చాలామందికి ఈరోజుకు పనిదొరికింది… కడుపు నిండింది… ఒకటే ఇష్యూలో మోడీని తిట్టొచ్చు, తమ యాంటీ-హిందూ పోకడను బయటపెట్టొచ్చు… ఇంకేముంది..? తమ నాలుకలకు పదునుపెట్టారు… విషయం ఏమిటీ అంటే..? నిన్న కొత్త పార్లమెంటు భవనం మీద మోడీ నాలుగు సింహాల ప్రతిమను, అదేనండీ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించాడు కదా… ఇక మొదలైంది…
మొదటిది… ఆ సింహాలు గర్జిస్తున్నాయి… ఇలా ఓ జాతీయ చిహ్నాన్ని ఇష్టారాజ్యంగా మార్చవచ్చా..? ఇదీ విమర్శ… ఇందులో పసలేదు… నిజమే అవి గర్జిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి… కానీ ఒరిజినల్ సారనాథ్ అశోకుడి సింహస్థంభం మీద బొమ్మకూ మనం అడాప్ట్ చేసుకున్న ప్రతిమకూ బోలెడు తేడాలు ఉంటయ్… పైగా ఆ సింహాల దిగువన ఉండే గుర్రం, ఏనుగు, ఎద్దులలో మనకు నాలుగో సింహం ఎప్పుడూ కనిపించనట్టుగానే ఏనుగు కనిపించదు…
ఐతే సింహాలు రౌద్రంగా ఉండకూడదు, శాంతంగా నిలబడాలనీ… వాటి దిగువన గుర్రపు తోక పొట్టిగా ఉండాలనీ… ఏనుగు తొండెం పెద్దగా ఉండాలనీ… ఎద్దు మూపురం ఎత్తుగా ఉండాలనీ… ఇలా ఏమీ ఫిక్స్‌డ్ సూత్రాలు, కొలతలు, నిర్ధారించిన లక్షణాలు ఉండవు… లయన్ కేపిటల్ ఆఫ్ అశోక అని మాత్రమే మనం అడాప్ట్ చేసుకున్నాం… అంతే… నాలుగు సింహాలు, దిగువన అశోక చక్రాల నడుమ ఏనుగు, ఎద్దు, గుర్రం, తిరగేసిన కమలం వంటి పీఠం… వీటితోపాటు మండూకోపనిషత్‌లోని సత్యమేవ జయతే అనే పదాలు…
Ads
నాన్సెన్స్, పార్లమెంటు మీద విగ్రహాన్ని అలా ఒంటికాయ శొంఠికొమ్ములా ఒక్కడే ఆవిష్కరిస్తే సరిపోతుందా..? అది అన్ని పార్టీల పవిత్రభవనం… అందరినీ పిలవొద్దా..? ఇదేమైనా బీజేపీ భవనా..? ఇది మరో విమర్శ… అసలు ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టే పూర్తికాలేదు… ఇప్పటికి 62 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి… శీతాకాలం సమావేశాల్ని ఇందులోనే జరపాలని భావిస్తున్నా అప్పటివరకు పనులు పూర్తవుతాయా లేదా చెప్పలేం…
అన్ని పార్టీలనూ పిలవడం అనేది మొత్తం ప్రాజెక్టు పూర్తయి, ప్రారంభోత్సవం చేసినప్పుడు మాత్రమే… ప్రస్తుతానికి ఈ 6.5 మీటర్ల భారీ కాంస్య విగ్రహాన్ని నామకః ఆవిష్కరించాం అనిపించేసి, ఈ కళాకారులను పంపించేస్తున్నారు… హిందూ పద్ధతిలో పూజలు చేసి ఆవిష్కరించాడు, మనది సెక్యులర్ దేశం, అలా ఒక మతసంప్రదాయంతో ఆవిష్కరించడం రాజ్యాంగద్రోహం అని మరో విమర్శ… సెక్యులర్ అంటే నాట్-హిందు అని కాదు… ఐనా భవనాన్ని నిర్మించేది ప్రభుత్వం… ఆ ప్రభుత్వ సారథి ప్రధాని… అంటే కర్త… కర్త తన అభి‘మతానుసారం’ ఆవిష్కరించడాన్ని ఎలా తప్పుపట్టగలం..?
నో, నో… మోడీ రాజ్యాంగ లక్ష్మణరేఖల్ని ఉల్లంఘిస్తున్నాడు… చట్టసభల బాధ్యత స్పీకర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చూడాలి… ప్రభుత్వ బాధ్యతల్ని ప్రధాని, మంత్రులు చూడాలి… వాటి మధ్య విభజన రేఖను తుడిపేస్తున్నాడు అని లెఫ్టీయుల విమర్శ… ఈ కార్యక్రమంలో లోకసభ స్పీకర్ కూడా ఉన్నాడని మరిచిపోతున్నట్టున్నారు… ఐనా ఇది కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం కాదు… నిజంగా మోడీని విమర్శించాలంటే… ఈ సింహాల కోరలు పదునుగా ఉన్నాయి, భయపెడుతున్నాయి, రౌద్రం కనిపిస్తోంది వంటి బభ్రాజమానం విమర్శలు కావు… ధరల పెరుగుదల దగ్గర నుంచి ప్రజల బతుకుల్ని భారం చేస్తున్న బోలెడు మోడీ పాలన వైఫల్యాలు ఉన్నయ్… వాటిపై విమర్శలకు పదును పెడితే వాటికి ఓ సార్థకత, ఓ విలువ ఉంటాయి…
Share this Article