చూడబుల్ మొహం… బలమైన సినిమా నేపథ్యం… తండ్రి పాతుకుపోయిన ఎగ్జిబిటర్… ఫుల్లు సాధనసంపత్తి… అయితేనేం, హీరోగా దుమ్ము రేపాలంటే ఎక్కడో సుడి ఉండాలి… హీరో నితిన్‌ను చూస్తే… అప్పుడెప్పుడో 20 ఏళ్లయింది ఫీల్డుకొచ్చి… మూతి మీద మీసాలు కూడా రాకముందే చేసిన ఆ జయం సినిమా హిట్… అంతే… పదేళ్లు పల్టీలే… కృష్ణవంశీ వంటి దర్శకులు కూడా లైఫ్ ఇవ్వలేకపోయారు… వేరే అనామకులైతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యేవాళ్లు… కానీ తన బ్యాక్ గ్రౌండ్ బలమైంది కదా, నిలబెట్టింది…
2012లో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే… పర్లేదు… తరువాత నాలుగేళ్లకు త్రివిక్రమ్… ‘అ ఆ’… ఆ తరువాత మళ్లీ ఫట్ ఫట్ ఫట్… ఎందుకు తీస్తున్నాడో, ఏం తీస్తున్నాడో తనకే తెలియదు… రొటీన్, ఫార్ములా సినిమాల కాలం పోయిందని కూడా తెలుసుకోలేనంత పాతకాలపు మనస్తత్వం… తనకు తగ్గట్టు దొరికాడు శేఖర్‌రెడ్డి అనే దర్శకుడు… ఈసారి మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తీసుకొచ్చాడు… మూస… సినిమా మొత్తమ్మీద వీసమెత్తు కొత్తదనం కనిపించదు వంద భూతద్దాలు వేసుకుని వెతికినా…
ఈ శేఖర్‌రెడ్డి రెండు కులాల్ని తిడుతూ ఏదో ట్వీటాడని అప్పట్లో రచ్చ… అబ్బే, అది ఫేక్, మా దర్శకుడు స్వాతిముత్యం అని నితిన్ వెనకేసుకుని రావల్సి వచ్చింది… నితిన్ స్వతహాగా చిరంజీవి, పవన్ అభిమాని కావడంతో ఆ ట్వీట్ పెద్దగా మంటలు పెట్టలేదు… కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది… సినిమా బాగుంటే అవన్నీ పక్కకుపోతాయి… సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు… చివరకు ఐటమ్ సాంగ్ కూడా రారారెడ్డీ అనే పిలుస్తున్నా సరే…
Ads
సివిల్స్ అయిపోయాక నేరుగా కలెక్టర్ కొలువు ఇచ్చేస్తారా..? అసలు ఈ దర్శకుడి బుర్రకు సివిల్ సర్వీసు మీద నయాపైసా అవగాహన ఉందా..? మనవాళ్ల మైండ్‌సెట్ అలా ఫిక్సయిపోయింది… చివరకు కలెక్టర్ అయినా సరే పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని రౌడీలను దమ్మడ దమ్మడ ఇరగదీయాలి… ఒక్క హీరోయిన్ ఏం సరిపోతుంది..? కేథరిన్ కావాలి, కృతిశెట్టి కావాలి… ఐనా సరిపోరు, అంజలిని పట్టుకొచ్చి ఐటం సాంగ్ చేయించాలి… తీరా చూస్తే సినిమాను ఏ ఒక్క అంశంలోనైనా మెచ్చుకోవచ్చా..? కొత్తదనం అనే మాటకు కిలోమీటర్లకొద్దీ దూరంలో ఉండిపోతుంది సినిమా…
ఏమీ లేదు… వెన్నెల కిషోర్ తెలుగు సినిమాకు భారంగా మారిపోతున్నాడు రోజురోజుకూ… ఫుల్లు మొనాటనీ… స్క్రీన్ స్పేస్ హీరోకన్నా తనకే ఎక్కువ దొరికినట్టుంది… కానీ ఒక్క బిట్టయినా నవ్విస్తే కదా… కేథరిన్, అంజలిని పక్కన పెడితే… కృతిశెట్టి తెర మీద ఉన్నంతసేపు కాస్త ప్లజెంటుగా ఉంటుంది… అంతే…
ఇక ఇందులో సినిమాటోగ్రఫీ, సంగీతం, పాటల గురించి చెప్పుకోవడానికి ఏముంది..? అసలు సినిమా మొత్తం… ఏళ్లకేళ్లుగా తెలుగు సినిమాలో దంచీ దంచీ నలగ్గొట్టిన ఫార్ములా కథ, కథనాలే కదా… ఒక హీరో ఇరవై ఏళ్ల ఇండస్ట్రీలో ఉండటం గొప్పకాదు… ఎటొచ్చీ, ఇదీ నా సినిమా అని కాలర్ ఎగరేసి చెప్పుకునే మేలిమిరకం సినిమా ఒక్కటైనా ఉందా నితిన్..?! అన్నట్టు బింబిసార, సీతారామంతో తెలుగు సినిమాకు మళ్లీ మంచిరోజులొచ్చాయి, జనం థియేటర్లకు వస్తున్నారు, బంగారురోజులే ఇకపై అని ఎడాపెడా రాసేస్తున్నారు కదా కొందరు… ఫాఫం… ఆ బెలూన్‌కు బొక్కకొట్టడానికి నితిన్ వచ్చేస్తున్నాడని మరిచిపోయినట్టున్నారు..!!
Share this Article