తాము ఈ దేశ రాష్ట్రపతిగా గెలిపించబోతున్న ఓ గిరిజన నాయకురాల్ని రాంగోపాలవర్మ అనబడు వల్గర పాతాళుడు చిల్లర, నీచ వ్యాఖ్యానాలతో కించపరిచెను… హప్పుడు బీజేపీయులకు హెంత కోపం రావాలి..? పైపెచ్చు భారతంలో ద్రౌపది పేరు లాక్కొచ్చి, ఇష్టారీతిన ట్విట్టెను… హింకెంత ఆగ్రహం రావాలి..? హెంతసేపూ తవ్వితే శవం, లేదంటే శివం అని శివాలూదడమే తప్ప ఆ బండి సంజయుడికి ఈ ద్రౌపదీ పరాభవపర్వం ఏమర్థమైనట్టు..?
సరి సరి, హర్థం కాలేదుపో, ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేసిరట… తెలంగాణ పోలీసులు కేసు పెట్టెదరా..? పెట్టెదరని నమ్మెదరా..? తెలంగాణ ప్రభుత్వ లెక్కలు పైథాగరస్, ఆర్కిమెడిస్లకూ అందవు కదా… మన యశ్వంతుడి ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కదా, అందుకని మన వర్మే సుమీ అని అధికారికంగా సన్మానించినా హాశ్చర్యపడే పనిలేదు…
తెలుగు బీజేపీయులకు పాపం నోరు వాయి రెండూ అంతంతమాత్రమే కదా… ఆ వాసిరెడ్డి పద్మమ్మ గారు ఏవో నోటీసులన్నారు కానీ ఆ తాటాకు చప్పుళ్లకు వర్మలు బెదురుతాయా..? పత్రికల్లో, టీవీల్లో వార్త కవరయ్యాక అవి మళ్లీ గుర్తుండునా..? ఏమో., తెలుగు గిరిజన మరియు మహిళ అభ్యుదయ, హక్కులు, చైతన్య, పోరాట సంఘాలేమైనా స్పందిస్తాయేమో అని ఎదురు చూసీ చూసీ కాన్పూరులో ఒకాయనకు బుర్ర మండినది…
Ads
ఈ ద్రౌపది భాజపా కావున ఎర్రవర్గీయులు వీలైతే తూలనాడెదరు తప్ప మద్దతు అనరు కదా… అందుకని ఆతండు వేంఠనే వెళ్లి హజ్రత్గంజ్ అనబడు ఠాణాలో ఫిర్యాదునొసగెను… ఉత్తరప్రదేశం ఇప్పుడు కమలపాలనలో కలదు కదా, సత్వరం స్పందించి కేసు నమోదు చేసిరి… (ఆ వల్గర వర్ముడు ఏమేం వ్యాఖ్యానించినో తిరిగి ప్రస్తావించుకొనుట ఉచితం కాదు, సంస్కారమూ కాదు)
తీవ్రమైన సెక్షన్లనే పెట్టిరట… కొంతకాలముగా మధ్యప్రదేశ హోం అమాత్యుడు నరోత్తమ మిశ్రా నిర్లిప్తంగా మారిపోయెను, లేనియెడల తక్షణం మూడో కన్ను తెరుచువాడు… వర్మ దుస్తులకు మంట అంటుకుని ఉండును… ప్రస్తుతము తీస్తా సేతల్వాదు, ఆర్బీ శ్రీకుమారు, సంజీవ భట్టులను కటకటాల పాలుచేసిరి కదా… ఆల్ట్ న్యూస్ నడుపు జుబైరుడిని కూడా నిర్బంధించిరి కదా…
పనిగట్టుకుని అప్రదిష్టపాలు చేయు వారిని ఇక ఉపేక్షించరట… ఎవరి మీద అవకాశం దొరికినా వదిలేది లేదుట ఇక… ఈ నేపథ్యమున ఈ వర్ముడిని కూడా రారమ్మని కాన్పూరు కారాగారం పిలుచుచుండెనా..? ఐనా, తెలంగాణ పోలీసులు వర్మ నిర్బంధానికి అనుమతించరేమో… ఆ ముంబయ్యో, ఏ ఢిల్లీయో, విజయవాడో వెళ్లినప్పుడు కాపు కాసి, సంకెళ్లు వేయుటే మార్గమా..?!
Share this Article