Prasen Bellamkonda………. అతను తన సిగరెట్ పాకెట్ నలిపి విసిరేస్తే అది బాంబై పేలేది. అతను దేశదేశాల సరిహద్దు రేఖలను తొక్కుడుబిళ్ల ఆడినంత సులాగ్గా గెంతేసి పరాయి సైన్యాలను చించేసి వచ్చేసేవాడు. భారత దేశ ప్రధాని అతనితో హాట్ లైన్ లో ముచ్చటించేవాడు. అతని పేరు గుసగుసగా వినపడ్డా చాలు ఇతర దేశాల ప్రధానులూ సుస్సుపోసేసుకునే వారు. అమ్మాయిలు అతనికి దేశ జాతి వర్ణ మత బేధం లేకుండా టపటపామని ఎడాపెడా పడిపోయేవారు. అతనెందుకో గానీ చాలాసార్లు డెస్పరేట్ గా కదిలేవాడు.
అతని దవడ కండరం బిగుసుకుంటే ఎవడికో మూడిందనమాటే. అతనెప్పుడూ నాకు నాలాగే అనిపించేవాడు. అతడు నేనే అని చాలా సందర్బాల్లో కల కన్నాను కూడా. బహుశా చాలా లక్షల మందికీ అలానే తమలానే అనిపించేవాడేమో కూడా. అతను చాలా మందికి తమ నీడలా ఆత్మీయంగా ఉండేవాడేమో.. అందుకే కామోసు అతన్ని షాడో అన్నారు.
ఒకే షాడో ఎంతోమంది నీడ కావడం వెనుక మధుబాబు రచనా చమత్కారమే కీలకం. చదవడం మ్యూజియంలోకి వెళ్లిపోయిన ఈ తరంలో చాలా మందికి షాడో ఎవరో తెలీక పోవచ్చు.. నాకైతే లేదూ నాబోంట్లకైతే అప్పట్లో అతనే ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అండ్ హృదయవీధి హీరో. ఇప్పుడంటే సాహిత్యమూ అలిగరీ సిమిలీ సినక్డొకే అనాక్రానిజం అని ఏవేవో గొప్ప విమర్శక మేధావుల్లాగా మాట్లాడుకుంటున్నాం గానీ అప్పట్లో అవేవీ తెలీదు. పిచ్చి పిచ్చిగా కనపడ్డ ప్రతి కాగితమ్ముక్కనూ అధ్యయనంలాగా చదివేస్తున్న రోజులు. తెలుగు వారపత్రికల సీరియళ్లు, అపరాధ పరిశోధన గిరిజశ్రీ భగవాన్ టెంపోరావ్ కొమ్మూరి సాంబశివరావులతో కాలహరణం ఆనందంగా చేస్తున్న రోజులు. వీళ్ల మధ్యలో మధుబాబు షాడో చొచ్చుకొచ్చి అంతా చెల్లాచెదురు చేసి పడేసేవాడు.
Ads
ఇక్కడ షాడో గురించీ మధుబాబు గురించీ మాట్లాడేపుడు ఖమ్మం గాంధీచౌక్ చిన్నా పుస్తకాల దుకాణం గురించి చెప్పకపోతే అక్కడ పరిచయమై ఆ తరవాత ఆప్తమిత్రులుగా మారిన ఎంవీఆర్ శాస్త్రి, టి చంద్రశేఖరరెడ్డి, ఉండీల గౌరీనాధ్, ఎంవీ రమణమూర్తి నన్ను బండబూతులు తిట్టేస్తారేమో. అది డెబ్బయవ దశకం చివర. ఖమ్మం గాంధీచౌక్ లో గణేష్ విలాస్ ను ఆనుకుని ఓ చిన్న బడ్డీకొట్టు. ప్రసాద్ బుక్ స్టాల్ . ఇప్పుడు మా పండు ఎలక్ట్రికల్ దుకాణానికి ఓ అయిదారు కొట్లకు అవతల ఉండేది. దాని ఓనర్ పేరు చిన్నా. గుండ్రంగా కబుర్ల పిట్టగా ఉండేవాడు. డిటెక్టివ్ నవలలూ, ఇతర నవలలూ, వారపత్రికలూ అద్దెకివ్వడమే అతని వ్యాపారం. ఇప్పుడా బడ్డీ కొట్టు ప్లేస్ లో ఓ బట్టల దుకాణం ఉన్నట్టుంది.
డిటెక్టివ్ నవలకు రోజుకు పది పైసలు అద్దె. నేను చాలా పుస్తకాలు అక్కడే చదివా. నా మొదటి రచన అపరాధ పరిశోధనలో అపురూపంగా చూసుకున్నదీ చిన్నా దుకాణం ముందే. అప్పట్లో చిన్నా నా ఆ రచనను ఎంత మందికి చూపి సంతోష పడ్డాడో నాకింకా గుర్తుంది. అప్పట్లో తెలిసిందో తెలియందో ఇంకేదో అని చెప్పాను కదా…చిన్నా దగ్గర వేయి పడగలు ఉండేది.
దాన్ని నాలుగేళ్ల పాటు ఒక్కళ్లు కూడా అద్దెకు తీసుకోకపోవడం మీద రోజూ జోకులేసుకునేవాళ్లం. చిన్నా అయితే ‘అద్దె అడగనులే కానీ కనీసం ఐదొందల పడగలన్నా చదవండి ప్లీజ్ ‘ అని మమ్మల్ని బతిమాలేవాడు. ఆ సహస్రఫణి గురించి ఆ తరవాత చాలాకాలానికి కానీ తెలిసి రాలేదు. చిన్నా మాట వినివుంటే ఆరేడేళ్ల ముందే వేయి పడగలు చదివి ఉండేవాడ్ని కదా అని పశ్చాత్తాపపడ్డ సందర్బాలున్నాయి. అప్పుడంతా షాడో ఆవహించి ఉన్నాడు కదా. షాడో ముందు ఎన్ని పడగలైనా అప్పటికి దిగదుడుపే మరి.
మధుబాబు నవల రాబోతోందని ముందుగానే తెలిసేది. మేం ప్రైమ్ కస్టమర్లం కనుక ముందుగానే బుక్ చేసుకునే వారం. డిటెక్టివ్ నవలకు రోజుకు పది పైసలే కానీ మధుబాబు నవలకు మాత్రం పావలా తీసుకునే వాడు. అదీ నవల విడుదలైన మొదటి మూడు నాలుగు రోజుల్లో అయితే కేవలం గంటలో చదివి ఇచ్చేయాలి. నేనైతే మధుబాబు నవలలన్నీ ఆ షాప్ పక్కన అరుగుల మీదే కూచుని చదివి ఇచ్చేసాను. నవల కోసం ఎదురు చూపులు, నవల చదవడం చదవకపోవడం మీద పోటాపోటీలు..ఆ తరవాత నవల మీద బోలెడన్ని చర్చలు… అప్పుడదే సాహితీ గవాక్షమూ వివిధా సాహిత్య వేదికాన్నూ.
యద్దనపూడినుంచి మధుబాబు మీదుగా యండమూరిని దాటి, జేమ్స్ హాడ్లీ చేజ్ ను నమిలి, హెరాల్డ్ రాబిన్స్ తదితరులను తోసిరాజని, ఈట్స్ వైల్డ్ కీట్స్ ఆడెన్ లో మునిగి, చలం, శ్రీశ్రీ, కొకు, పతంజలి, గురజాడ, దేవులపల్లిలలో తేలడానికి పునాదులు ఆ షాడో నీడ చిన్నా బడ్డీ కొట్లోనే పడ్డాయి. యద్దనపూడినీ మధుబాబునూ కలిపి యండమూరి ఏర్పడ్డాడని నేను సిద్దాంతీకరించడానికి పెద్దగా శ్రమపడకపోవడానికి బహుశా షాడోయే కారణం.
మధుబాబు శైలి నిజంగా భిన్నంగా ఉండేది. ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆలోచిస్తే డిటెక్టివ్ నవలను ఆ శైలితో రాయడం నిజంగా సాహసమే. బహుశా ఆ సాహసం చేసినందుకే మధుబాబు ప్రత్యేకంగా నిలిచుంటాడు. అదేంటో గానీ మధుబాబు నవలల టైటిల్సన్నీ ఆంగ్లంలోనే ఉండేవి. ఆపరేషన్ అరిజోనా, ఎ డెవిల్ ఎ స్పై …ఇలా వుండేవి. తరవాత్తరవాత కాళికాలయం, కంకాళ లోయ, కళ్యాణ తిలకం అని మధుబాబు తెలుగు టైటిల్స్ తో రాసే నాటికి నేను సీరియస్ సాహిత్యానికి షిఫ్ట్ అయా…
మధు బాబు, గంగారాం, కులకర్ణి పాత్రలూ మాకు ఫ్రెండ్సే. కొమ్మూరి సాంబశివరావు యుగంధర్ మీద అభిమానం ఉండేది కానీ … మధుబాబు షాడో అంటే మాత్రం పిచ్చ. షాడో అంటే వెర్రి. షాడో అంటే అనేకానేకుల ఆల్డర్ ఈగో. ఓ చిన్న గమ్మత్తైన విషయం చెపుతాను. మా అమ్మానాన్నలకు కొమ్మూరి సాంబశివరావు అన్నా యుగంధర్ అసిస్టెంట్ రాజు అన్నా బోలెడు ప్రేమ. అందుకే నన్ను వాళ్లిద్దరూ ఇంట్లో ముద్దుగా రాజూ అని పిలుచుకునేవారు. యుగంధర్అ సిస్టెంట్ రాజుకు షాడో అంటే పిచ్చ, వెర్రి ఉండడం విచిత్రమే కదూ.
మధుబాబు వెబ్ సిరీస్ వస్తోందట కదా. ఇవాళ్టిలో నిలబడి చూస్తే షాడోలో ప్రత్యేకత ఉండకపోవచ్చు. ఎందుకంటే షాడో విన్యాసాలన్నీ చేస్తున్న అనేక మంది డికెష్టిలు ఇప్పుడు వెండి తెరమీదా బుల్లి తెరమీదా చాలా మంది ఉన్నారు. షాడోలాగా కరాటేతో కుళ్ల బొడిచే వాళ్లూ షాడో లాగా ఇతర దేశాల సైన్యాలను దునుమాడే గూఢచారులూ బోలెడంత మంది ఉన్నారు.
వీళ్లందరినీ షాడోలో రంగరించి ఇప్పుడు షాడోను అప్డేట్ పేరిట కలుషిత రీమిక్స్ చేస్తారా..యథాతథంగా అప్పటి షాడోనే ఇప్పుడు కళ్లకు కడితే నాలాంటి పురాతనులు మినహా తాజా ప్రేక్షకులు స్వాగతించగలరా..అసలు షాడో పాత్రను ఎవరు పోషించనున్నారు.. నాలాంటి ఎందరి కళ్లముందో ఒక అమూర్తరూపంగా నిలిచిపోయిన ఆ పెను విగ్రహాన్ని నకలు చేయడం సాధ్యమేనా అన్నవే అనుమానాలు. వెల్కమ్ టు వెబ్ షాడో… నేను నీ తెరరూపం కోసం డెస్పరేట్ గా ఉన్నాను. నా దవడ కండరం బిగుసుకుంటోంది… ఇవాళ మధు బాబు పుట్టిన రోజు…!!!
Share this Article