పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటి అనడిగాడు ఓ మిత్రుడు… తెలియక కాదు… ఈమధ్య కొన్ని పాన్ మసాలా ఇండియా అని కూడా ప్రచారం చేసి, హడావుడి క్రియేట్ చేసుకుని, పబ్లిసిటీ మీద విపరీతమైన ఖర్చు పెట్టేసుకుని, చివరకు కొన్నిరోజులైతే థియేటర్ల మెయింటెనెన్స్ కనీస డబ్బులు కూడా ఫట్‌మని పేలిపోయాయి… అందుకని పాన్ ఇండియా అనే పదం వింటేనే అదోలా ఏవగింపుతో మొహం పెడతాడు…
అదొక మార్కెటింగ్ టెక్నిక్ ఇప్పుడు… సినిమా తీసి రిలీజకు ముందే పనిలోపనిగా ఇతర భాషల్లో… అదీ అయిదే భాషల్లో కారు చౌకగా డబ్ చేయించేసి, పాన్ ఇండియా పేరిట హంగామా క్రియేట్ చేసి, ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ హక్కుల్ని అడ్డగోలు రేట్లకు అమ్మేసుకునే టెక్నిక్… సినిమా ఫట్‌మంటే కొన్న బయ్యర్లు, తరువాత ఓటీటీ, టీవీ చానెళ్లు మునుగుతాయి… మనదేం పోయింది..? ఇదీ ప్లాన్… అని తరువాత వాడే వివరించాడు…
Ads
పాన్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా సినిమా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకుడిని కనెక్టయ్యే సినిమా… కథ అలా ఉండాలి… సరే, ఇదంతా ఎలా ఉన్నా… అడ్డగోలు రెమ్యునరేషన్లు, విపరీతంగా గ్రాఫిక్ ఖర్చులు పెట్టేసి, చారిత్రిక కథల్ని కూడా భ్రష్టుపట్టించి, 300 కోట్లు ఖర్చయిందీ అని ప్రచారం చేసుకుని, చివరకు పలుచోట్ల చతికిలబడిన సినిమాలూ చూశాం కదా… ముసలి హీరోలకు రంగులు పూసి, వీపులకు బద్దలు కట్టి, ఫైట్లకు గ్రాఫిక్స్ పెట్టేసిన వేషాలూ చూశాం కదా… టికెట్ల ధరల పెంపు కోసం చేతులు నలుముకుంటూ, బతిమిలాడుతూ… అవి ఎన్ని వందల కోట్లు వసూళ్లు చేసినా దానికి పెద్ద గ్రేట్‌నెస్ ఏమున్నట్టు..? తక్కువ ఖర్చుతో తీసి, ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టించి, కథలో లీనం చేసేదే కదా అసలైన పాన్ ఇండియా సినిమా…
నిజమే, అలాంటివి ఏమున్నాయి..? అనే ప్రశ్నకు వెంటనే స్పురించింది ఈమధ్య రిలీజై అయిదోవారం కూడా నడుస్తున్న చార్లి777 సినిమా… కన్నడ ప్రేక్షకులకు మినహా మిగతా భాషలకు పెద్దగా పరిచయం లేని హీరో రక్షిత్ శెట్టి… తోడుగా ఓ కుక్క… హీరోయిన్, వెకిలి కామెడీ, ఎడ్డి డాన్సులు, ఎదవ ఐటమ్ సాంగ్స్, సూపర్ సుప్రీం హీరోయిక్ చేష్టలు, సూపర్ మ్యాన్ ఫైట్లు గట్రా ఏమీ లేవు… పెట్టింది జస్ట్, 20 కోట్లు… 150 కోట్ల వసూళ్ల దిశగా సాగిపోతోంది సినిమా…
థియేటరికల్ వసూళ్లలో వాటాతోపాటు ఓటీటీ, శాటిలైట్ టీవీ రైట్స్ ద్వారా వచ్చే సొమ్ము గట్రా కలిపి లెక్కేసుకుంటే ఇప్పటికే దాదాపు 100 కోట్ల ప్రాఫిట్ అని కన్నడ సినిమా సర్కిళ్లలో ప్రచారం… సినిమాకు వస్తున్న అభినందనలు ప్లస్ కొత్త మార్కెట్ల అన్వేషణలో భాగంగా రష్యన్, చైనీస్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు…
ఓ వీథికుక్క ఓ ఇంట్రవర్ట్ అయిన కథానాయకుడి జీవితాన్ని ఏ ప్రస్థానానికి తీసుకువెళ్లందనే సింపుల్ లైన్‌ను పెట్ లవర్స్ అందరూ ప్రేమించేలా ప్రజెంట్ చేయడమే ఈ సినిమా విశిష్టత… కథలో, ప్రజెంటేషన్‌లో దమ్ముండాలే గానీ హీరో ఎవరైతేనేం… తొక్కలో సోకాల్డ్ ఫార్ములా కమర్షియల్ హంగులు లేకపోతేనేం… ప్రేక్షకుడిని కనెక్టయితేనే కదా అసలైన పాన్ ఇండియా సినిమా… అదే చార్లి777 నిరూపించింది…! ష్… చాలామంది సౌతిండియా హీరోలకన్నా ఈ సినిమాలో నటించిన కుక్కల నటన చాలా భేషుగ్గా ఉందని సినిమా విమర్శకుల ప్రశంస…!!
Share this Article