హీరో పాత్రలదేముంది..? ఒడ్డూపొడుగూ ఉన్నవాడు ఎవడైనా చేస్తాడు..? హీరోయిన్ పాత్రలదేముంది..? అదెలాగూ స్కిన్ షో కదా, నదురుగా ఉన్న ఎవరైనా చేయగలరు..? కామెడీ చేయాలంటే కష్టం, దానికి పర్ఫెక్ట్ టైమింగు కావాలి… అంతకుమించి విలనీ చేయాలంటే కష్టం… మెప్పించాలి… కళ్లల్లో, మొహంలో క్రౌర్యం ఎక్స్పోజ్ కావాలి… మాట కటువుండాలి… బాడీ లాంగ్వేజీ పాత్రకు తగినట్టుగా ఉండాలి… దానికి తగిన బీజీఎం ఉంటే విలనీ భలే పండుతుంది… అదే లేడీ విలన్ అయితే మరీ కష్టం… అందులోనూ కామెడీకి, ఐటమ్ సాంగ్స్‌కూ పేరొందిన నటి క్రూర విలనీ చేయడం మరీ మరీ కష్టం…
దర్జా అని ఓ సినిమా విడుదలైంది… అందులో యాంకర్ అనసూయ ప్రధాన పాత్ర… ఆమె చుట్టే సినిమా తిరుగుతుంది… నిజానికి ఏళ్లుగా ఆమె జబర్దస్త్ యాంకర్‌గా చేస్తుంది… చిన్నాచితకా ప్రోగ్రాముల్ని కూడా హోస్ట్ చేస్తుంది… ఆమె మొహాన్ని చూస్తేనే నవ్వొచ్చేస్తుంది… అది ఆమె తప్పు కాదు, ఆమె మొహానికి క్రౌర్యం సెట్ కాదు… పలకదు… అసలే ఆమె మెయిన్ స్ట్రీమ్ నటి కాదు… నటన ఆమె సీరియస్ ప్రొఫెషన్ కాదు… తనకు పెద్దగా ఎమోషన్స్ ఏమీ పలకవు… ఆమె గొంతులో విలనీ కాఠిన్యం సూట్ కాదు… నో డౌట్, ఆమె హైట్, ఆమె లావణ్యం ఆమెకు ప్లస్సే… కానీ..?
ఎడాపెడా నేరాలు చేసేస్తూ… ఓ ఏరియాను పాలిస్తూ… అవసరమైతే పోలీసుల్ని, ఎమ్మెల్యేలను కూడా ఖతం చేసే లేడీ డాన్ కేరక్టర్ అంటే… నటనలో ఎంత ఇంటెన్స్ చూపించగలగాలి..? డైలాగ్ డెలివరీలో ఎంత ఫోర్స్ ఉండాలి..? నిజంగా చాలెంజ్‌గా తీసుకుని చేయగలిగితే మంచి పేరు తీసుకురాగల పాత్రే… కానీ అనసూయ న్యాయం చేయలేకపోయింది…
Ads
అడపాదడపా ఐటమ్ సాంగ్స్ చేసినా సరే, మొహాన్ని ఎవరు చూస్తారు..? సో, అక్కడ తేడా తెలియదు… కానీ ఓ బలమైన లేడీ విలన్ పాత్ర పోషించాలంటే నటనలో బాగా అనుభవం, ఎమోషన్స్‌ను బలంగా వ్యక్తీకరించగల మెరిట్ అవసరం… ఆఁ ఏముందిలే, వందలాది తెలుగు టీవీ సీరియళ్లలో ఎందరు ఆడవాళ్లు విలనీ పోషించడం లేదులే అనుకుందేమో… ఆమధ్య అప్పుడెప్పుడో కదనమో కథనమో ఏదో సినిమా వచ్చింది ఆమెదే… అందులోనే తేలిపోయింది ఆమెకు యాంకర్ పని, టీవీ హోస్టింగ్ పనే బెటర్ అని…
ఈమెకు తోడు సునీల్… కామెడీ నుంచి హీరోగా మారి, తిరిగి కామెడీకి వచ్చి, కేరక్టర్ ఆర్టిస్టుగా మారి… పుష్పలో ఓ మామూలు పాత్రలో చేసి… తన కెరీర్ ఏమిటో తనకే అర్థం కావడం లేదు ఫాఫం… ఈ దర్జాలో కూడా ఓ పోలీస్ పాత్ర చేశాడు… తను మంచి ఆర్టిస్టే కానీ ఆ పాత్రలో దమ్ముండాలి కదా… మెల్లిమెల్లిగా సునీల్ కెరీర్ క్లైమాక్స్‌కు పోతున్నట్టుంది… ఇక ఈ సినిమాలో కాస్త మెచ్చబుల్గా ఉంది ఏమిటంటే స్వతహాగా డాన్సర్ అయిన అక్సాఖాన్ చేసిన స్పెషల్ సాంగ్… ఆమని, షకలక శంకర్, పృథ్వి, సమీర్ తదితరులు ఉన్నా సరే… అసలు కథలో, ట్రీట్మెంట్లో ఆ దర్జాతనం లేదు…
వీటిని నమ్ముకుని అనసూయ ఈటీవీని, తనకు ఏళ్లుగా అండగా ఉన్న జబర్దస్త్‌ను కూడా వదిలేసింది… సుధీర్‌తో ఓ టీవీ షోకు కో-హోస్ట్‌గా, మాటీవీలో ఏదో షోకు జడ్జిగా చేస్తోంది… జబర్దస్త్ వదలకుండా ఉండాల్సిందమ్మా…!! రష్మి గుంటూరు టాకీస్ నుంచి, సుమ జయమ్మ పంచాయతీ నుంచి అనసూయ దర్జా దాకా… తెలుగు యాంకర్లకు ప్రధాన పాత్రలు అచ్చిరావు అనేది తెలుసుకోవల్సిన నీతి…!!
Share this Article