వయాగ్రా… ఈ పేరు వినగానే ఒక్కసారిగా అందరూ కనెక్టయిపోయారు ఆ వార్తకు… అందులోనూ హిమాలయ నేలల్లోని మూలిక, ఆర్గానిక్, సూపర్ పవర్ అని రాస్తూ ఉండేసరికి అందరూ తెగ ఆసక్తిగా చదువుతున్నారు… అసలేమిటీ సంగతి అంటారా..? 2, 3 రోజులుగా ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది… మొదట ఆ వార్త చదవండి…
‘‘హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లుకు చెందిన ఒకాయన లేబరేటరీలో హిమాలయ వయాగ్రాను పండించాడు… అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు 25 లక్షల ధర పలుకుతోంది… చైనాలో ఫుల్లు డిమాండ్… జస్ట్, 45 రోజుల పంటకాలం… ముందుగా 3 వేల బాక్సుల్లో పండిన ఈ పుట్టగొడుగులను బెంగుళూరుకు అమ్మేశాడు… ఇక రాను రాను చూసుకో నాసామిరంగా కోట్లేకోట్లు… ఈ కార్డిసెప్స్‌ను టిబెట్, నేపాల్‌లలో యర్సగుంబ అంటారు…
దీని వ్యవహారనామం కీడా జెడి… సముద్రమట్టానికి 3500 నుంచి 5000 మీటర్ల ఎత్తులో దొరికే ఈ మూలిక మన ఉత్తరాఖండ్‌లోనూ కనిపిస్తుంది… దీన్ని లేబరేటరీలో పండించిన గౌరవ్ శర్మ ‘‘దీని ధర మన దేశంలో కిలోకు 3- 5 లక్షలే… కానీ చైనాలో 20 – 25 లక్షల ధర…’’ అంటున్నాడు… సోలన్‌లోని పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ సతీష్ కుమార్ ‘‘మనవాళ్లకు దీని విలువ తెలియదు, మన రైతులను వీటి పెంపకం వైపు మళ్లిస్తాం’’ అంటున్నాడు…
Ads
హబ్బ, మన రైతులకు ఇక కోట్లేకోట్లు అనుకుంటున్నారా..? శుద్ధ దండుగ వార్త… ఒత్తిడి, వాతావరణం, సమస్యలు, కాలగతిలో దెబ్బతిన్న ఆరోగ్యస్థితి కారణంగా ప్రపంచంలో ప్రతి దేశంలోనూ పురుషుల్లో శృంగార సామర్థ్యం విపరీతంగా దెబ్బతింటోంది… అనేక నేరాలు, సామాజిక సమస్యలకు అదే కారణమవుతోంది… రసాయనాలతో తయారై, అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉండే వయాగ్రాకన్నా నేచురల్‌గా పొటెన్సీని పెంచే మూలిక అనగానే కోట్ల మందిలో ఓ ఆసక్తి ఏర్పడటం సహజం కదా…
ఎస్, ఈ కీడా జెడి కథ కూడా అంతే… కొన్నాళ్ల క్రితం ‘ముచ్చట’ ఒక స్టోరీ రాసింది… హైదరాబాద్‌కు చెందిన ఓ ఆయుర్వేద డాక్టర్ తరచూ నేపాల్ వెళ్లి, ఇతర మూలికలతో పాటు ఈ కీడా జెడిని కూడా అధిక ధరలకు తెస్తుంటాడు… కరోనాకు వేక్సిన్, చికిత్స మందు తయారు చేస్తున్నాడు అనేది ఆ స్టోరీ సారాంశం… అందులోనే ఈ కీడా జెడా మీద ఆయుర్వేదం పెట్టుకున్న ఆశల్ని కూడా రాసింది… ఎప్పుడైతే హిమాలయ వయాగ్రా అని ముచ్చట రాసిందో, ఇక ఆ స్టోరీలో పేర్కొన్న డాక్టర్‌కు ఫోన్లు చేసి, కరోనా వేక్సిన్ వద్దు గానీ, ఈ మూలికను ఎంతకు అమ్ముతారు అని ఆఫర్లు ఆరంభించారు… ఎంత ధరైనా సరే అన్నారు… దెబ్బకు స్టోరీ మార్చేయాల్సి వచ్చింది… అదీ వయాగ్రా టైపు మూలికలకు ఉన్న గిరాకీ…
నిజం చెప్పాలంటే… ఈ కీడా జెడి మూలిక కాదు… మొక్క కాదు… దుంప కాదు… చెట్లపై పెరిగే పరాన్నజీవి కూడా కాదు… పుట్టగొడుగు వంటి ఒకరకం ఫంగస్ కూడా అసలే కాదు… శిలీంధ్రమూ కాదు… అసలు దీన్ని జీవజాలంలోని ఏ కేటగిరీలో చేర్చాలో తెలియదు… ఒకరకం గొంగళిపురుగులు మరణించాక ఓరకమైన జీవజాలం వాటిపై పెరుగుతుంది… అవి ఎండిపోయి ఇలా కనిపిస్తాయి… అదే కీడా జెడి…
ఇప్పుడు కాదు… వేయ్యి సంవత్సరాలుగా చైనా ఆయుర్వేదం ఈ జీవజాలాన్ని అమృతంగా భావిస్తుంది… ఒక్క శృంగార సామర్థ్యం పెంపుకే కాదు… సుగర్, కేన్సర్, బీపీ, కాళ్ల నొప్పులు, స్పాండిలైటిస్, జీర్ణవ్యాధులు… వాట్ నాట్… అద్భుతమైన రోగనిరోధకశక్తిని పెంచి మనిషి ఆయుష్షును పెంచుతుందని నమ్ముతారు… అయితే వీటి డిమాండ్ పెరిగీ పెరిగీ కొన్నేళ్లుగా మొత్తం ఈ జీవజాలమే అంతరించిపోతోంది… దొరకడం లేదు… ఇదీ కఠినవాస్తవం… దీనిపైనే ఆధారపడిన నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు…
నిజానికి దీని ఔషధ విలువల గురించి చర్చ కాసేపు పక్కన పెడితే… నిజంగా ఆ ధర, ఆ డిమాండ్ ఆధారంగా… దాన్ని శాస్త్రీయమైన మదింపులోకి గనుక తీసుకున్న పక్షంలో చైనా ప్రభుత్వం ఇన్నాళ్లూ ఊరుకునేదా..? లేబుల్లో, టబ్బుల్లో వేలకువేల టన్నులు పండించేది కదా… పైగా ప్రతీ జీవానికీ భౌగోళిక సంబంధం ఒకటి ఉంటుంది… జీఐ పేటెంట్ అని కాదు… నేలతో సంబంధం… అదీ కొన్ని నేలలతోనే….!
ఛల్, నేను ప్రయోగశాలల్లో పండిస్తాను అంటే ఆ ఆర్టిఫిషియల్, హైబ్రిడ్ పంట (ఈ పదం వాడొచ్చా..?)కు దాని సహజఔషధ విలువలు ఉంటాయా..? ఇదంతా కేవలం డిమాండ్‌ను సొమ్ముచేసుకునే కక్కుర్తి యవ్వారమా..? అలాగే అనిపిస్తోంది… లేకపోతే పతంజలి రామ్‌దేవ్ బాబా ఊరుకునేవాడా..?! హలో… మీకు డబ్బుంది, ఈ కీడా జడి దొరికింది… పొడి చేసుకుని, మందులో కలిపేసుకుని తాగితే ఇక చూసుకో నాసామిరంగా అనుకోవడానికి వీల్లేదు… దీన్ని ఎలా వాడాలో, వేటితో కలిపి వాడాలో చెప్పేందుకు ఆయుర్వేద పద్ధతులున్నయ్… రా కొట్టేసే స్కాచ్ విస్కీ కాదు ఇది… సరేనా..?!
Share this Article