కంగనా రనౌత్… కొన్నిసార్లు ఆమె ప్రదర్శించే తెగువకు ఆశ్చర్యం కలుగుతుంది… ముంబైలోని బాలీవుడ్ మాఫియాను, అక్కడి శివసేన సర్కారును ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన తీరు కూడా అబ్బురపరుస్తుంది… అదేసమయంలో కాస్త ఆమె తిక్క ధోరణి పట్ల నవ్వొస్తుంది కూడా..! తను ఏది అనుకుంటే అదే రైట్ అనుకునే వైఖరితో ఓ తింగరిది అనిపిస్తుంది…
తాజాగా ఫిలిమ్ ఫేర్ అవార్డులకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆమె పరిపక్వతలేమినే ప్రదర్శిస్తున్నాయి… ఆమె ఏమంటున్నదంటే…? ‘‘నేను ఫిలిమ్ ఫేర్ అవార్డుల మీద కోర్టుకు వెళ్తా… నాన్సెన్స్, వాళ్లు పక్కా అనైతిక ధోరణులను ప్రదర్శిస్తుంటారు… వాళ్ల అసమంజస వ్యవహార శైలితో విసిగిపోయి నేను 2014 నుంచే ఫిలిమ్ ఫేర్ అవార్డులను బహిష్కరించాను…
ఐనాసరే, కాల్స్ చేస్తుంటారు… అవార్డుల ఫంక్షన్లకు రమ్మంటారు… తలైవి సినిమాకు అవార్డు ఇస్తామని చెబుతున్నారు… నేను వద్దన్నా సరే, నా పేరును అవార్డుకు నామినేట్ చేస్తున్నారు… ఇదంతా నా గౌరవానికి భంగకరం అనిపిస్తూ ఉంటుంది నాకు… నేను ఎంచుకున్న విలువలకు వ్యతిరేకం అనిపిస్తుంది… నా అంతట నేనే ఆ అవార్డులకు దూరంగా ఉంటున్నా సరే, నన్ను ఆ రొంపిలోకి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు… అందుకే కోర్టుకు లాగుతా’’….. ఇదీ ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన పోస్టు సారాంశం…
Ads
నిజంగానే ఆమె పేరును లీడ్ రోల్‌లో బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో నామినేట్ చేశారు… అదీ జయలలిత పాత్ర పోషించి తలైవి సినిమాలో ఆమె నటనకు… ఆమెతోపాటు కైరీ అద్వానీ, కృతిసనన్, పరిణీతి చోప్రా, తాప్సీ పన్ను, విద్యాబాలన్ కూడా నామినేషన్లలో ఉన్నారు… కంగనాకు ఫిలిమ్ ఫేర్ అవార్డులు కొత్తేమీ కాదు… తన కెరీర్‌లో అయిదు ఫిలిమ్ ఫేర్ అవార్డుల్ని గెలుచుకుంది… తన ఫస్ట్ ఫిలిమ్ గ్యాంగ్‌స్టర్ సినిమాకు తొలి అవార్డు సాధించింది…
ఫిలిమ్ ఫేర్ మాత్రమే కాదు, ఆమె ఏ అవార్డులనైనా జస్ట్, అలా ఓ సాకు చూపి బహిష్కరించేస్తుంది… లతా మంగేష్కర్‌కు సరైన నివాళి అర్పించలేదని చెబుతూ ఆస్కార్, ఎమ్మీ అవార్డులను బాయ్‌కాట్ చేసింది తను ఓసారి… దాకడ్ అడ్డగోలుగా ఫెయిలైన తరువాత ఇప్పుడు ఇందిరగాాంధీ పాత్ర కోసం కష్టపడుతోంది… సినిమా పేరు ఎమర్జెన్సీ…
అయితే ఇక్కడ నిజానికి ఫిలిమ్ ఫేర్ ప్రొఫెషనల్‌గానే వ్యవహరిస్తోంది… మార్కెట్‌లో ఉన్న ఓ పాపులర్ నటిని, ఆమె పర్‌ఫామెన్స్ ఆధారంగా నామినేట్ చేస్తూనే ఉంది… తమను బహిష్కరించిందని ఉడుక్కోకుండా, తమ బాధ్యతగా ఆమెను అడుగుతూనే ఉంది… ఒకవేళ అవార్డు వస్తే దాన్ని తీసుకోవాలా లేదానేది ఆమె ఇష్టం… (ఆ అవార్డులకు కొన్ని లెక్కలుంటాయి, కొన్నిసార్లు బేరసారాలు ఉంటాయి)… అంతేతప్ప అదేదో దేశద్రోహమన్నంత సీరియస్ ఆరోపణలు అవసరం లేదు…
ఆమె ఫిలిమ్ ఫేర్ మాత్రమే కాదు, ఏ ఇతర ప్రైవేటు అవార్డులకైనా వెళ్లదు… గతంలో వెళ్లేది… తరువాత మానుకుంది… జాతీయ అవార్డులకు మాత్రం వెళ్తుంది… (నిజానికి అవీ పైరవీ అవార్డులే… మెరిట్ బేస్డ్ అని నమ్మేట్టుగా ఉండవు)… కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డులను నాన్-కరప్ట్ వ్యవహారంగా భావించడమే కంగనా తింగరితనం..!! ఒకవేళ నిజంగానే ఫిలిమ్ ఫేర్ గనుక తలైవికి అవార్డు ప్రకటిస్తే, దాన్ని అంగీకరిస్తే తప్పేమీ లేదు… దానికి ఆమె అర్హురాలే…!!
Share this Article