లీల, మోహన్ బెంగుళూరులో ఉంటారు… కరోనా పీరియడ్‌లో ఢిల్లీలో అనారోగ్యంతో ఉన్న అమ్మ వద్దకు వెళ్లింది లీల… లాక్ డౌన్లు, కరోనా ఆంక్షలు ఎత్తేసినా సరే, అమ్మ ఆరోగ్యం చక్కబడక అక్కడే ఉండిపోయింది ఆమె… బెంగుళూరులో భర్త… ఇద్దరి నడుమ దూరం పెరిగిపోయింది… బాధ్యతలు, వర్క్ ప్రెజర్ వెరసి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు… పదిహేనేళ్ల బంధం తెగిపోతోంది…
ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు… కుటుంబవ్యవస్థకు, సర్దుబాట్లకు పేరొందిన భారతీయ సమాజంలో ప్రస్తుతం విడాకుల రేటు విపరీతంగా పెరిగిపోతోంది… గత సంవత్సరం 50 నుంచి 60 శాతం వరకూ విడాకులు పెరిగినట్లుగా లాయర్లు, కౌన్సిలర్లు చెబుతున్నారు… పోస్ట్ కరోనా సిండ్రోమ్ అనే ముద్ర వేయగలమో లేదో గానీ పెరుగుతున్న అసహనం, భార్యాభర్తల నడుమ రాజీలేని ధోరణులు, కోపం, అసంతృప్తి విడాకుల రేటును పెంచేస్తున్నాయి…
ఎన్ని గొడవలున్నా పడకగదిలో ఇద్దరి పరిష్వంగం చాలా సమస్యల్ని పరిష్కరించేది… ఇప్పుడు భౌతికదూరం కూడా పెరిగిపోతోంది… తమ జీవితాల మీద తమ అంచనాలు, ఆలోచనలు, అడుగులు కరోనా అనంతరం కాలంలో బాగా మార్పులకు గురవుతున్నాయి… అంటోంది మానసిక సమస్యల పరిష్కార కేంద్రం 1to1help.net డైరెక్టర్ అర్చన బిస్త్… ఒంటరి మహిళలుగా బతకడానికి కూడా సిద్ధపడిపోతున్నారు గానీ ఇష్టం లేని పెళ్లిళ్లకు తొందరపడటం లేదు… సంసారాల్లో రాజీపడటం లేదు…
Ads
వ్యక్తుల్లో సొంత జీవితాల మీద ఆలోచనే బాగా పెరిగిపోతోంది… సొంత లక్ష్యాలు ప్రధానమవుతున్నాయి… ప్రత్యేకించి కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోందనేది అర్చన విశ్లేషణ… అందుకే పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునేవాళ్లు సంఖ్య పెరిగిపోతోందట… నిజమే, మేమూ గమనిస్తున్నాం ఈ ధోరణి… కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడం, ఒత్తిళ్లు పెరగడం, తగ్గించే మార్గాలు లేకపోవడం కూడా ఓ కారణం అంటోంది ముంబైలో ఫ్యామిలీ కోర్టు అడ్వొకేటుగా పనిచేసే ఇషిక తొలానీ… కనీసం 50 శాతం విడాకులు పెరిగినట్లు అంగీకరిస్తోంది ఆమె…
ALMT Legal సంస్థ వ్యవస్థాపకురాలు సమీర్ తాపియా ఇంకో కారణం చెబుతోంది… వర్కింగ్ వుమెన్ సమస్య… ఎక్కువ గంటల పని, రోజంతా క్లయింట్లు, కొలీగ్స్‌లో డిస్కషన్స్, అలసిపోవడం, భార్యాభర్తల నడుమ బంధాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయంటోంది… మెంటల్ హెల్త్ నిపుణులు కూడా తమ వద్దకు కౌన్సిలింగ్ కోసం వచ్చే కేసుల సంఖ్య బాగా పెరిగిపోతున్నట్టు చెబుతున్నారు…
Inner Hour ఫౌండర్ సీఈవో అమిత్ మాలిక్ అనేదేమంటే… ‘‘చాలా ఇళ్లల్లో వాదనలు, వాగ్వాదాలు, కొట్లాటలు గృహహింస దాకా దారితీస్తున్నాయి… అవి చివరకు బంధాల్ని బ్రేక్ చేస్తున్నాయి..’’ నిజానికి కరోనా అనంతరం చాలామందిలో మానసిక సమస్యలు పెరిగాయి… ఆ ప్రభావం సంసార బందాలపైన కూడా పడుతోంది… జనవరి నుంచి మే వరకు లెక్కేస్తే, విడాకుల సంబంధ ఎంక్వయిరీలు 25 శాతం పెరిగాయని Legalkart అనే లీగల్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉదహరిస్తోంది…
ఆ కొద్దికాలంలోనే తమకు 17 వేల ఎంక్వయిరీస్ వచ్చాయట… అందులో 62 శాతం పురుషుల నుంచి… 38 శాతం మహిళల నుంచి… ఈ కంపెనీ ఫౌండర్ సీఈవో అరవింద్ సింఘాతియా అనేదేమిటంటే… ‘‘పరస్పరం ఆరోపణలతో కాదు, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని అనుకునే వారే అధికం… కోర్టుల్లో కాలహరణం, లీగల్ ఖర్చుల మీద చాలామందికి అవగాహన రావడమే కారణం’’… A&P Partners అనే లీగల్ ఫరమ్ కు చెందిన ప్రియాంక సింహా కూడా అదే చెబుతోంది… వెరసి ఇది ఎక్కడిదాకా పోనుంది..?! (స్టోరీ ఇన్‌పుట్స్ సౌజన్యం… ఎకనమిక్ టైమ్స్)
Share this Article