శ్రావణ భార్గవి వివాదానికి దారితీసిన ఆ వీడియో తీసేసింది… అదే వీడియోకు ఓ వేణుగానాన్ని యాడ్ చేసి, మళ్లీ పెట్టింది… అదేమంటే ఆ వీడియోకు బాగా కష్టపడ్డాం అంటోంది… ఆ వీడియోకు నిజానికి అంత సీన్ లేదు, సరే, ఆమె ఇష్టం… అయితే అన్నమయ్య వంశస్థులు కూడా ‘అతి’ చేసినట్టనిపించింది… నచ్చనప్పుడు అభ్యంతరపెట్టారు, తప్పులేదు… వాళ్లు చెప్పేదీ ఓ గందరగోళం… ఈ పిల్లది తింగరి వేషం… ఈమె వాదన, మాటతీరు కూడా అంతే గందరగోళం… కానీ కేసు పెడతాం, మరీ తిరుమలకు రాకుండా నిషేధం పెట్టేస్తాం అని బెదిరించే స్థాయికి అన్నమయ్య ట్రస్టు వెళ్లడం మరీ ఓవరాక్షన్… అన్నమయ్య కీర్తనలపై వీళ్లకున్న హక్కు ఏమిటి అసలు..? పైగా ఒకపరి అనే కీర్తన అన్నమయ్య రాసిందే కాదు…
ఈ నేపథ్యంలో మిత్రుడు Prabhakar Jaini…. పోస్టు నాణేనికి మరోవైపు అన్నట్టుగా సాగింది ఇలా…
‘‘నేను అభ్యుదయ భావాలు గల పక్కా హిందువును. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నా ప్రతి పనిలో, ఆ విషయం ప్రస్ఫుటంగా గోచరించేలా చూసుకుంటాను. కానీ, నా మతాన్ని ఎవరు కించపరిచినా, నా శక్తి మేరా ఖండిస్తాను. రాముడి గురించి ఒక కవయిత్రి అవాకులు చవాకులు పేలితే, చులకనగా రాస్తే ఫేస్బుక్కుకు ‘hate speech’ అని కంప్లైంట్ చేసి, దాన్ని అన్ని గ్రూపుల్లో నుండి తీసేయించాను.
Ads
కానీ, శ్రావణ భార్గవి విషయంలో, మనమొక తప్పటడుగు వేసినట్టనిపిస్తుంది. మీకు నచ్చకపోయినా ఫర్వాలేదు, నా అభిప్రాయం ఇది. మన కవి పుంగవులు, బోలెడన్ని సాహిత్య అవార్డులు దొబ్బేసిన వాళ్ళంతా, సమాజం ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు, మార్గ నిర్దేశనం చేయకుండా, కుక్కి మంచంలో దుప్పటి కప్పుకుని, రంభ గురించో.. మరెవరి గురించో కలలు కంటుంటారు. అవార్డు దొబ్బేయగానే, తమకిక సమాజంతో పనిలేదని భావిస్తుంటారు. ‘కవి క్రాంతదర్శి’ అన్న నానుడి తమకు వర్తించదని భావిస్తుంటారు.
ఈ సందర్భంగా నాకు ‘పరమానందయ్య శిష్యులు’ సినిమాలోనిదే ఒక సీన్ గుర్తొచ్చింది. అందులో యన్టీయార్ రాజు. తప్పతాగి, ఒక వేశ్యతో రాత్రంతా గడిపి, లేచి చూసేసరికి, ‘శివరాత్రి’ గడియలు దాటిపోతున్నాయని గ్రహించి, ఎక్కడా శివలింగం కనిపించని తరుణంలో.., యల్. విజయలక్ష్మి వక్షోజాలు శివలింగంలా తోస్తాయి. వెంటనే వాటి మీద యన్టీయార్ పూలు చల్లితే, అవి శంకర భగవానుడి కాళ్ళ మీద పడ్డట్టు చూపిస్తారు. పూజ పూర్తవుతుంది. ఇది ఓ యాభై ఏళ్ళ క్రితమో ఏమో తీసిన సినిమా. సోషల్ మీడియా లేదు కాబట్టి గానీ ఉండి ఉంటే…!!
అలాగే, అన్నమయ్య సినిమాలో అంగాంగ, నాభీ, కచ, జఘన దృశ్యాలు ఏవీ కంట పడలేదేమో. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, ఆ సినిమా చూస్తానంటే, సినిమాలోని ఇటువంటి దృశ్యాలన్నీ కట్ చేస్తే, చివరకు సినిమా నిడివి గంటకు తగ్గిపోయింది. ఇక మోహన్ బాబు, రోజాల మధ్యన పాటను చూస్తే ఇప్పటికీ వాంతికొస్తుంది నాకు. అటువంటి చిత్రరాజాన్ని మనమందరం కలిసి, సాక్షాత్తూ అన్నమయ్య కుటుంబీకులతోసహా కలిసి, ఆ సినిమాకు అఖండ విజయం అందించాము.
పెద్ద హీరోలు చేసిన రెండున్నర గంటల బూతును, నవ రంధ్రాలు మూసుకుని, చూసి, ఇప్పుడేదో ధర్మోద్ధారకులుగా మాట్లాడడం సరి కాదు. నిజానికి, అన్నమయ్య కీర్తనలు, ఇప్పుడు, వాళ్ళ కుటుంబానికి చెందినవి కావు. అది సమాజపు ఆస్తి. కాదంటే డీఎన్ఏ టెస్టులు, కార్బన్ డేటింగుల పరీక్షలు జరపాల్సి ఉంటుంది. సభ్య సమాజం, ఎప్పుడూ పీడితుల పక్షాన, విజుతుల పక్షాన నిలబడి పోరాడాలి.
ఆ వీడియో తీసేసినంత మాత్రాన, ఆమె ఓడిపోయినట్టు కానే కాదు. కొన్ని విజయాలు కూడా, గెలిచిన వారిని, సిగ్గుతో తల దించుకునేలా చేస్తాయి. వాటిలో ఇదొకటి. ఓడిన భార్గవి విజయగర్వంతో, విజయ దరహాసంతో తలెగిరేసే తరుణమిది. ఇటువంటి మిథ్యా విజయాల వల్ల హిందూ ధర్మం గెలిచినట్టు కాదు. ఇటువంటి పెడధోరణులు 4,5 శతాబ్దాల్లో పెచ్చరిల్లినప్పుడే బౌద్ధ మతం, జైన మతం పుట్టుకొచ్చాయి….!!
Share this Article