పార్ధసారధి పోట్లూరి …… భారత దేశపు సూపర్ మార్కెట్లు రష్యాలో ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి – పుతిన్ !
ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ పేరుతో రష్యా దాడి చేయగానే పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ! రష్యాలోని సూపర్ మార్కెట్ల నుండి అమెరికన్, యూరోపియన్ రిటైలర్లు వెనక్కి వెళ్లిపోయారు. దాంతో మార్చి నెల రెండవ వారం వరకు రష్యన్ సూపర్ మార్కెట్లు సగానికి సగం ఖాళీ అయిపోయాయి. చైనా నుండి కొన్ని బ్రాండ్లు రష్యాలోకి వచ్చి చేరినా ఇంకా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి రష్యన్ సూపర్ మార్కెట్లు.
ఆహార పదార్ధాల విషయంలో చైనా తనవరకే పరిమితం అవుతున్నది తప్పితే ఎగుమతి చేయట్లేదు. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చింది. భారత్ ప్రతిపాదన చేయకముందే పుతిన్ తనంత తానే తమ రిటైల్ మార్కెట్ల విషయంలో భారత్ సహాయాన్ని అర్ధించాడు. ప్రస్తుతం రష్యాలో భారత్ రిటైల్ మార్కెట్ చైన్లని ఎలా ప్రవేశపెట్టాలా అని చర్చలు జరుగుతున్నాయి.
Ads
ఒకేసారి పెద్ద మొత్తంలో రష్యాలోని సూపర్ మార్కెట్లలో మన ఉత్పత్తులని పెట్టి అమ్మడానికి చిన్న, మధ్య స్థాయి రిటైలర్ల ఆర్ధిక స్థోమత సరిపోదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టగల వాళ్ళకే సాధ్యమవుతుంది. పూర్తిగా మన దేశ ఉత్పత్తులు రష్యాలో అమ్ముడుపోవు. యూరోపు, అమెరికాల నుండి కొన్ని ప్రొడక్ట్స్ ని కొని వాటిని మళ్ళీ రష్యాలో అమ్మాల్సి ఉంటుంది.
టాటా గ్రూప్, రిలయన్స్ రిటైల్, దమానీ [Dmart], Big Bazar లాంటి దిగ్గజాలు మాత్రమే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలరు. కొద్దో గొప్పో కొంతమంది భారతీయ ఉద్యోగులని అక్కడ ఉంచాల్సి వుంటుంది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వంతో కలిసి రష్యన్ అధికారులు ఒక రోడ్ మాప్ తయారుచేస్తున్నారు. ఎందుకంటే రష్యాలో డిమాండ్ మరియు సేల్స్ ఉండే ప్రొడక్ట్స్ వివరాలు రష్యన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అవి మన దేశంలో దొరుకుతాయా లేక దిగుమతి చేసుకోవాలా అనే విషయాలని పరిశీలించాల్సి ఉంటుంది.
ఇక బర్గర్ కింగ్ లాంటి ఫుడ్ చైన్లకి రష్యాలో డిమాండ్ ఉంది. ఇంకా ఏవన్నా భారతీయ ఫుడ్ చైన్ల కి అక్కడ అవకాశాలు ఉంటాయేమో పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రష్యాలో ఉన్న KFC రష్యాని వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
ఆటోమొబైల్ ;యూరోపు ఆటో దిగ్గజాలు అయిన దైమ్లర్ బెంజ్, రేనాల్ట్ లు రష్యాలో తమ కార్యకలాపాలని నిలిపివేశాయి. ఎక్కడ ఉన్నవి అక్కడ అలానే వదిలేసి వెళ్లిపోయాయి. కానీ రష్యా తమకి అందుబాటులో ఉన్న వాటితో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మరో వైపు బోయింగ్, ఎయిర్ బస్ విమానాలు రష్యా లీజుకి తీసుకొని నడుపుతున్నది. అయితే ఆంక్షల వల్ల వాటి ఆపరేషన్ నిలిచిపోవడంతో రష్యా వాటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని నడుపుతున్నది.
ఈ విమానాలకి ఇన్స్యూరెన్స్ చేసేవి అమెరికాకి చెందిన ఇన్స్యూరెన్స్ సంస్థలు. కానీ ఇప్పుడు అవి రష్యా ఆధీనలో ఉన్న విమానాలకి ఇన్స్యూరెన్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదు .. చైనాలో ఒకే ఒక్క అంతర్జాతీయ పౌర విమాన ఇన్స్యూరెన్స్ సంస్థ ఉంది. అది రష్యాలో నిలిచిపోయిన అమెరికన్, ఫ్రాన్స్ విమానాలకి ఇన్స్యూరెన్స్ చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు బోయింగ్, ఎయిర్ బస్ విమానాలకి స్పేర్ పార్ట్శ్ అవసరం ఉంది. కానీ చైనా తన దగ్గర ఉన్న స్పేర్ పార్ట్శ్ రష్యాకి ఇస్తుందా ? అలా చేస్తే చైనాని బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది బోయింగ్ మరియు ఎయిర్ బస్ సంస్థలకి.
మరోవైపు రష్యన్ ఆయిల్ బావులలో అమెరికన్, బ్రిటీష్ సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఆయిల్ ని వెలికితీసే ప్రక్రియలో భాగస్వాములుగా ఉంటూ వచ్చాయి. కానీ ఆంక్షల వల్ల రెండు దేశాలు వాళ్ళ సిబ్బందిని వెనక్కి పిలిపించాయి. దాంతో రష్యాలోని చాలా ఆయిల్ బావులలో చమురు వెలికి తీసే ప్రక్రియ త్వరలో ఆగిపోనుంది… ఇదే జరిగితే రష్యా తన ఆయిల్ ఎగుమతులలో కోత పెట్టాల్సి వస్తుంది. కానీ మోడీ ONGC కి అవకాశాలు ఉన్నాయేమో చూడమని ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఉన్నవి అమెరికన్, బ్రిటీష్ ఎక్విప్మెంట్ కాబట్టి వాటి మీద పనిచేసిన అనుభవం ONGC ఉంది కాబట్టి రష్యన్ ఆయిల్ రంగంలోకి ONGC కి అవకాశాలు ఉన్నాయి.
ఇవన్నీ చైనా చేయవచ్చు కదా ?
చైనా తన ఎగుమతులని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తూ చాలా వాటికి దూరంగా ఉంటున్నది ఇప్పుడు. భవిష్యత్ లో తమ ఎగుమతుల మీద [అన్నిటి మీద కాదు] ఆంక్షలు విధించకుండా జాగ్రత్తపడుతున్నది. అందుకే రష్యన్ రిటైల్ రంగం విషయంలో పుతిన్ భారత్ వైపు చూస్తున్నాడు.
అమెరికా చర్య ఎలా ఉంటుంది ?
ఇప్పటికే మన విదేశాంగ మంత్రి జై శంకర్ ఘాటుగా జవాబు ఇచ్చారు… ‘‘ప్రపంచంలో ఎక్కడ వ్యాపార అవకాశాలు ఉంటే అక్కడ భారత్ పెట్టుబడులు పెట్టే అధికారం ఉంది. మీరు మీ అవసరాల కోసం ఏ పని చేస్తున్నారో మేము మా అవసరాల కోసం అదే పని చేస్తున్నాము…’’ మరో వైపు భారత నావీ కి సంబంధించి F-18 సూపర్ హార్నెట్ కొనుగోలు మీద ఆశ పెట్టుకుంది బోయింగ్. భారత్ ఎయిర్ ఫోర్స్ కోసం 114 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో పాటు అమెరికా కూడా పోటీలో ఉంది.
అమెరికా తన అధునాతన F-15 EX స్ట్రైక్ ఈగిల్ ని భారత్ కి అమ్మడానికి గట్టి పట్టుదలతో ఉంది. ఇది రష్యన్ ఫైటర్ జెట్ లని భారత్ కి దూరంగా ఉంచడంలో సఫలీకృతం అవుతుంది అని అమెరికా భావిస్తున్నది కాబట్టి రష్యన్ రిటైల్ రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టడం మీద పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఎక్కడ వ్యాపార,వాణిజ్య అవకాశాలు ఉంటే అక్కడ భారత్ పెట్టుబడులు పెట్టే విషయంలో మోడీ ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నది. చూడాలిక…!!
Share this Article