ఏడో తరగతికి వెళ్తున్న ఓ అన్నయ్య నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఆరో తరగతి టెక్ట్స్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి. నీకు ఏడు రూపాయలకు ఇచ్చేస్తాను అన్నాడు. నేను ఓకే అనేసి కొనేశాను. మా అన్నయ్య వద్దన్నాడు. ఒకేళ ఏవైనా మారతాయేమో కదరా … స్కూల్లో కనుక్కున్నావా … అని కోప్పడ్డాడు. లేదూ కనుక్కున్నానూ … టీచర్ గారు కొనమంటేనే కొన్నానూ అన్జెప్పాను. అదయ్యిపోయింది..
ఆ అన్నయ్య ఇచ్చిన పుస్తకాల్లో తెలుగు టెక్ట్స్ తెరిచా … అందులో మొదటి పేజీలో నా పేరు తెల్సుకోవాలనుకుంటే పదిహేడో పేజీకి వెళ్లండి అని ఉంది. వెంటనే అక్కడకి వెళ్లా … సారీ ఇందాక ఏదో ఆలోచిస్తూ తప్పు చెప్పాను. మీకు కావాల్సింది నా పేరే కదా … అది ఇరవై ఆరో పేజీలో చూడగలరు. అసౌకర్యానికి చింతిస్తూ… అన్రాశాడు. వార్నీ అనుకుని ఆయొక్క ఇరవై ఆరో పేజీకి వెళ్తే … మీకు నన్ను క్షమించే పెద్ద మనసుందని తెల్సు … అందుకే నా పేరు ఇక్కడ చెప్పలేకపోతున్నాననే విషయం చెప్పినా మీరు కోప్పడకుండా నేను చెప్పినట్టు నలభై ఎనిమిదో నంబరు పేజీలో చూసి తెల్సుకుంటారు కదా అని రాశాడు. ఇలా మొత్తం తిప్పి ఐదో పేజీలో ఉన్న అక్షరాల్లో వాడి పేరు ఉన్న అక్షరాలను ఎర్రింకుతో మార్క్ చేయడం ద్వారా వాడి పేరు వెల్లడించాడు. అయ్య బాబోయ్ అనుకున్నాన్నేను.
అలా ఈ రామశర్మ గురించిన దుర్మార్గమైన ఇంట్రస్టింగ్ విషయాన్ని కాస్త ఆగి చెప్తానేం … ఆ కుర్రాడి పూర్తి పేరు ఉప్పులూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ. సినిమాల్లోకి వచ్చాక షార్ట్ గా ఉండాలని తనే అనుకునేసి రామశర్మగా మార్చుకున్నారు. స్వస్థలం పిఠాపురం. కాకినాడలో మాథమెటిక్స్ లో బిఎ చేశారు. అప్పట్లో ఉండేది … ఇప్పుడు బిఎ మాథ్స్ అంటే బీకామ్ లో ఫిజిక్స్ లా చూస్తారేమో పాపం రామశర్మ అంకుల్ ని … ఇప్పుడూ ఉందనుకుంటా … నాకు పెద్దగా తెల్దు …
Ads
ఈ బిఎ కుర్రాడికి ఉన్నట్టుండి ఓ దుర్భుద్ది పుట్టింది. సాధారణంగా ఇలా దుర్భుద్ది పుట్టినప్పుడే క్రియేటివిటీ బయటకు వస్తుంది. అలా … శుభమా అని బిఎ చదివి .. ఏదో ఒక ఉద్యోగమో సద్యోగమో చూసుకోకుండా … సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలని బొంబాయి వెళ్లి ఫజుల్ బాయ్ ఇన్స్ టిట్యూట్ లో చేరారు. సరిగ్గా అక్కడే ఛాయాగ్రాహకుడు బోళ్ల సుబ్బారావుతో పరిచయం అయ్యింది. కుదురుతక్కువ ఉండడం కూడా క్రియేటివిటీ లక్షణాల్లో ఒకటి అని వేదాల్లో రాసుందిట … నిజంగా ఉందా అని వెతక్కండి … ఉంది కాబట్టే నేను చెప్తాను. నేను చెప్పానంటే ఉంటుంది. లేకుండా అసలు నేనెట్లా చెప్తానూ … అదన్నమాట విషయం
ఆ విధంగా … సుబ్బారావు సలహా పట్టుకుని మద్రాసు వెళ్లి సినిమా వేషాల కోసం ప్రయత్నించి విఫలమై కాకినాడ వెళ్లిపోయాడు. సరిగ్గా అప్పుడే మన కమ్యూనిస్ట్ పార్టీ సాంస్కృతిక సంఘాల కళ్లల్లో పడ్డాడు మనోడు. అంతే … సంస్కృతి అనే కమ్యునిస్ట్ పార్టీ ప్రచార నాటకం తానే రాసి నటించాడు. కొన్ని అలా వచ్చేస్తాయి … మనం అంగీకరించాలంతే ఇది ఇలా కాకుండా ఉంటే బావుండేదే అని అనుకోడానికే వీల్లేదంతే వీల్లేదు … ఇలా జీవితం నాటకం అయ్యాక … గౌతమ బుద్ద నాటకంలో కూడా పాపులార్టీ సంపాదించాడు.
ఆ నాటకాలు చూసిన కురుమద్దాలి రామచంద్రరావు తన తీసిన మంత్రదండం సినిమా కోసం శర్మగారిని మద్రాసు పిలిపించాడు. మీర్జాపురం రాజా తీయబోతున్న తిలోత్తమ సినిమా లో హీరో వేషం కోసం మేకప్ టెస్ట్ చేయించారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు … ఆ యొక్క మంత్రదండమూ … తిలోత్తమ రెండు సినిమాల వేషాలూ షడన్ గా అక్కినేనికి వెళ్లిపోయాయి. అప్పుడు శర్మ అవాక్కయ్యారు.
ఇట్నుంచీ కానప్పుడు అట్నుంచీ నరుక్కురమ్మన్నారని ఎవురో నాబోటోళ్లు చెప్తే కామోసనుకుని … తమిళ నాడు టాకీస్ సౌందర్ రాజన్ ను కలిసారు. ఆయన అప్పుడు అదృష్టదీపుడు అనే సినిమా తీస్తూ అందులో డ్యూయల్ రోల్ ఆఫర్ చేశారు. అదృష్టదీపుడు హరిదత్తుడు రెండూ ఈయనే వేశారు సినిమాలో . ఆ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమంటే … మన గుండెనొప్పి గుమ్మడి గారి తొలి సినిమా ఇది.
హీరోయిన్ కృష్ణకుమారి తొలి హీరో రామశర్మే. ఎన్టీరామారావు బిఏ , వాసంతి బిఎ , రాఘవేంద్రరావు బి.ఎ అని వేసుకున్నట్టు గా .. రామశర్మ బిఎ అని వేసుకునేవారీయన కూడా టైటిల్స్ లో … బంగారుపాపలో రామశర్మ, కృష్ణకుమారిల జంట భలే ఉంటుంది. పాటలైతే అబ్బ ఎప్పుడు తల్చుకున్నా … వావ్ అనిపిస్తుంది. యవ్వన మధువనిలో … పాటైతే మరీనూ … అక్కడ నుంచీ .. పరోపకారం మంజరి, ఆకాశరాజు, గుమాస్తా, ఆదర్శం , ఆడజన్మ, మరదలు పెళ్లి, ప్రపంచం, నా చెల్లెలు ఇలా అనేక సినిమాల్లో రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్లారు రామశర్మ. తమిళ నిర్మాతల తెలుగు సినిమాల్లోనే రామశర్మ ఎక్కువగా హీరో వేషాలు వేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
వరసగా రెండు మూడు సినిమాల్లో కృష్ణ కుమారి రామశర్మ కనిపించే సరికీ సహజంగానే మరి వారిద్దరి మధ్య ఏదో ఉందని పత్రికలు వార్తలు రాసి సామాజిక సేవ చేశాయి. చాలా మందికి ఎన్టీఆరుకూ కృష్ణకుమారికీ మధ్య ఏదో ఉందని తెల్సు … నాలాంటి దుర్మార్గులైతే … ఓ అడుగు ముందుకు వేసి మరీ … లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక్కటే తీస్తే ఎలా వర్మా … కృష్ణకుమారీస్ ఎన్టీఆర్ ఎవరు తీస్తారు అని నిలదీసిన పరిస్థితి కూడా ఉంది… మీకు తెలియనిది కాదు …
అసలు ఇలాంటివి రాస్తారనే విషయం సినిమాల్లోకి కాలెట్టేప్పుడే రామశర్మకు తెల్సు. దీంతో ఆయన ఎవరితో సన్నిహితంగా ఉన్నా లేకున్నా పత్రికల వారితో సన్నిహితంగా ఉండేవారు పాపం. అలా ఉన్న పాపానికి … కృష్ణకుమారితో ఏమీ లేదురా నాయనా … అట్టా రాయమాకండి అని అందరితోనూ మంచీ చెడూ మాట్లాడి మానిపిస్తే … సర్లే మానేస్తాం అని ప్రామిస్ చేసి మరీ … కృష్ణ కుమారితో ఏమీ లేదన్న రామశర్మకు సావిత్రితో కూడా అపైర్ ఉన్నట్టు అనుమానపు నీలినీడలు పాండీబజారులో తచ్చాడుతున్నాయి అని వార్తలు రాసేశారు. దీంతో రామశర్మ కు గాసిప్పు పెన్నుకు ఘాటెక్కువ అని అర్ధమైంది.
ఇలా ఏదో కిందా మీదా పడుతూ కెరీర్ నడిపిస్తున్న సమయంలో … అదేనండీ …. యాభై ఆరులో ఆయనకి కుటుంబపరమైన చిక్కులు ఏర్పడడంతో ఓ ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది. తర్వాత తిరిగి వస్తే అంతకు ముందు తెల్సినోళ్లందరూ యూ హూ అన్నారు. అదేనండీ … మీరెవరూ అని అడిగారు. మద్రాసులో అంతా మారిపోయి ఉంది. సినిమాల్లేక … ఎప్పుడో సరదాగా నేర్చుకున్న హోమియో వైద్యాన్ని బయటకు తీసి వైద్యుడుగా అవతారమెత్తి కొంత సొమ్ము సంపాదించేసేవాడు.
అలాగే … రేస్ కోర్టులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్తూ … కొందరిని బాదేస్తూ ఇలా కాలక్షేపం చేశారు. అదే సమయంలో కొన్ని సినిమాల్లో కారక్టర్ రోల్స్ లోనూ కనిపించారు. గుమ్మడి గారితో టి.విశ్వేశ్వర్రావు తీసిన భక్తపోతనలోనూ … తర్వాత చాలా గ్యాప్ తర్వాత శోభన్ బాబుతో చటర్జీ నిర్మించిన జేబుదొంగ, విజృంభణల్లోనూ ఆయన చిన్ని పాత్రల్లో కనిపిస్తారు. అంటే చటర్జీ ఆయనకి ఇందాక చెప్పిన హోమియో వైద్యపు క్లైంట్ కావడంతో ఇది సానుకూలపడిందన్నమాట …
ఆ తర్వాత నెమ్మదిగా మద్రాసుకు టాటా అనేసి మళ్లీ కాకినాడ బాటపట్టారు. అలా అటూ ఇటూ తిరిగేస్తూనే … ఎనభై దశకం చివర్లోనే ప్రపంచానికి గుడ్ బై చెప్పేశారన్నమాట … అలా అనామకంగానే కన్నుమూశారు రామశర్మ… అంచేత ఇలాంటి వాళ్లని అప్పుడప్పుడూ మనలాంటి దుర్మార్గులైనా తల్చుకోకపోతే ఎలా? పైగా పోగుబంధం కూడా ఉందసలే … ఆ పెద్దమనిషీ కొంతకాలం కమ్యునిస్టు పార్టీ సాంస్కృతిక దళాల్లో పన్జేశాడు … అందుచేత రాస్తున్నాను తప్ప వర్గ స్పృహ లేక కాదండోయ్ … గమనించగలరు …
Share this Article