కొందరు నటులుంటారు… మంచి నటులు… వాళ్లలోని నటనా తృష్ణను తనివితీరా తీర్చుకునే అవకాశం రెగ్యులర్ ఫార్ములా కమర్షియల్ ఫీచర్ ఫిలిమ్స్‌లో దొరకదు వాళ్లకు… టీవీ సీరియళ్ల కథలు, ట్రీట్మెంట్ పరమ దరిద్రం… వాటి జోలికి వెళ్లలేరు… అదుగో వాళ్లకు ఓటీటీలు ఓ కొత్త వేదికను క్రియేట్ చేస్తున్నయ్… కొందరు దర్శకులు క్రియేటివ్‌గా తీస్తున్న వెబ్ సీరీస్ గానీ, అంతాలజీ ఎపిసోడ్స్ గానీ వాళ్లకు ఎడారిలో నీటిబుంగలు…
ఇంగ్లిష్, హిందీల్లో ఓటీటీలకు సంబంధించి పలు ప్రయోగాలు, భిన్నమైన కథల్ని చూస్తున్నాం… కానీ తెలుగులో పెద్దగా లేదు… అప్పట్లో పావకథైగల్ అంతాలజీ ప్రాజెక్టులో ఓ కథలో ప్రకాష్‌రాజ్, సాయిపల్లవి మంచి పాత్రల్ని అందిపుచ్చుకుని, దున్నేశారు… కానీ ఏమాటకామాట… తెలుగులో మంచి వెబ్ సీరీస్, ఒరిజినల్ కంటెంట్ చాలా చాలా తక్కువ… ఏకైక తెలుగు ఓటీటీ ఆహా వాళ్లకు ఎంతసేపూ టీవీలను చూసి మ్యూజిక్, డాన్స్, చాట్ షోల వాతల్ని పెట్టుకోవడమే తప్ప మంచి కంటెంట్ క్రియేషన్ చేతకావడం లేదు…
ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ప్లేయర్లు హిందీ, ఇంగ్లిషుకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప ప్రాంతీయ భాషలపై ఆసక్తి చూపించరు… ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భాషా ప్రేక్షకుల మీద వాటికీ కన్నుపడింది… తాజాగా నగేష్ కుకునూరు తీస్తున్న ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ అంతాలజీ సీరీస్‌ను ఈ కోణాల్లోనే చూడాలి… ఎందుకు దీని గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే… ఇందులో సుహాసిని, రేవతి, నిత్యామేనన్, రీతూ వర్మ, మాళవిక అయ్యర్ భిన్నంగా కనిపిస్తున్నారు కాబట్టి… ఎమోషన్స్‌ను బలంగా పండించగల తారలు కాబట్టి… మంచి కథ దొరికితే దున్నేస్తారు కాబట్టి…
Ads
అఫ్కోర్స్, ఇందులో దివ్యవాణి ఉంది… ప్రస్తుతం వార్తల్లో బాగా నలుగుతున్న నరేష్ ఉన్నాడు… ఆది పినిశెట్టితోపాటు బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ కూడా ఉన్నాడు… రీతూ వర్మ, మాళవిక కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తున్నా సరే, వాళ్లలో ప్రతిభ ఉంది… ఈ ఫస్ట్ సీజన్లో ఆరు ఎపిసోడ్లు, అనగా ఆరు కథలుంటయ్… మూడింటిని నగేష్ డైరెక్ట్ చేశాడు… ఒకటేమో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేశ్ చేశాడు…
‘‘ఆరు కథలకూ ప్రేమే కథావస్తువు… కానీ పదే పదే అదే రొటీన్ లవ్, ఆడ-మగ ప్రేమ గురించే కాదు… ఓ బామ్మ- ఓ మనమడి ప్రేమ, ఓ తల్లీ – ఓ బిడ్డ ప్రేమ కూడా… ఇలా డిఫరెంట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం’’ అంటున్నాడు నగేష్ కుకునూరు… ఈ ప్రాజెక్టుకు లీడర్ నగేషే కాబట్టి కాస్త తన గురించీ కాస్త చెప్పాలి…
అప్పుడెప్పుడో 24 ఏళ్ల క్రితం హైదరాబాద్ బ్లూస్ అని ఇంగ్లిషులో తీశాడు… తరువాత ఇంగ్లిష్, హిందీ సినిమాలు, సీరీస్లలో మునిగిపోయాడు… ఈ ఏడాదే తొలిసారిగా తెలుగులో గుడ్ లక్ సఖి అంటూ ఫీచర్ ఫిలిమ్ డైరెక్ట్ చేశాడు… ఎవరికీ కనెక్ట్ కాలేకపోయాడు… సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు… చివరకు తను బాగా ప్రేమించే మెట్రో, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోయాడు… అలాగని మెరిట్ లేని దర్శకుడని కాదు…
ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ తెలుగు ప్రేక్షకులకు సరిగ్గా సూట్ కాదు… విరాటపర్వం సినిమా జనానికి ఎక్కకపోవడానికి కూడా ఇదే కారణం… వేణు ఊడుగుల భావ ధోరణి సగటు ప్రేక్షకుడిని పట్టుకోలేకపోయింది… నగేష్ కూడా అంతే… ఆల్రెడీ హాట్ స్టార్ కోసం సిటీ ఆఫ్ డ్రీమ్స్ మూడో సీజన్ చేస్తున్నాడు తను… మధ్యలో ఈ మోడరన్ లవ్ హైదరబాద్ చేస్తున్నాడు… తన టీంది అదోప్రపంచం… ప్రేక్షకులంతా తమ రేంజ్లో ఉంటారని అనుకుంటారు… ఆ ఆరు కథలకు తెలుగు పేర్లు పెట్టలేకపోయారు… సరైన, కొత్తతరహా ప్రమోషనూ చేతకాదు… అంటే రొటీన్ ప్రెస్మీట్లని కాదు…
సో, సుహాసినిలు, రేవతిలు, నిత్యామేనన్లను ఒప్పించి, కథలో ముంచేయడం కాదు… సగటు ఓటీటీ ప్రేక్షకుడి ఫ్రీక్వెన్సీకి తాము ట్యూన్ అవుతున్నారా లేదా చూసుకోవాలి… ఏమో, చూద్దాం… ఎనిమిదో తేదీ నుంచి స్ట్రీమింగ్… ప్రైమ్‌లో…!! తెలివైన దర్శకులు సమాంతరం వైపు పడిపోకుండా… అంటే పారలల్ వైపు జారిపోకుండా… సమకాలీనంలోనే (కాంటెంపరరీ) ఉంటూ భిన్నంగా ప్రజెంట్ చేయాలని ప్రేక్షకుడి కోరిక… మరీ రొటీన్, చెత్త టీవీ సీరియళ్లు, ఫార్ములా సినిమాల్లాగా గాకుండా…!!
Share this Article