2010… సోనియా కొడుకు రాహుల్, బిడ్డ ప్రియాంక ఓ స్పెషల్ ఫ్లయిట్లో ఢిల్లీ నుంచి కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు… అక్కడి నుంచి రోడ్డు మార్గంలో త్రిసూర్ వెళ్లారు… పెద్దగా హడావుడి లేదు… అసలు వాళ్ల రాక మీద ఎవరికీ సమాచారం లేదు… అంతటి హైప్రొఫైల్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అన్నాచెల్లెళ్లు లోప్రొఫైల్‌లో ఓ పెళ్లికి హాజరయ్యారు…
ఆ పెళ్లి ఎవరిదంటే..? సోనియా కుటుంబం దగ్గర రెండు దశాబ్దాలుగా పర్సనల్ సెక్రెటరీగా పనిచేస్తున్న పీపీ మాధవన్ కొడుకుది… వధువు స్థానిక అమ్మాయే… పెళ్లిలో ఇతరత్రా కాంగ్రెస్ నాయకులు గట్రా ఎవరూ కనిపించలేదు… సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఆ పెళ్లికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రాహుల్, ప్రియాంక వచ్చారంటే మాధవన్ పట్ల ఆ కుటుంబం నమ్మకం, అభిమానం అర్థం చేసుకోవచ్చు… తరువాత ఢిల్లీలో జరిగిన రిసెప్షన్ విందుకు చాలామంది పెద్ద నేతలు హాజరయ్యారు, అది వేరే సంగతి…
విషయం ఏమిటంటే..? మాధవన్ ఇంపార్టెన్స్… సోనియా కుటుంబానికి సంబంధించిన అపాయింట్మెంట్స్ సహా ముఖ్యమైన భేటీలు గట్రా మొత్తం మాధవన్ చూసుకుంటాడు… అదుగో ఆ మాధవన్ వయస్సు ఇప్పుడు 71 ఏళ్లు… సోనియా కుటుంబాన్ని రకరకాలుగా టార్గెట్ చేస్తున్న బీజేపీ దిగజారి మాధవన్‌ను టార్గెట్ చేసిందనిపిస్తోంది…
Ads
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను, రాహుల్‌ను బుక్ చేశారు… అందులో కొన్ని తప్పులున్నయ్… అక్రమాలున్నయ్… రాహుల్‌ను ఈడీ పిలిచి నాలుగు రోజులపాటు దాదాపు 50 గంటలు కూర్చోబెట్టింది… అది మెంటల్‌గా బ్రేక్ చేయడానికి, సతాయించే విచారణ… విపాసన ధ్యానం ద్వారా ఈడీ ఎత్తుగడల్ని వమ్ము చేశానని రాహుల్ చెప్పుకున్నాడు… లైట్ తీసుకున్నాడు… నిజానికి ఆ కేసులో అంత సుదీర్ఘంగా విచారించే అంశాలేమీ లేవు… నేరుగా కోర్టుకు రిపోర్ట్ చేయడమే… ఐనాసరే, సోనియాను, రాహుల్‌ను ఈడీ ఎదుట రోజుల తరబడీ కూర్చోబెట్టాలనేది ప్లాన్…
సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అనుకుందాం… ఎలాగూ ఇది పాత బీజేపీ కాదు, మోడీషా బీజేపీ ఏదైనా చేయగలదు… కానీ మరీ ఈ మాధవన్ మీద రేప్ కేసు అనేది మరీ దిగజారుడు అనిపిస్తోంది… తన మీద కంప్లయింట్ చేసింది 26 ఏళ్ల ఓ దళిత మహిళ… గత ఫిబ్రవరిలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడి చేశాడనేది ఆరోపణ… ఆ కంప్లయింట్ మీద మొన్న సదరు పోలీస్ స్టేషన్ వెళ్లి మరీ మాధవన్ వివరణ ఇచ్చాడు… స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మొత్తం విని మీరు వెళ్లిపోవచ్చు అన్నాడు…
ఇప్పుడు కేసు నమోదు చేశారు… కాంగ్రెస్ ఎలాగూ పతనావస్థలో ఉంది… అలాంటిది సోనియా కుటుంబాన్ని టార్గెట్ చేసి, ఇలాంటి చర్యలతో డిస్టర్బ్ చేయడం మరీ ఏపీ పాలిటిక్స్ స్థాయికి బీజేపీ దిగజారిందా అనే సందేహాలకు తావిస్తోంది… బాధితురాలికి గాంధీ కుటుంబ ఆఫీసులోనే జాబ్ కావాలట… 2020లో భర్త చనిపోతే, పొట్టపోసుకోవడం కోసం అక్కడే జాబ్ కోసం ప్రయత్నించిందట… ఒక లైంగిక బాధితురాలి పట్ల జాలి ఉండాలి… నిజమే… కానీ అది రాజకీయ ప్రేరేపితమా అనే కోణంలోనూ పరిశీలన, పరిశోధన, దర్యాప్తు, కేసుకు ముందస్తు విచారణ అవసరం కదా… (ఢిల్లీ ప్రభుత్వం ఆప్‌దే అయినా శాంతిభద్రతలు, పోలీసు యంత్రాంగం కేంద్రం పరిధిలో ఉంటాయి…)
బీజేపీ అత్యంత బలోపేతంగా ఉంది… సాధన సంపత్తి పుష్కలం… ఏదంటే అది కొనుగోలు చేసే స్థితిలో ఉంది… ఇంకోవైపు కాంగ్రెస్ నానాటికీ దిగదుడుపు అనే స్థాయిలో దయనీయస్థితిలో ఉంది… ఇలాంటప్పుడు పోరాటం మరింత ఫెయిర్‌గా, స్ట్రెయిట్‌గా ఉండాలి… రాజకీయంగా కొట్టాలి… ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే మరింత తొక్కాలి, అన్నీ నిజమే… కానీ మరీ ప్రత్యర్థి కుటుంబ సిబ్బందిని కూడా టార్గెట్ చేయాలా..?!
Share this Article