ఏం జరుగుతుంది..? ఏమీ జరగదు… చెరువు మీద అలిగి ఎవడో — కడుక్కోవడం మానేశాడట…? ఈ పైత్యం గాళ్లు ఇప్పటికే మన సమాజపు భావజాలాన్ని సమూలంగా భ్రష్టుపట్టించారు తమ సినిమాలతో… చెత్తా మొహాలను తీసుకొచ్చి, పదే పదే రుద్ది, ఒక్కో సినిమాకు కోట్లకుకోట్ల డబ్బులు ఇచ్చి, అవన్నీ ప్రేక్షకుల నుంచి దోచి, ఇన్నాళ్లూ సినిమా అంటే ఇదేరా అని చెప్పారు… ఇప్పుడేమో ప్రేక్షకుడు ఈడ్చి తంతున్నాడు… ఐనా స్టార్ హీరోల రేట్లు అలాగే ఉంటాయి…
థియేటర్ల దోపిడీ అలాగే ఉంటుంది… షూటింగులు బందు పెట్టి ఏదో ఆలోచిస్తారట… మీ మొహాలు మండ, మీరే మొత్తం నాశనం చేసి, మీరే ఏం ఆలోచిస్తర్ర భయ్… ముందు హీరోల బూట్లు నాకుడు బందు పెట్టండి, హీరోయిన్ల కాళ్ల భజన బందు పెట్టండి… ఈ మాదచ్చోద్ బిల్డప్పు సినిమా కథలు బందు పెట్టండి… ఆ హీరోయిక్ వైర్ ఫైట్లు, ఆ అణువణువూ ఆరబోతలు బందుపెట్టండి… ఇప్పుడు సినిమాల్ని బందుపెడితే ఏం జరుగుతుంది..? బలిసిన కేరక్టర్లు బాగానే ఉంటాయి… ఎటొచ్చీ ఏపూటకాపూట పనిదొరికితేనే కడుపు నిండే బతుకులే ఆగమాగం…
వాళ్లు మళ్లీ చెన్నై వెళ్లిపోతే… డబ్బు కాస్తున్న బెంగుళూరుకు వలసపోతే… అప్పుడేం ఏడుస్తారు..? హీరో, హీరోయిన్లతో మాత్రమే సినిమా తీయలేరు కదా… చితికిపోయిన దిగువ శ్రేణి టెక్నీషియన్స్‌ను దూరం చేసుకుంటే అసలుకే మోసం… అది గమనిస్తున్నారా ఈ బందు హీరోలు, నిర్మాతలు..? పెడధోరణులు బందు పెట్టకుండా ఇండస్ట్రీ చేయగలిగేదేమీ లేదు… దురదృష్టం కొద్దీ పెద్ద హీరోలే అసలైన కల్‌ప్రిట్లు, వాళ్లు చెప్పినట్టే నిర్మాతలు… ఆ కుటుంబాలదే ఎగ్జిబిటర్ల మాఫియా, వాళ్లదే ప్రొడ్యూసర్ల మాఫియా, వాళ్ల కుటుంబాల నుంచే హీరోలు… ఈ మాఫియా సినిమాల షూటింగుల్ని బందు పెడుతుందట… పొరపాటున ఏ సర్కారైనా వీళ్లకు ఏమైనా రాయితీలు ప్రకటిస్తే… టికెట్ల ధరల్లాగే ఔదార్యం చూపిస్తే, ఆ అధికారిక పార్టీలు మట్టిగొట్టుకుపోతాయి…
Ads
నిజానికి ఇది కేవలం తెలుగు సినిమా దురవస్థే కాదు… మొత్తం దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్య… హిందీ సినిమాలది మరీ దరిద్రం… కొన్ని సినిమాలకు కొన్నిరోజుల్లో కేవలం వేలల్లో వసూళ్లు ఉన్నాయంటే ఎంత ఘోరమైన సంక్షోభమో అర్థమవుతుంది… ఈ పతనం నుంచి, ఈ శిథిలాల నుంచే ‘‘కొత్త సినిమా’’ పుట్టుకురావాలి…
మిత్రుడు Prabhakar Jaini…… ఆగ్రహ ప్రకటన చదవండి… మరింత అవగతమవుతుంది…
‘‘ఈ నాటి తెలుగు సినిమా రంగ పరిశ్రమ సంక్షోభం పైన, సామాన్య ప్రేక్షకుడికి పెద్దగా సానుభూతి ఏం లేదు. నిర్మాతలు సినిమా షూటింగులు నిలిపివేస్తామని అంటే, ప్రేక్షకుడి వైపు నుండి ఎటువంటి కరుణాపూర్వకమైన రియాక్షనే లేదు. ఇటువంటి నిరాసక్త స్పందన గురించి నిర్మాతలు ఆలోచించడమే లేదు. ఎంత సేపూ వాళ్ళ లాభాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పెట్టుబడుల గురించి తప్ప, తెలుగు ప్రేక్షకుడు తమ సినిమాలను ఎందుకు ఆదరించడం లేదన్న కారణాన్ని మాత్రం విశ్లేషించుకోవడం లేదు.
కరోనా సమయంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో సమూలమైన మార్పు వచ్చింది. రోజుల తరబడి నిర్వ్యాపారం, పని లేకపోవడం వలన ప్రేక్షకులు, ఓటీటీ వేదికల మీద ఇతర భాషా చిత్రాలను చూసి, ఇంప్రెస్ అయి వాటితో తెలుగు సినిమాలను పోల్చి చూసుకుని, మన సినిమాలలోని డొల్లతనాన్ని పసిగట్టారు. కథల్లో నవ్యత లేకపోవడం, హీరోల బిల్డప్పులు, హీరోయిన్ల నకరాలు – ముఖ్యంగా ప్రజలు కరోనాతో అల్లల్లాడుతుంటే, ఏ ఒక్క సినిమా ప్రముఖుడు సిన్సియర్ గా తమకు సహాయం చేయకపోవడం ప్రజలను, తెలుగు సినిమాకు దూరం చేసింది.
ప్రజలు, సినిమా రంగ కార్మికులు, ‘అన్నమో రామచంద్రా!’అని అల్లల్లాడుతుంటే, సినీహీరోలు తమ వ్యానిటీ వ్యానులను, కోట్ల విలువ చేసే బంగళాలను, విమానాలను, ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తుంటే ప్రజలు ఛీ కొట్టారు. తాము చెల్లించే పైస పైసాను, వాళ్ళంతా కొల్లగొట్టినట్టు ఫీలయ్యారు. కరోనా సమయంలో తెలుగు సినీ హీరోలు ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. అరచేతిలో వైకుంఠంలాగా, మన కథే అనిపించే మంచి కథ, కథనం, భూమ్మీదనే నిలబడి నటించిన నటీనటులు, ఏ భాషవాళ్ళైనా సరే, వారి సినిమాలను బాగా ఆదరించారు. ఇన్నాళ్లూ తాము రొడ్డ కొట్టుడు సినిమాలను ఆదరించి నిర్మాతలను, సినీ హీరోలను, దర్శకులను కోటీశ్వరులను చేసామని గ్రహించారు. ఆ హీరోలు తమను, తాము కష్టాల్లో ఉన్నప్పుడు, వరదల్లో, ప్రకృతి విపత్తుల్లో ఎన్నడూ, ఆదుకోలేదనీ, ఆదుకోరని అర్థమయి వారిని దూరంగా పెట్టారు.
దానికి తోడు, చెత్త సినిమాలను నిర్మించి వేలాది స్క్రీన్లలో విడుదల చేసి, సినిమా గురించిన అసలైన ‘టాక్’ బయటకు వచ్చేలోగానే, రెండు మూడు రోజుల్లోనే, వందల కోట్లు గుంజేయాలనే కక్కుర్తిని ప్రేక్షకులు పసిగట్టారు. సినీహీరోలే, ఇప్పుడు నిర్మాతలై, లాభాల్లో వాటాలు గుంజుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా నెలల కొద్దీ విదేశాల్లో షూటింగులు, హీరోయిన్లకు కూడా కోట్లలో పారితోషికాలు, తన చెలికత్తెలతో సహా ఐదారుగురికి ఎగ్జిక్యూటివ్ క్లాసు విమాన ప్రయాణాలు, 7 నక్షత్రాల హోటళ్ళలో బస, సంవత్సరాల కొద్దీ నిర్మాణం, లక్షలాది రూపాయలు అద్దె చెల్లించి నిరుపయోగంగా పడి ఉండే సాంకేతిక సామాగ్రి వల్ల, నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది. ఈ వృధా ఖర్చులను చూసి సామాన్య ప్రేక్షకుడు ఎందుకు సానుభూతి చూపాలి?
చెత్త కథలను ఎన్నుకుని, పది ఇంగ్లీషు సినిమాలలోని సీన్లను కాపీ కొట్టి, వాటికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఏం లాభం? ఇప్పుడు తెలుగు సినిమా, తెలుగు సినిమా కాదు. ప్రతీది ‘పాన్ ఇండియా’ మూవీనే! దానిని మనమెందుకు చూడాలి? ప్రతీ భాష నుంచి ఒక నటుణ్ణి పెట్టి, అన్ని భాషల ప్రేక్షకులను ఫూల్స్ చేయాలనుకుంటే, అసలుకే మోసం వచ్చింది. నిర్మాతలు, దర్శకులు చేసే మోసాలను, గిమ్మిక్కులను ప్రేక్షకులు, పసిగట్టారు కాబట్టే అవి ఎంత తోపులైన హీరోలు నటించినా, ఈడ్చి తంతున్నారు. ఇప్పుడు ప్రేక్షకుడే హీరో! ఇప్పుడు ఇది ప్రేక్షకుడి సామ్రాజ్యం. దానికి తోడు, వీరి అక్రమ సంబంధాలు, పెళ్ళిళ్ళు, విడాకులు, ఎన్నికలు, అంగాంగ ప్రదర్శనలను చూసిన ప్రేక్షకుడికి వీరి పట్ల గౌరవం తగ్గిపోతుంది.
కాబట్టి ఆ విషయం గమనించి, మీరు దైవాంశసంభూతులు కారని, విర్రవీగడం ఆపి, భూమ్మీదకొచ్చి, కథను నమ్ముకుని, మంచి సినిమాలు తీస్తేనే మీకు భవిష్యత్తు. ఇక ఒక చిన్న నిర్మాతగా కూడా నాకు ఈ పరిణామం పట్ల పెద్ద బాధేమీ లేదు. ఈ నిర్మాతలు, మొదటి నుండీ, మా చిన్న సినిమాలను అణగదొక్కాలనే ఎన్నో కుట్రలు చేసారు. క్యూబ్ ధరలను పెంచారు. యాడ్స్ కు చోటివ్వలేదు. థియేటర్లను దొరకనీయలేదు. ఒక బలమైన శత్రువు లాగా మా పట్ల కక్ష కట్టారు. ఇప్పుడు ఓటీటీలు కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయి. కాబట్టి, ఒక చిన్న నిర్మాతగా, కొన్ని విలువలకు కట్టుబడి సినిమా అంటే అభిమానంతో సినిమాలు తీసే మాకు, సినిమా వ్యాపారం కాదు. కాబట్టి, ఈ సంవత్సరం కాకుంటే, వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తాను. పోయేదేం లేదు…’’
Share this Article