Prasen Bellamkonda…… ‘అనేక్ ‘ బోరింగ్, స్లో అండ్ లెంగ్తి,… గజిబిజి, చిరాకు…. అయినా సరే..తప్పక చూడండి…. అవును…….. తప్పక చూడండి… కొంపలేం మునగలేదు. మీ అమూల్యమైన జీవితకాలంలోంచి ఓ 120 నిముషాలు వెచ్చించినందుకు నేను పైన చెప్పిన ఫీలింగ్స్ అన్నీ మిమ్మల్ని మూకుమ్మడిగా ముంచెత్తితే ముంచెత్తచ్చు గాక… కానీ మరో వైపు మీ ఆలోచన విశాలం కూడా అవడం ఖాయం. మేం భారతీయులమే అనిపించుకోవడానికి కొందరు భారతీయులు పడే తపన తెలుస్తుంది. భారతీయత మీది ప్రేమతో భారతదేశం మీదే పోరాడాల్సొచ్చిన విషాదం గురించి అర్ధమవుతుంది. ఈశాన్య రాజకీయాల గురించి తెలియకున్నా తోటి భారతీయుల గురించి మాత్రం ఖచ్చితంగా కొంచెం మెరుగ్గా తెలుస్తుంది…
మంచి కథే చెప్పాడు… ఓహో.. బాగా చెప్పలేదనేదేనా మీ ప్రశ్న…? సరే… కావచ్చు… మంచి కథయితే చెప్పాడు కదా. ఇంకేం? బోలెడంత అయోమయం ఉందా? చెప్పలేనంత గందరగోళం ఉందా? ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టత లేదా? ఏ సమస్య గురించి మాట్లాడాలనుకున్నాడో తెలియడం లేదా? నిజమే… ఆ సెవెన్ సిస్టర్స్ సమస్యే అది కదా! మన ఈశాన్యం సమస్యే అది కదా..!
అంతంలేని విషాదం, లెక్కదొరకని దుఃఖం, ప్రతి పది అడుగులకో తుపాకీ, అది శత్రువుదో మిత్రునిదో అర్ధమవని భయం, గోళీ లాడుకునే ప్రాయం మందుగుండు సామగ్రితో సహవాసం చేస్తున్న వైరుధ్యం….. పేరుకే ఈశాన్య భారత్ అని సమగ్ర నామం కానీ భాషలు వేరు, సంస్కృతులు వేరు, సమస్యలు వేరు, ఉమ్మడిగా ఉన్నది ఒకటే… ఉగ్రవాదం.
Ads
ఆత్మగౌరవం కోసం పోరాడే ఉగ్రవాద సంస్థలు కొన్నయితే వాటిని అణగతొక్కడానికి ప్రభుత్వమే నడిపే ఉగ్రవాద సంస్థలు ఇంకొన్ని. ఇన్నున్నాయి కనుకనే ఆ అయోమయం. ఆ గందరగోళం. అక్కడి జీవితమే అలా వున్నపుడు ఆ కధతో తీసిన సినిమా అలా కాక ఇంకెలా ఉంటుంది. Anek లానే ఉంటుంది… అందుకే సినిమా పేరు అనేక్…
మేరికామ్ గెలుపు మాత్రమే భారతానికి తెలుసు… ఆ గెలుపు నేపధ్యంలో ఆమె మాట్లాడిన వివక్ష భావం లోతు గురించి ఇతర భారతానికి తెలియదు… చాను షర్మిల నిరసన దినాల సంఖ్య మాత్రమే భారతానికి తెలుసు కానీ ఆ నిరసన వెనుక దాగిన వేదన ఇతర భారతానికి తెలియదు. నిజం చెప్పాలంటే అసలు ఈశాన్య భారత ప్రజల గుండె మంట ఇతర భారతానికి రవ్వంత కూడా తెలీదు. పింక్ లో ఆ నలుగురిలో ఒకరు ఈశాన్య అమ్మాయి అని తెలియగానే లాయర్ రియాక్షన్ ఎందరికి అర్ధమైందో, అమితాబ్ ఆ ప్రాంత సాంస్కృతిక వైభవం గురించి చెప్పాకైనా కొందరికైనా అర్ధమైందో లేదో నాకైతే సందేహమే..
****
నెట్ఫ్లిక్స్ ఓటిటి తిరగేస్తున్నపుడు ‘అనేక్ ‘ కనపడింది. అంతకు ముందు నాకు ఈ సినిమా గురించి తెలియదు. Anek స్పెల్లింగ్ లో NE మాత్రమే పెద్ద సైజ్ లో ఉండడం చూసి వీడెవడండీ లోగో ఇంత బేకార్ గా డిజైన్ చేయించుకున్నాడు అని గొణుక్కున్నా. వివరాల్లోకి వెళితే అనుభవ్ సిన్హా డైరెక్టర్. ముల్క్, తప్పడ్, ఆర్టికల్ 15 గుర్తొచ్చాయి. ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్. ఖురానా సినిమాల ఎంపిక మీద నాకో గౌరవం ఉంది. ఎనిమిది వరుస మంచి హిట్లిచ్చిన హీరో. హిందీలో ఆ రికార్డ్ ఏ ఖాన్ కూ లేదు.
చూడడం మొదలుపెట్టాక గానీ ఆ అనేక్ లోగోలోని NE అంటే నార్త్ ఈస్ట్ అని అర్ధం కాలేదు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ముఖ్యంగా బ్యాక్ గ్రవుండ్ ఎంచుకున్న డైరెక్టర్ ధైర్యం నచ్చింది. ఎక్కువ పాత్రలకు ఈశాన్య నటులనే తీసుకోవడం కూడా నచ్చింది. అందరూ బాగా చెయ్యడం, బాక్సర్ ఐడో పాత్రధారిణి ఇంకా బాగా చేయడం మరీ నచ్చింది. అన్నట్టు మన జేడి చక్రవర్తి కూడా ఉన్నాడు.
సంభాషణలు పొలిటికల్లి ఎమోషనల్……
‘ ఒకళ్ళ శాంతి, ఇంకొకరికి గందరగోళం ‘
‘ శాంతిని నిర్వహించడంకంటే యుద్దాన్ని నిర్వహించడమే సులభం ‘
‘ ఎవడు నార్తో ఎవడు సౌతో మనం మాట్లాడే హిందీ నిర్ణయిస్తదనమాట ‘
‘ ఇండియా మ్యాప్ లో రాష్ట్రాల గీతలన్నీ చెరిపేస్తే ఏ భారతీయుడయినా ఇదీ నా రాష్ట్రం అని గుర్తించగలడా ‘
‘ నా గెలుపుకు నువ్వు చప్పట్లు కొట్టలేవు నీ గెలుపుకు నేను చప్పట్లు కొట్టలేను.. మనం ఇలానే మిగిలుంటాం ‘ లాంటివి మచ్చుకు కొన్ని.
ఎవరు భారతీయుడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. ఆయుష్మాన్ ఖురానా అండర్ కవర్ ఆపరేషన్ , భారత్ కు ఆడడానికి ఓ లేడి బాక్సర్ చేసే చాలెంజ్, ఉగ్రవాద సమస్య వంటి మసాలా ముడిసరుకున్నా సినిమా స్లో నేరేటివే. కథ ఎంతకూ కధలనట్టే ఉంటది. సీరియస్ సంభాషణల పొడవెక్కువ. ఖురానా మినహా నటులెవరూ తెలీరు…. అయినా చూడండి తప్పక. యధార్ధ ఘటనలు, సమకాలీన రాజకీయాలు, నిజ జీవిత గాధల ఆధారంగా సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇదొక మంచి సినిమా… అనేక సినిమాల నడుమ ఈ అనేక్ ఓ యూనిక్…
Share this Article