‘‘2001… ఓ శనివారం… ఫోన్ మోగింది… బాలా సాహెబ్ మాట్లాడాలని అనుకుంటున్నాడని చెప్పాడు ఆ కాలర్… నాకు అర్థమైపోయింది… అంతకుముందు తనను ఓ మాఫియా స్వరూపంగా ఏదో ఆర్టికల్‌లో రాశాను కదా… ఈ కాల్ వెనుక కారణం అదే… పరుషంగా మాట్లాడతాడని అనుకున్నాను… కానీ కాదు… చాలా కాజువల్ టాక్… ‘‘నన్ను తిట్టుకునేవాళ్లు చాలామంది… అందులో మీరొక్కరు కాస్త బాగా రాశారు..’’ అన్నాడు… కాస్త అదనపు ఎఫెక్ట్ కోసం… ‘‘మరీ రాజదీప్ సర్దేశాయ్‌లా గాకుండా..’’ అనీ అన్నాడు… అఫ్‌కోర్స్, రాజదీప్‌తో మాట్లాడినప్పుడు నా గురించి అలాగే వ్యాఖ్యానిస్తాడేమో…
‘ఆహాఁ, నా రచన తీరు మీకు నచ్చిందిగా, ఏమిస్తారు..?’ అనడిగాను కాజువల్‌గానే… ముంబైలో మంచి విందు ఇస్తాను, వస్తానంటే మీ శ్రీమతితోపాటు రండి అని ఆహ్వానించాడు… ‘‘మీరు మాంసం తింటారా..? వైన్ తీసుకుంటారా..?’’ అనీ అడిగాడు… తీసుకుంటాం అన్నాను నేను… ‘‘నేను వైట్ వైన్ మాత్రమే తాగుతాను, అదే మీకూ ఆఫర్ చేస్తాను… నిజానికి రెడ్ వైన్ గుండెకు మంచిది అంటారు… కానీ నాకు అసలు హృదయం అంటూ ఉంటే కదా…’’ అని నవ్వి ఫోన్ పెట్టేశాడు…
మాతోశ్రీలోనే విందు ఇచ్చాడు… మరీ డిప్లొమాట్‌గా ఏమీ మాట్లాడడు… కడుపులో ఉన్నది చెప్పేస్తాడు… అప్పట్లో వాజపేయి ప్రభుత్వంలో తన మంత్రి సురేష్ ప్రభు ఉండేవాడు… కానీ తన మీద ఠాక్రేకు అసంతృప్తి… అసమర్థుడు, అవినీతిపరుడు అంటాడు… ఇదే ఓసారి ప్రమోద్ మహాజన్‌తో అన్నాడట… (తను అప్పట్లో బీజేపీలో కీలకనాయకుడు)… ‘‘ఠాక్రే సాబ్, ఓ కేంద్ర మంత్రిగా ఉండి, పార్టీకి డబ్బు సమకూర్చలేనివాడు అసమర్థుడు లేదా అబద్ధాలకోరు అయిఉంటాడు’’ అని ప్రమోద్ బదులిచ్చాడట…
Ads
‘‘ప్రమోద్ అధికారాన్ని నగదీకరించడంలో నిపుణుడు’’ అనీ ప్రశంసించాడు ఠాక్రే… ఈ సంభాషణ మామధ్య జరుగుతున్నప్పుడు మనమలు అక్కడే తచ్చాడుతున్నారు… ఒకరు WWF టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు… అరేయ్, ఆ ప్రితిష్ నంది షర్టేమిట్రా..? అని నాముందే గదిమాడు… అదేమిటి, ప్రితిష్ మీవాడే కదా, మీ పార్టీ ఎంపీ కదా అన్నాన్నేను… ‘‘అదే సమస్య… నా నుంచి రాజ్యసభ సీటు తీసుకున్నాడు… తను క్రిస్టియన్ అట… నాకేమో చెప్పలేదు… చెప్పి ఉంటే ఎంపీ సీటు ఇచ్చి ఉండేవాడిని కాను’’ అనేశాడు…
తనకు ఎనభై ఏళ్లు వచ్చినప్పుడు 2007లో ఎన్డీటీవీ కోసం ‘వాక్ ది టాక్’ ఇంటర్వ్యూ చేశాక ఫోటో ఇది… వెనుక మైఖేల్ జాన్సన్‌తో బాలా సాహెబ్… మా ఇద్దరి చేతుల్లో అదే వైట్ వైన్… అప్పుడు కూడా అధికారం, డబ్బు అనే ప్రస్తావన వచ్చింది… నిజానికి డబ్బే శివసేన ఐడియాలజీ… దోపిడీ అనండి, లేదా పార్టీ రక్షణ సొత్తు అనండి… ఉద్ధవ్ దానికి చాన్సివ్వడం లేదు… అందుకే షిండే తాలూకు శివసైనికుల ప్రధాన కంప్లయింట్ అదే అయిఉంటుంది……’’
ఇదీ దిప్రింట్ వెబ్‌సైట్‌లో శేఖర్ గుప్తా అనే జగమెరిగిన సీనియర్ జర్నలిస్టు రాసుకొచ్చిన ఓ వ్యాసం… నిజానికి ఇదే గతంలో ఇదే సైటులో రాశాడు… అందులో ఇంకా చాలా విషయలున్నాయి… వాటి జోలికి మనం పోనక్కర్లేదు… రాజకీయంగా, నైతికంగా, సైద్దాంతికంగా ఠాక్రే ఎలా ఓడిపోయాడు అని విశ్లేషిస్తూ… ఈ పాత కథే మళ్లీ రాసుకొచ్చాడు… ఎందుకూ అంటే..? శివసేనకు వేరే ఐడియాలజీ లేదు, జస్ట్ డబ్బు తప్ప అని చెప్పడానికి..! కానీ ఆయన షిండే వర్గం మీద దారుణమైన నింద మోపినట్టు అనిపించింది…
ఒకవైపు తనే తన విశ్లేషణలో రాసుకొచ్చాడు… శివసేనది మరాఠీవాదం ప్లస్ హిందూవాదం మిశ్రమం అని… ఎస్, ఇతర పార్టీలతో పోలిస్తే శివసేనది కాస్త రౌడీ టైప్ రాజకీయం… ఇదే షిండే కూడా ఆ తరహా రాజకీయాలు చేసినవాడే… కానీ డబ్బు కోసమేనా..? శేఖర్ గుప్తా ఆరోపించినట్టు అదేనా శివసేన సిద్ధాంతం..? అసలు శివసేన మొదటి నుంచి ఎదిగింది మరాఠీ అస్థిత్వవాదం మీద… తరువాత హిందుత్వ వచ్చి చేరింది…
నిజానికి ఠాక్రేకు పదవుల మీద పిచ్చేమీ లేదు… తను కింగ్‌గానో, కింగ్‌మేకర్‌గానో ఉండాలని కోరుకోడు… తను ఓ డాన్… నెపోలియన్ తరహా… కుర్చీని ఓ పనికిరాని ఫర్నీచర్ అనుకుంటాడు… పైగా ఏ విషయం మీదనైనా స్థిరంగా ఏమీ ఉండడు… గంటల్లో తన వైఖరి మార్చుకోగలడు… తన ఇష్టం… కరడుగట్టిన ముస్లిం వ్యతిరేకిగా ముద్ర పడింది కదా… సంజయ్ దత్‌ను బహిరంగంగా, బలంగా సపోర్ట్ చేశాడు… కాంగ్రెస్ వ్యతిరేకి కదా… ఎమర్జెన్సీ సమయంలో ఇందిరను సపోర్ట్ చేశాడు… పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేది లేదంటూ పిచ్ తవ్విపోశారు కదా, జావేద్ మియాందాద్ అంటే ప్రేమ తనకు… ఇలా తనకు ఏది ఎలా తోస్తే అదే సిద్ధాంతం… ఓ ఫిక్స్‌డ్ సిద్ధాంతచట్రం ఏమీ లేదు శివసేనకు… కానీ చాలామందికి ఆ పార్టీ ఓ రక్షణఛత్రం…
మొదట్లో శివసేన బీజేపీకన్నా పెద్ద పార్టీ మహారాష్ట్రలో… కానీ రోజులు మారుతున్నాయి… మరాఠీవాదం ఇప్పుడు దానికి ప్రాణవాయువు ఏమీ కాదు… మరోవైపు హిందుత్వం విషయంలో బీజేపీ పెద్దగా కనిపిస్తోంది… మోడీ పట్ల ఆదరణ ఇంకోవైపు శివసేన బలహీనపడిపోయింది… మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 106 గెలిస్తే శివసేన అందులో సగమే గెలిచింది… మరి శివసేన పరిస్థితి ఏమిటి..? ఏ ఎన్సీపీ, ఏ కాంగ్రెస్ పార్టీలతో పోరాడారో వాళ్లతోనే కలిసి అధికారం పంచుకోవడం దిగువస్థాయి పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసహనానికి దారితీసింది… మరోవైపు మరాఠీ అస్థిత్వవాదం లేదు, హిందుత్వను బీజీపీ లాగేసుకుంది… యారొగెంట్ స్లోగన్స్ ఏమీ లేవు శివసేన వద్ద… బీజేపీ ఇంకా బలపడుతోంది… మరి రేపు తమ భవిష్యత్తు ఏమిటి..? ఇదీ షిండే వర్గం ఆందోళన…
రెండేళ్లుగా షిండే బీజేపీతో టచ్‌లో ఉన్నాడు… తన మిత్రుడు ఫడ్నవీస్‌తో చెప్పుకుంటూనే ఉన్నాడు… అధికారం తప్ప ఠాక్రేకు ఇంకేదీ కనిపించడం లేదు… ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు పోయిందేముంది..? అప్పనంగా అధికారాన్ని పంచి ఇస్తున్నప్పుడు సుబ్బరంగా మిఠాయి తీసుకున్నట్టు తీసుకున్నాయి… ఉన్నన్నిరోజులూ పవర్… పోతే పోనీ… మన అధికారమైతే కదా బాధ… ఇలాంటి విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నయ్… నిజానికి శేఖర్ గుప్తా విశ్లేషణలో కూడా దాదాపు ఈ పాయింట్లన్నీ ఉన్నాయి… కానీ చివరకొచ్చేసరికి… డబ్బు మాత్రమే శివసేన సిద్ధాంతం, అది దూరమై షిండేవర్గం అసంతృప్తికి కారణమన్నట్టుగా రాసుకుంటూ పోవడం అబ్సర్డ్ అనిపించింది… అఫ్‌కోర్స్, తన రాతలు కొన్నిసార్లు హేతుబద్ధమే అనిపించినా పలుసార్లు నిజాల్ని విడిచిపెట్టి ఏటెటో వెళ్లిపోతుంటాడు… బహుశా సీనియర్ జాతీయ జర్నలిస్టులకు సహజంగా ఉండే వికారమేమో ఇది..!!
Share this Article