నిజానికి ఓ పురాణకాలానికి వర్తమానాన్ని జోడించి ఓ కథను ఆసక్తికరంగా చెప్పడం… అందులోనూ ఓ దైవకార్య సాధనలో ఓ నాస్తిక కథానాయకుడి సాహసయాత్రను ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడం చాలా పెద్ద టాస్క్… అదంత వీజీ కాదు… అదే ఒక అడ్వెంచర్… అడుగు తప్పుగా పడితే ఇక ఢమాలే… కార్తికేయ-2 సినిమా దర్శకుడు చందు ఆ సాహసం చేశాడు… చాలావరకూ మెప్పించాడు…
ఎంతసేపూ చెత్త ఫార్ములాలు, ఇమేజీ బిల్డప్పుల సోది కథలతో విసుగెత్తించే మన సినిమా కథల నడుమ కార్తికేయ-2 కథ, కథనం, ప్రజెంటేషన్ అందుకే భిన్నంగా అనిపిస్తాయి… కొత్తగా, ఆసక్తికరంగా సాగుతుంది సినిమా… అప్పట్లో వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ ఏమీ కాదు… కథానాయకుడు మాత్రమే సేమ్… మిగతాదంతా వేరే కథ… ఓ ఫాంటసీ… (అశ్విన్ సంఘీ వంటి పాపులర్ రైటర్ రాసిన ‘ది కృష్ణా కీ’ పెద్ద తెర మీద చూస్తున్నట్టు అనిపిస్తుంది… ఇదో తరహా ఫిక్షన్…)
అప్పుడెప్పుడో వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు అని ఓ సినిమా వచ్చింది… కథానాయకుడికి ఇష్టమున్నా లేకపోయినా ఒక పని వైపు హీరోను లాక్కుపోతుంది విధి… అది కూడా ద్వారక సంబంధమైన కథే… సేమ్, కార్తికేయ-2లో కూడా అసలు దేవుడినే నమ్మని కథానాయకుడు తనే ఓ దైవకార్యంలోకి అనివార్యంగా నెట్టేయబడతాడు… ఒక పని ఎవరికోసమైతే నిర్దేశించబడి ఉందో, అటువైపు అనివార్యంగా ఆ వ్యక్తి అడుగులు పడతాయి… అందుకే ఈ సినిమాలో కూడా నాస్తికుడైన హీరో తన అమ్మ మొక్కు కోసం ద్వారకకు వెళ్లి, తనకు నిర్దేశించిబడి ఉన్న ఆ దైవ కార్యం తలకెత్తుకోవాల్సి వస్తుంది… ఎక్కడో ద్వారకలో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో సాహసయాత్ర చేస్తాడు… చేయాల్సి వస్తుంది… ఈక్రమంలోనే దర్శకుడు శ్రీకృష్ణతత్వాన్ని బోధించే ప్రయత్నం చేస్తుంటాడు మనకు…
Ads
అఖండ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రను మినహాయిస్తే మిగతాదంతా ఉత్త రొటీన్, సోది… ఉత్త నాకుడు తరహా ఊర మాస్ కథనం… కానీ ఆ ఒక్క పాత్ర, దాంతో చెప్పించే డైలాగులు, దానికి తగిన హైపిచ్ బీజీఎంతో సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది… అదీ కథ చెప్పే విధానంలో కొత్తదనం… నిజానికి సింపుల్‌గా పైపైన చెప్పుకుంటే కార్తికేయ-2 కథ వెంటనే కనెక్ట్ కాదు, కానీ దర్శకుడు కొత్తకొత్తగా కథను చెబుతూ, మనల్ని కథాగమనంలో లీనం చేస్తాడు… కథాకథనాల్లో అనేకచోట్ల లాజిక్కులే ఉండవు… ఐనా ఓ ఫాంటసీ కథలో లాజిక్కులేముంటాయి…?
శ్రీకృష్ణుడు ఈలోకం నుంచి నిష్క్రమిస్తూ, రాబోయే రోజుల్లో తలెత్తే ఉపద్రవాలకు ఓ విరుగుడు శక్తిని తన కాలి కడియంలో ఉంచేస్తాడు… అదుగో దాని జాడ కోసం కథానాయకుడు సాగించే సాహసయాత్రే ఈ కార్తికేయ-2… మంచి ప్రయత్నమే… ఎక్కడా ద్వంద్వార్థ అశ్లీలాలు లేవు, అలాంటి సీన్లు లేవు… ఐటమ్ అసభ్యతలు లేవు… వెకిలి కామెడీ లేదు… కథానుసారం కొంత యాక్షన్ ఎలాగూ తప్పదు… అక్కడక్కడా అవసరానికి తగినట్టు గ్రాఫిక్స్ సరేసరి… ఏ సంకోచమూ లేకుండా పిల్లలు, కుటుంబంతో సినిమాకు వెళ్లొచ్చు…
నిఖిల్ ఆ పాత్రకు అనుగుణంగా నటించాడు… ఎక్కువ కాదు, తక్కువ చేయలేదు… ఎంత అవసరమో అంత… తోటి హీరోల్లాగా మాస్ హీరోయిజం వైపు మూర్ఖపు అడుగులు వేయకుండా భిన్నమైన కథల్ని ఎంచుకునే నిఖిల్ ధోరణిని మెచ్చుకోవచ్చు… హీరోయిన్ అనుపమ పాత్ర కూడా ఓ సగటు తెలుగు సినిమా హీరోయిన్ టైపు కాదు… కథలో ఓ ప్రధాన పాత్రే… హీరో పక్కన నాలుగు పిచ్చిగెంతులు వేసి వెళ్లిపోయే కేరక్టర్ కాదు… తెరపై ఉన్నంతసేపూ ఆమె ప్రజెన్స్ బాగుంది… కాసేపే అయినా అనుపమ్ ఖేర్‌ది కూడా ఓ కీలకపాత్రే… కార్తికేయ-3కు అవసరమైన పూర్వరంగం సిద్ధం చేసి మరీ సినిమాను ముగించాడు దర్శకుడు…
టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వోకే… పాటలు సోసో… బీజీఎం విషయానికొస్తే కాలభైరవ కొన్ని సీన్లను ఎలివేట్ చేశాడు… కొన్నిచోట్ల అతి చేశాడనీ అనిపిస్తుంది… కానీ స్థూలంగా వోకే… పర్లేదు, ఒక బింబిసార, ఒక సీతారామం, ఒక కార్తికేయ-2… తెలుగు సినిమా మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది… మంచి శకునాలే…!!
Share this Article