీకాంత్ కన్నుపడింది… అదే వాసు దర్శకుడు… 2005లో ఫటాఫట్ నిర్మించేశారు… రజినీకాంత్ కోసం సూపర్ హీరోయిక్ ఫైట్లు, డాన్సులు, సాంగ్స్ పెట్టేశారు… సరిపోతాయో లేదో అని డౌటొచ్చి వెగటు సరసాలు, జోకులు కూడా పెట్టారు… కానీ ఆ కథలో దమ్ము ఆ సినిమాను హిట్ చేసింది… తెలుగులో కూడా రిలీజ్ చేశారు… జ్యోతిక కూడా శోభన, సౌందర్య స్థాయిలో నటించింది… నిజానికి అది ఆ పాత్ర కేరక్టరైజేషన్ గొప్పదనం… నాలుగు సౌత్ భాషల్లో సూపర్ హిట్ కదా… హిందీలో భూల్ భులయ్యా అని తీశారు… హిట్…
ఇక్కడ వాసు ప్రతిభ ఏమీ లేదు… మలయాళ ఫాజిల్ అడుగుల్లోనే రీమేక్ అడుగులతో నడిచాడు… చంద్రముఖి పాపులారిటీని సొమ్ము చేసుకోవడం కోసం ఎప్పుడైతే సీక్వెల్ ప్రయత్నాలు మొదలయ్యాయో ఇక దాన్ని భ్రష్టుపట్టించేశారు… కన్నడంలో మళ్లీ అదే విష్ణువర్దన్… ఆప్తరక్షక అని పేరు పెట్టారు… నాగవల్లి అనే పాత్ర సృష్టించి… ఒ:రిజినల్ చంద్రముఖి కథలోని ఆత్మను అర్థం చేసుకోకుండా… ఇందులో పక్కా టీవీ సీరియళ్ల బాపతు పాములు, భూతాలు, భయాలు, అఘోరాల్ని, అసహజ కథనాన్ని వదిలారు… ఓ చెత్త కథ… దీన్ని తెలుగులో నాగవల్లి పేరిట వెంకటేశ్ హీరోగా తీశారు… అనుష్కతోపాటు రిచా గంగోపాధ్యాయ్, శ్రద్ధా దాస్, కమలినీ ముఖర్జీ ఎందరున్నా సినిమాను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు…
కన్నడంలో తీసిన ఆప్తరక్షకను సబ్కారక్వాలా పేరిట హిందీలో డబ్ చేసి వదిలారు… ఎవరి ఇష్టారాజ్యం వాళ్లు… ఈమధ్య భూల్ భులయ్యా సెకండ్ కూడా తీశారు… చంద్రముఖి-2 తీస్తామని, రజినీకాంత్, లారెన్స్ ప్రధానపాత్రలు అని అప్పట్లో ప్రకటనలు చేశారు… విశేషం ఏమిటంటే… దీనికీ వాసుయే దర్శకుడట… తరువాత ఏమైందో తాజాగా కేవలం లారెన్స్ ప్రధానపాత్రగా ఈ సీక్వెల్ వస్తుందని ప్రకటించారు… ఇదీ ఆ నాగవల్లి బాపతు కథేనా..? లేక చంద్రముఖికి మరో సీక్వెలా..? నాగవల్లి కథను చెడగొట్టినట్టే చంద్రముఖి-2 ను కూడా భూతాలు, దెయ్యాల కథగా మార్చేస్తారా..?
ఈ డౌట్లు దేనికీ అంటే… లారెన్స్ అనగానే కాంచన సీరిస్ సినిమాలు గుర్తొస్తాయి… తను ఎంటర్టెయిన్ చేయగలడు… కానీ ఎంతసేపూ రకరకాల హారర్, థ్రిల్లర్, కామెడీ తరహా సీన్లుంటయ్… చంద్రముఖి సినిమా కథ వంటి దమ్మున్న కథలు కావు… జస్ట్, టైంపాస్ పల్లీ తరహా… అందుకే లారెన్స్ ప్రధానపాత్రలో చంద్రముఖి-2 సినిమా అనగానే… పైగా ఆ వాసు దర్శకుడు అని చదివాక… ఫాఫం చంద్రముఖి అనిపించింది…!!
Share this Article