అప్పుడెప్పుడో నువ్వేకావాలి అనే సినిమా వచ్చింది ఉషాకిరణ్ మూవీస్… ఎదురెదురు ఇళ్లలో ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… కలిసి చదువుకుంటారు… అల్లరి సరేసరి… దాపరికాల్లేవు… తమ నడుమ ఉన్నది ఉత్త స్నేహం కాదనీ, అది ప్రేమేనని తెలిసి ఒక్కటయ్యే కథే సినిమా… పాటలు బాగుంటయ్, కథనం సరదాగా సాగుతుంది… తరుణ్, రిచాల జంట బాగుంటుంది… వెరసి సినిమా అప్పట్లో సూపర్ హిట్… సీన్ కట్ చేయండి…
తిరు అనే సినిమా ఒకటి రిలీజైంది… ధనుష్ హీరో, నిత్యా మేనన్ హీరోయిన్… పెద్దగా ప్రమోషన్లు లేకుండా సైలెంటుగా థియేటర్లలోకి వచ్చింది… తమిళంలో తీసిన సినిమా… సన్ పిక్చర్స్ వాళ్లు తీసిన సినిమా… తెలుగులో ఎలాగూ ధనుష్‌కు కొంత మార్కెట్ ఉంది కాబట్టి, వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టుగా తెలుగులోనూ కొన్ని డబ్బులు రాకపోవు అనుకుని రిలీజ్ చేసినట్టున్నారు… వాళ్ల టార్గెట్ మాత్రం తమిళ ప్రేక్షకులే…
నువ్వే కావాలి సినిమా కథలాగే… ఇందులో హీరో, హీరోయిన్ కిందా, పైన పోర్షన్లలో ఉంటారు… స్నేహితులు… ఏమీ దాచుకోరు… అన్నీ షేర్ చేసుకుంటారు… హీరో రాశిఖన్నాను ప్రేమిస్తాడు, ఆమె ఫోఫోవోయ్ అంటుంది… అదీ చెబుతాడు… ఇంకెవరో ప్రియా భవానీశంకర్ ప్రేమ కూడా రిజెక్ట్ అవుతుంది… తనేమో డెలివరీ బాయ్… తండ్రి ప్రకాష్‌రాజ్ మీద కోపం… తల్లి, చెల్లె చావుకు తనే కారణమని..! తాత భారతీరాజాా కోసం ఒకే ఇంట్లో తండ్రితో కలిసి ఉంటాడు, కానీ మాటల్లేవు…
Ads
కింది పోర్షన్ నుంచి హీరోయిన్ నిత్యా మేనన్ కాస్త సినిమాటిక్‌గా పైన పోర్షన్‌లోకి అడుగుపెడుతుంది… ఈమధ్యలో జరిగేదే సినిమా కథ… ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పుకుందాం… ఒకటీరెండే కాబట్టి… నో డౌట్… నిత్యామేనన్ డామినేట్ చేసేసింది… ఆమె లేకపోతే సినిమా లేదు… డొల్ల… ఆమె ఉన్నంతసేపూ తెరమీద ప్లజెంట్‌నెస్… రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్యతో విడాకుల ప్రభావం కాస్త పనిచేస్తున్నట్టుంది… ధనుష్ డల్‌గా ఉన్నాడు… సినిమాలో అసభ్యత, అశ్లీలం ఉండదు, హీరోయిక్ బిల్డప్పులు ఉండవు… ఎక్కడా వెగటుతనం లేదు… ప్లెయిన్ అండ్ ఫెయిర్ కథనం… మెలోడ్రామా కూడా పెద్దగా ఉండదు… టీనేజీ పిల్లలతో పేరెంట్స్ ఎంచక్కా నిస్సంకోచంగా చూడతగిన సినిమా… కానీ..?
సదరు సన్ పిక్చర్స్ వాళ్లు ఎంతటి మూర్ఖాగ్రేసరులు అంటే… నిత్య, ప్రకాష్ రాజ్‌కు కూడా వేరే వాయిస్ ఓవర్… ప్రకాష్‌రాజ్ గొంతు, తన మాటతీరు డిఫరెంట్‌గా ధ్వనిస్తుంది… తెలుగు వాళ్లకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఆ వాయిస్… ఇంకెవరితోనో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్ పాయింట్… తమిళంలో అనిరుధ్ పాపులర్ సంగీత దర్శకుడు కావచ్చుగాక… కానీ తెలుగులో జస్ట్, జిందాతిలిస్మాత్ పాటలు అవి… ఉన్నంతలో నిత్య సినిమాను మోసింది… కానీ ఇప్పటికీ ఆమె బరువు ఆమెకు మైనసే… ఈమధ్య కాస్త తగ్గింది కానీ ఆమె ఎత్తు తక్కువ కాబట్టి ఓ మోస్తరు స్థూలకాయంలాగే అనిపిస్తుంది… ధనుష్ ఏమో సలాకలాగా సన్నగా కనిపిస్తే ఈమె ఒబేసిటీ… కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్ ఏమీ కుదరలేదు…
ప్లెయిన్ కథనం… క్లైమాక్స్ దాకా అలా అలా ఏదో టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా సాగిపోతుంది కానీ పెద్దగా థ్రిల్లింగ్ మలుపులు, సీన్లు కనిపించవు… రాశీ ఖన్నా, ప్రియ భవానీశంకర్, భారతీరాజా పాత్రలకు స్కోప్ తక్కువ… వాళ్ల నటన సోసో… సో, మరీ పర్సు ఖాళీ చేసుకుని థియేటర్ల దాకా వెళ్లి, థియేటర్ల దోపిడీకి సహకరించాల్సిన అగత్యం ఏమీ లేదు… ఎంచక్కా సన్ ఓటీటీలో చూడొచ్చు… దాన్ని పెద్దగా ఎవరూ తెలుగులో సబ్‌స్క్రయిబ్ చేసుకోరు కదా… పర్లేదు, జెమినీ టీవీలో వస్తుంది… ఈ సినిమా నిర్మాతలు వాళ్లే కదా… థియేటర్ నుంచి బయటపడ్డాక ప్రేక్షకుడికి అనిపించేది… ‘‘ఫాఫం నిత్యామేనన్’’ అని…!!
Share this Article