కడువ… ఇది సినిమా పేరు… జుత్తు పీక్కోవాల్సిన పనిలేదు… ఇప్పుడు వేరే భాషల నుంచి వచ్చే సినిమాలేవీ తెలుగు పేర్ల కోసం ఆగం కావడం లేదు… జస్ట్, అవే పేర్లను తెలుగు లిపిలో రాసేసి నడిపించేస్తున్నారు… ట్రెండ్… కడువ కూడా అంతే… మలయాళ సినిమా… కాదు, కాదు, పాన్ ఇండియా సినిమా… అనగా, మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు… అంతేకదా మరి… హడావుడిగా ఆ భాషల్లోకి డబ్ చేసేసి, థియేటర్లలోకి తోసి పారేయడమే…
జూలై ఫస్ట్ వీక్‌లోనే రిలీజైంది… కానీ ఇప్పుడు అమెజాన్ ఓటీటీలో స్ట్రీమవుతోంది కాబట్టి ఓ ప్రస్తావన… ఈ సంవత్సరం మలయాళంలో 50 కోట్ల వసూళ్లు కుమ్మేసిన సినిమా కాబట్టి చెప్పుకోవడం… నిజానికి జూలైలోనే ఓ వార్త కనిపించింది… సినిమాలో ఓచోట హీరో అంటాడు… తల్లిదండ్రుల పాపాలతోనే ఎడ్డిపిల్లలు (మానసికంగా ఎదుగుదల లేని) పుడతారు అని…!
మలయాళ ప్రేక్షకులే కాదు, ఇతర భాషల ప్రేక్షకులు కూడా బూతులు తిట్టారు… దర్శకుడు, హీరోల తలలు వాచిపోయాయి… నిజంగా కూడా చాలా నీచమైన డైలాగ్… వెంటనే దర్శకుడు షాజీ కైలాస్ ఫేస్‌బుక్‌లో ఓ సుదీర్ఘమైన వివరణను, క్షమాపణను పోస్ట్ చేశాడు… హీరో పృథ్వీరాజ్ కూడా క్షమాపణ కోరాడు… ఆ పార్ట్ వెంటనే సినిమాల నుంచి తీసేశారు… ఇదీ దిద్దుబాటు… అంతేకాదు, నెటిజనం తిట్లకు మేం అర్హులమే అని లెంపలేసుకున్నారు…
Ads
సినిమా విషయానికి వస్తే మలయాళ సినిమాల్లో పెద్దగా హీరో ఎలివేషన్లు మన్నూమశానాలు ఉండవు… ఇప్పుడు అక్కడ జనం అలాంటి బిల్డప్పులను కూడా చూస్తున్నారు… అందుకేనేమో పృథ్విరాజ్ ఆ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ పంథాను ఎంచుకుంటున్నాడు… పాపులర్ అవుతున్నాడు కూడా… ఈ సినిమా కూడా అంతే… పైకి చూడబోతే అయ్యప్పనుం కోషియం తరహాలో రెండు ప్రధాన పాత్రల నడుమ ఇగో క్లాష్ అనిపిస్తుంది… సినిమా ఆరంభం నుంచే హీరో పాత్రకు ఎలివేషన్ పెంచుతూ పోయాడు దర్శకుడు షాజీ కైలాస్…
ఒక ఊరు… రబ్బర్ ప్లాంటేషన్ల రైతు పృథ్వి… అందరికీ కావల్సినవాడు… అక్కడికి వివేక్ ఐజీ రేంజ్‌లో పోలీసాఫీసర్‌గా ఎంట్రీ ఇస్తాడు… ఏదో ఓ చిన్న విషయంలో ఆ రెండు కుటుంబాల నడుమ వైరం… అది పెరిగీ పెరిగీ ఈ సినిమా కథంత ముదురుతుంది… అంతే… అది పేరుకు మలయాళ సినిమాయే కానీ… పక్కా తెలుగు సినిమా లక్షణాలే ఉంటయ్… పైగా నాసిరకం తెలుగు అనువాదం… పాటల గురించి ఎవరైనా మాట్లాడితే తోమాల్సిందే ఓసారి…
హీరో మంచి నటుడే… ఎలివేషన్లు అలవాటవుతున్నయ్… విలన్‌గా చేసిన వివేక్ ఒబెరాయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది..? ఇలాంటి సినిమాల్లో హీరోయిన్‌కు పెద్ద పనేముంటుంది..? సంయుక్త మేనన్ పాత్ర సోసో… మిగతా వాళ్లంతా మలయాళీలే… మామూలుగా మలయాళీ సినిమా అనగానే, అందులోనూ పాన్ ఇండియా అనగానే, ఓటీటీలో కనిపించగానే ప్రేమగా చూసేవాళ్లకు ఈ సమీక్ష… తెలుగులోనే పెద్ద పెద్ద భీకరమైన, బీభత్సమైన ఎలివేషన్లు చూసి ఉన్నాం.., పృథ్వీరాజ్, నువ్వింకా మా స్టార్ హీరోల ముందు బచ్చావే కదా…!!
నవ్వొచ్చేదేమిటంటే… ఎక్కువగా కథాబలమున్న సినిమాలు తీస్తుంటారు కదా మలయాళ దర్శకులు… ఈ బిల్డప్పుల సినిమాల్ని, పెద్దగా కథ అవసరం లేని సరుకునే ఎలా డీల్ చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు… తడబడుతున్నారు… ఈ సినిమా కూడా అంతే… లాస్ట్, అరగంట మొత్తం సినిమాను ఎలా ముగించాలో తెలియక సతమతమైన తీరు కనిపిస్తుంది… ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ పేలవం… హలో… సీక్వెల్ కూడా ఉంటుందనే హింట్ కూడా ఇచ్చారండోయ్…!!
Share this Article