ప్రధాని నరేంద్ర మోడీకి గానీ… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గానీ ఏమాత్రం విలువలున్నా సరే… మర్యాదమన్ననా తెలిసిన వారే అయితే… గౌరవసంస్కారాల పట్ల నిబద్ధత ఉన్నవాళ్లే అయితే… తమ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసి, వాపస్ వెళ్లిపోయే వేళ… ఖచ్చితంగా కేసీయార్‌కు కృతజ్ఞతలు చెప్పాలి… అసలు ఆ కార్యవర్గ భేటీలోనే కేసీయార్‌కు కృతజ్ఞతల తీర్మానం పెట్టినా తప్పులేదు… ‘స్నేహితుడా, రహస్య స్నేహితుడా’ అనే శీర్షికతో ఒకటీరెండు పత్రికల్లో థాంక్స్ యాడ్స్ ఇచ్చినా బెటరే…
అన్ని పార్టీల్లాగే బీజేపీ ఓ రాజకీయ పార్టీ… జాతీయ పార్టీ కాబట్టి అవసరాన్ని బట్టి, ఆలోచనను బట్టి ఒక్కో రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటూ ఉంటుంది… ఏవో తీర్మానాలు చేసుకునేవాళ్లు, ఎవరి తోవన వాళ్లు వెళ్లిపోయేవాళ్లు… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, వరుసగా ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తూ పోతోంది కాబట్టి… బాగా సాధనసంపత్తి ఉన్న పార్టీ కాబట్టి… ఆ పార్టీ కార్యవర్గ భేటీలంటే సహజంగానే మీడియా అటెన్షన్ ఉంటుంది…
పెద్దగా సామాన్యజనంలో జాతీయ కార్యవర్గ భేటీల మీద చర్చ ఉండదు… పట్టించుకోరు… కానీ కేసీయార్ పుణ్యమాని బీజేపీకి మస్తు మైలేజీ వచ్చింది… పత్రికల్లో జాకెట్ యాడ్స్, సిటీలో అనేక ఫ్లెక్సీలు, బ్యానర్లు, మెట్రోలు, ఫ్లయ్ ఓవర్ల పిల్లర్లకు ప్రచారచిత్రాలు, మోడీ మీద నిందలు, రాష్ట్రపతి అభ్యర్థికి స్వాగతాలు, వేల మందితో వెహికిల్ ర్యాలీల ఏర్పాట్లు, ప్రెస్‌మీట్లు… ధూంధాం… యాడ్స్‌లో కేసీయార్ గొప్పదనాలు, విజయాలు, డీజే హోరు సరేసరి…
Ads
మామూలు పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు… కాకపోతే ఈ పబ్లిసిటీ తిప్పలు, ఖర్చులు, టీఆర్ఎస్ ఉలికిపాట్లు, ఈ హంగామా… కేసీయార్‌కు మైలేజీ మాటేమిటో గానీ… కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి బీజేపీ కార్యవర్గ సమావేశాల మీద స్థానికంగా కూడా చర్చ జరిగేందుకు వీలు కల్పించాయి… టీఆర్ఎస్ ఎందుకు ఉలిక్కిపడుతోంది, ఏదో తేడా కొడుతోంది అనే జనం చర్చలకు కూడా ఈ హడావుడి ఆస్కారం కల్పిస్తోంది…
టీఆర్ఎస్‌లో ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానంత గందరగోళం ఎందుకొస్తోంది..? పీకే సర్వేల్లో జనం వ్యతిరేకత బట్టబయలైన కలవరపాట్లా ఇవి..? ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నవ్ అనడుగుతారు..? ప్రధాని నిక్షేపంగా తన మొహం పెట్టుకునే వస్తాడు… ఏం..? టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి వీసాలు తీసుకోవాలా..? మళ్లీ కేటీయారే ఆవో, దేఖో అంటాడు… విద్వేషం కాదు, వికాసం మీద చర్చించండి అంటాడు… ఏ పార్టీ తన జాతీయ కార్యవర్గ భేటీల్లో ఏం చర్చించాలో కూడా టీఆర్ఎస్సే డిక్టేట్ చేయాలా..?
అక్కడెక్కడో మాట్లాడుతూ… నోరు జారి… పప్పు, చారి, గొట్టంగాడు అన్నాడు కేటీయార్… ఎందుకీ తడబాట్లు..? అలా సైలెంటుగా వదిలేస్తే బీజేపీ తన భేటీలు తను చేసుకునేది, రెండుమూడు రోజులు పత్రికలు ఏవో రాస్తాయి, ఏదీ దొరక్కపోతే యాదమ్మ వంటల మెనూ గురించి రాసుకుంటాయి… ఇప్పుడేం జరిగింది..? టీఆర్ఎస్ ఓవర్ కౌంటర్ ఆపరేషన్‌తో బీజేపీకి అనూహ్యంగా నెగెటివ్ పబ్లిసిటీని అందించినట్టయింది…!! కానీ ఏమాటకామాట… మీడియా మాత్రం ఫుల్ ఖుష్… వేరే వార్తలు అవసరం లేదు, పైగా బోలెడు యాడ్స్, డబ్బులు… సార్, మోడీ గారూ, వీలయితే రెండుమూడు నెలల్లో మళ్లీ ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టేయండి సార్… మాకు కేసీయార్ మస్తు యాడ్స్ ఇస్తాడు… ప్లీజ్ సార్…!!
Share this Article