కొందరు ఎందుకోగానీ గుండెలు తెగ బాదుకుంటున్నారు… మహారాష్ట్రంలో బీజేపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని..! నిజమేనా..? సహజంగానే బీజేపీ, మోడీ అనగానే మబ్బులకొద్దీ ద్వేషాన్ని వర్షించేవాళ్లు ఎలాగూ ఉంటారు… అయితే కుటుంబ పార్టీలు, వారస నేతల క్యాంపులు కూడా బీజేపీ అనైతిక రాజకీయాలంటూ విమర్శించడం నవ్వొచ్చే ఓ ప్రహసనం… ఆ పార్టీలు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కొనవచ్చునట, అదేమో పవిత్రం, బీజేపీ చేసేదే అపవిత్రమా..?
ఓ నిజాన్ని ఈ గ్రూపులు మరిచిపోతున్నాయి… గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఓ కూటమిగా పోటీచేశాయి… బీజేపీ 106, శివసేన 56 గెలుచుకున్నాయి… కూటమికి స్పష్టమైన మెజారిటీ… అది ప్రజాతీర్పు… కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కూటమిగానే పోటీచేశాయి… కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 దక్కించుకున్నాయి… అంటే ప్రజల నుంచి తిరస్కరణ… కానీ అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టాడు… అదీ అనైతికత అంటే..!
ఇది ఎందుకు మంచిదో కూడా ఓసారి చెప్పుకోవాలి… దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలున్నయ్… ఎక్కువగా కుటుంబ పార్టీలు… తమ సొంత ఆస్తుల్లాగే ఆయా పార్టీల అధినేతలు తమ కొడుకులకు పార్టీల వారసత్వాన్ని రాసిచ్చేస్తుంటారు… ఇక్కడా పితృస్వామ్యమే… బిడ్డలకు వారసత్వం ఉండదు… (కొడుకుల్లేకపోతే తప్ప…) ఆ వారసులకు నాయకత్వ లక్షణాలు లేకపోయినా సరే, పార్టీ బలాన్ని కాపాడే సామర్థ్యం లేకపోయినా సరే నడిపించేస్తుంటారు… సేమ్, ఉద్దవ్ ఠాక్రేలాగా..!
Ads
అలాంటి వారసులకు ఓ గుణపాఠం ప్రస్తుత మహారాష్ట్ర సంక్షోభం… తండ్రులు రాసిచ్చే వారసత్వాలు కాదు, పార్టీ సిద్ధాంతాల్ని కాపాడాలి, నాయక శ్రేణిని కాపాడుకోవాలి, జనంలో ఆదరణను పెంచుకోవాలి… లేకపోతే, ఇదుగో ఇలాగే ఏకనాథ్ షిండేలు పగ్గాలు పట్టుకుంటారు… 56 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు, 15 మందిలో 14 మంది ఎంపీలు షిండేకు జైకొడుతున్నారంటే… అది షిండే పట్ల నమ్మకమో, ప్రేమో కాదు… ఠాక్రే నాయకత్వం మీద స్పష్టమైన తిరస్కృతి…
జరగాలి… కుటుంబ పార్టీలు, వారసనేతలకు ఈ పాఠం దేశంలో ప్రజాస్వామ్యానికి మంచిదే… ఇక్కడ బీజేపీ ఏదో పత్తిత్తు అని సమర్థించాల్సిన పనేమీ లేదు… కేసీయార్ భాషలో చెప్పాలంటే అదేమీ అహోబిలం మఠం కాదు, అదీ ఫక్తు రాజకీయ పార్టీయే… ఇప్పుడిది అద్వానీ, వాజపేయి కాలం నాటి బీజేపీ కాదు… మోడీ షా తరహా బీజేపీ… అన్ని పార్టీల్లాగే అదీ రాజకీయమే చేస్తోంది… అంతే…
మరో అంశం… ఏకనాథ్ షిండే తిరుగుబాటు వర్గానికి ఓ చాన్స్ దొరికింది… అప్పట్లో చంద్రబాబు తన మామ ఎన్టీయార్ నుంచి పార్టీని, పార్టీ గుర్తును పూర్తిగా హైజాక్ చేసినట్టే… షిండేకు కూడా ఇప్పుడు పూర్తిగా శివసేనను స్వాధీనం చేసుకునే అవకాశం దక్కింది… మూడింట రెండో వంతు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఠాక్రేను వ్యతిరేకిస్తున్నారు… సరిగ్గా ప్రయత్నిస్తే శివసేన, దాని ఎన్నికల గుర్తుతోసహా షిండే వశమైపోతుంది…
కుటుంబ, వారస పార్టీలకు ఇదొక కనువిప్పు కావాలి… అంతేకాదు, సంజయ్ రౌత్ వంటి నేతల్ని నమ్ముకుంటే ఎంత టైటానిక్ అయినా విరిగిపడి, మునిగిపోవాల్సిందే అనే నిజం ప్రాంతీయ పార్టీల నేతలకు తెలిసి రావాలి… జనంలో ఆదరణను రాజకీయాల్లో సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించే సినిమా తారల రాజకీయాల్ని ప్రజలు అడ్డంగా తిరస్కరిస్తున్నారు… జనంలో ఆ స్పృహ వచ్చేసింది… ఇంకోవైపు పార్టీల అధినేతలు తమ కొడుకులను తమ మీద రుద్దితే, కట్టుబానిసల్లా కట్టుబడి ఉండనక్కర్లేదని కూడా మహారాష్ట్ర తిరుగుబాటువర్గం ఓ సందేశాన్ని పరోక్షంగా చెబుతోంది… సో, మరక మంచిదే…!
Share this Article