రాజకీయాల్లో ఒక పుల్ల అటు నుంచి ఇటు కదిలినా… దాని వెనుక ఓ మర్మం ఉంటుంది… ఓ కారణం ఉంటుంది… మొన్న అస్సోం సీఎం, బెంగాల్ గవర్నర్, బెంగాల్ సీఎం అసాధారణ కలయిక మీద సందేహాలు తలెత్తింది అందుకే…. ఇదేం మర్మం సుమీ అని ‘ముచ్చట’ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది… ఎందుకంటే… మమత, ఆ గవర్నర్ ఉప్పూనిప్పూ… అస్సోం సీఎం, ఆ గవర్నర్ భేటీ వేసినప్పుడు మమత అక్కడికి వెళ్లి కూర్చోవడం ఓ అసాధారణ దృశ్యం…
ఆమె టెంపర్‌మెంట్‌కు గానీ, ప్రోటోకాల్‌కు గానీ ఆ సీన్ నప్పదు… అందుకే తెర వెనుక ఏదో జరుగుతోంది అనేది ‘ముచ్చట’ సందేహం… ఆమధ్య రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేశాక మమతకు తలవాచిపోయింది… తన పార్టీ నాయకుడు యశ్వంత్‌ను తనే ప్రపోజ్ చేసింది కాబట్టి ద్రౌపదికి సపోర్ట్ చేయలేదు… దాంతో ముందే చెబితే ఏకగ్రీవ అభ్యర్థిగా అంగీకరించేదాన్ని అని చెప్పింది… గుర్తుంది కదా…
సరే, ఈసారి విపక్షాన్ని అదే సూత్రంతో కొట్టాలని అనుకుంది బీజేపీ… అదే మమతతో స్టార్ట్ చేసింది సంప్రదింపులు… మరి బెంగాల్ గవర్నరుడే స్వయంగా పిలిచి, చాయ్ తాపించి ‘‘నన్ను నిలబడమంటున్నారు ఏమంటావ్ బెహన్’’ అని అడగలేడు కదా… అసలే ఒకరిని చూస్తే మరొకరికి మంట… సో, అస్సోం సీఎం మధ్యలోకి వచ్చాడు… ఇదీ కథ…
Ads
ఇక ఇప్పుడు మమత ఎలా స్పందిస్తుందో చూడాలి… ఏమో… వేరే ఇతర పార్టీల నుంచి ఎవరినైనా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి పెడతారా..? ఇప్పటికే శివసేన, బీజేడీ, జేఎంఎం, టీడీపీ తదితర పార్టీలన్నీ ద్రౌపదికే జై అంటున్నాయి… ఉపరాష్ట్రపతిగా ఉమ్మడి అభ్యర్థి అనే విషయంలో ఇప్పుడు టీఎంసీకి పెద్ద ఆసక్తి ఉండదు… కాంగ్రెస్‌కు అసలే లేదు… సో, యూపీఏకు ఇంట్రస్టు లేదు… కేసీయార్ ఎవరినైనా నిలబెడతాడేమో చూడాలి…
జగదీప్ ధన్‌కర్ రాజస్థానీ… జాట్ కులస్థుడు… ఈ 71 ఏళ్ల వెటరన్ లీడర్, మాజీ సుప్రీం లాయర్ ఎంపిక ఏ సూత్రంలో ఇముడుతుందో బీజేపీ శ్రేణులకే అంతుపట్టడం లేదు… అనూహ్యం… నిజానికి సిక్కు లేదా కశ్మీరీ ముస్లిం నాయకుల నుంచి ఎంపిక ఉండొచ్చుననే భావన బలంగా వినిపించేది… మళ్లీ వెంకయ్యనాయుడు, లేదంటే తమిళిసై ఎంపికవుతుంది అనే ఆంధ్రజ్యోతి మార్క్ ప్రచారాన్ని కూడా ‘ముచ్చట’ ఎప్పుడో తోసిపుచ్చింది… నాలుగు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినప్పుడే “నో ఫ్రమ్ సౌత్” అని తేల్చేశారు…
ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి బీజేపీ నానా ప్రయత్నాలు చేస్తుంటే… సత్యకుమార్ అనే ఏపీబీజేపీ నాయకుడు అనాలోచితంగా చేసిన పిచ్చి వ్యాఖ్యలు వెంకయ్యనాయుడికి ఇంకాస్త మైనస్ అయ్యాయి… అసలే వెంకయ్యనాయుడి మీద మోడీకి, అమిత్ షాకు పెద్ద ప్రేమ ఏమీ లేదు… అందుకే తనను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికే ఉపరాష్ట్రపతిని చేశారు… అది వెంకయ్యనాయుడికి కూడా తెలుసు… అవునూ, ఈ జగదీప్ ధన్‌కర్ ఎంపిక ఏ సమీకరణంలో ఇముడుతుందా మోడీజీ…?! ఇన్నేళ్లు మమత అరాచకాన్ని, అవమానాల్ని భరించడమే అర్హత అంటారా..?!
Share this Article