విజయ్ దేవరకొండ… 2017లో, అంటే అయిదేళ్ల క్రితం ఓ అర్జున్‌రెడ్డి, ఓ గీతగోవిందం… అంతే, ఇక… ఇప్పటికి మళ్లీ హిట్ లేదు, కానీ అసాధారణంగా తనంటే క్రేజు మాత్రం పెరుగుతోంది… లైగర్ ప్రమోషన్స్ సమయంలో ప్రతిచోటా తన పట్ల విపరీతంగా జనం విరగబడటమే నిదర్శనం… రౌడీ హీరో అనే ఇమేజీ, పెద్దగా హిపోక్రసీ లేని మాటలు ఓ డిఫరెంట్ కేరక్టర్‌గా నిలబెట్టాయి తనను… కానీ విజయ్ మరిచిపోయిన ఓ చేదునిజం ఏమిటంటే… ఈ ఇండస్ట్రీ చాలామంది తోపుల్ని చూసింది అని… తనకు తెలియని ఓ సూత్రం ఏమిటంటే… అతి సర్వత్రా వర్జయేత్…
బాయ్‌కాట్ చేస్తరా, కొట్లాడుదాం… ఇండియాను షేక్ చేద్దాం… వంటి వ్యాఖ్యలతో పెద్దగా జరిగే లాభం, నష్టం ఏమీ ఉండదు… కానీ తనేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వ్యాపిస్తే మాత్రం ప్రమాదం… అది తన సినిమాలకు కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది… కరణ్‌జోహార్ మీద ప్రస్తుతం ఇండస్ట్రీలో నెగెటివిటీ ఉంది… కానీ తనను ఎడాపెడా మెచ్చేసుకోవడం, తన కాఫీ విత్ కరణ్ చాట్ షోలో విజయ్ తన శృంగార జీవితం, అభిరుచి మీద ఏవేవో తిక్క వ్యాఖ్యలు చేసుకోవడం, లైగర్ సినిమాకు ప్రొడ్యూసర్ కరణ్ కావడం ఆ సినిమా పట్ల ఓరకమైన వ్యతిరేకతకు కారణమయ్యాయి…
అంతేకాదు, దేశమంతా ఆమీర్‌ఖాన్ పట్ల నెగెటివ్‌గా ఉంటే విజయ్ మాత్రం మద్దతుగా, తనకు సపోర్ట్ చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం అన్నట్టుగా మాట్లాడటం చివరికి తన అర్ధజ్ఞానాన్నే ప్రదర్శించుకున్నట్టయింది… ఇలా తన లైగర్‌కు తనే మరింత వ్యతిరేకతను ప్రోదిచేసుకున్నాడు… దీనికితోడు బరిబాతల నిలబడి, నడుం కింది భాగంలో ఓ పూలగుత్తి అడ్డంగా పెట్టుకున్న పోస్టర్ కూడా జనంలోకి నెెగెటివ్‌గా వెళ్లిపోయింది… యాటిట్యూడ్ అంటే ఇలాంటి వేషాలు కావని విజయ్‌కు చెప్పేవాళ్లు లేరు… చెప్పినా వినే కేరక్టర్ కూడా కాదు… సో, జరగాల్సిన నష్టం జరిగిపోయింది…
Ads
ఇదంతా ఒకెత్తు… ఒకప్పుడు వెలుగు వెలిగిన దర్శకులు, ట్రెండ్స్ క్రియేట్ చేసినా సరే అదే పాత తరహా, తమదైన మూసలో కొత్తగా ప్రయత్నం చేస్తామంటే ప్రేక్షకుడు అంగీకరించే రోజులు కావివి… పూరీ జగన్నాథ్ కూడా అంతే కదా… ఫోవోయ్ చపాతీ అనేస్తారు… చాలా ఏళ్లుగా అదే కదా జరిగింది… ఇప్పుడు సుకుమార్‌తో చేసిన ఏదో ప్రమోషన్ వీడియోలో ‘‘1000 కోట్లు వసూలు చేస్తుంది లైగర్’’ అంటుంటే జనం నవ్వుకున్నారు… అది చెప్పాల్సింది ప్రేక్షకుడు, దర్శకుడు కాదు…
వెరసి ఏం జరిగింది…? ఈ రకరకాల పైత్యాలతో సినిమా పట్ల నెగెటివిటీని పెంచినా సరే… సినిమా బాగుంటే అన్నీ కొట్టుకుపోయేది… విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా మరింత వెలుగును నింపుకునేవాడు… కానీ అది జరగలేదు… విజయ్‌ను అచ్చంగా నేల మీదకు తీసుకొచ్చింది లైగర్… బాలీవుడ్ మాఫియా మెంబర్ కరణ్ జోహార్‌కు మరో షాక్ ఇచ్చింది… మరో పాన్ ఇండియా సినిమా కాస్తా ఫట్ ఇండియా సినిమా అయిపోయింది… పూర్తి కారణం విజయ్ మాత్రం కాదు, దర్శకుడు పూరీయే…
విజయ్ తనకు చేతనైనంత మ్యాగ్జిమమ్ ఇచ్చాడు… ఫాఫం, ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డాడు… తన ప్రయత్నలోపం ఏమీ లేదు… నిజానికి విజయ్ లేకపోతే అసలు ఈ సినిమాయే లేదు… కానీ అతి, అతి, అతి… ఓవర్, ఓవర్, ఓవర్… రమ్యకృష్ణ ఓవరాక్షనే… యాక్షన్‌కూ ఓవరాక్షన్‌కూ నడుమ తేడా తెలియడం లేదు ఆ సీనియర్ నటికి… జాలేసింది… ప్రతిదీ నీలాంబరి, శివగామి తరహా పాత్రే అనుకుంటే ఎలా ఆంటీ..?! చివరకు అంతటి మైక్ టైసన్‌ను కథలోకి దింపినా సరే, సినిమా నిలబడలేదు… కారణం ఓ సాదాసీదా కథ, కథనం… ఓ చమక్కు లేదు… కొత్తదనం లేదు…
చిత్రం ఏమిటంటే… బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ… ఇవన్నీ సౌత్ భాషల్లో ఒరిజినల్స్… హిందీలో డబ్ వెర్షన్లు… అలా గాకుండా రాధేశ్యాం ఒరిజినల్ హిందీ అన్నట్టుగా తీసి, తెలుగులోకి డబ్ చేసినట్టుగా ఉంది… ఫట్… పేలిపోయింది… లైగర్ కూడా అంతే… విజయ్, రమ్యకృష్ణ, గెటప్ సీను, ఆలీ ఎట్సెట్రా ముగ్గురు నలుగురు తప్ప సంగీతంతో సహా అందరూ హిందీయే… హిందీలో తీసి తెలుగులో డబ్ చేసినట్టుగా ఉండటం సినిమాకు అతి పెద్ద మైనస్…
దిక్కుమాలిన అదే హీరోయిజం, అదే బిల్డప్పు… అలాంటివి ప్రేక్షకులు ఇష్టపడటం లేదురా బాబూ అంటే పూరీ వినిపించుకోలేదు, బహుశా జనం నుంచి వర్తమాన అంశాలపై వినిపించే ఫీడ్‌బ్యాక్ చదివే అలవాటు లేనట్టుంది… ఇక హీరోయిన్ పాత్ర, దానికి అనన్య పాండే ఎంపిక మరో పెద్ద మైనస్… పూరీ పాత సినిమాల్లోని బిట్స్ మళ్లీ చూస్తున్నట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే… కానీ వాటిల్లో మహేశ్‌బాబు, రవితేజ గాకుండా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు, అంతే తేడా… యూఎస్ ప్రీమియర్ షోల ప్రతిస్పందన సారాంశం ఇదే…
ఫ ఫ ఫ అని నత్తి నత్తిగా ఫతో ఏదో బూతు పదం ఉచ్చరించడానికి ప్రయత్నిస్తుంటాడు కదా… ఆ పదం ఫట్… అంతేనా విజయ్..?! ఆ ఉమైర్ సంధూ గాడు ‘‘సినిమా సూపర్, బంపర్’’ అని ఏదో కూసినప్పుడే డౌటొచ్చింది… వీడు మళ్లీ అపశకునం పెట్టేశాడురా బాబో అని… చివరకు అదే జరిగింది…!! సాలా, క్రాస్ బ్రీడ్… లయన్, టైగర్ సంకర సంతానం అంటే ఎట్లా ఉండాలె… రోరింగ్ పంచ్ పడి ఉండాలె… బాలీవుడ్ హీరోల్లో మరో వణుకు పుట్టించి ఉండాలె… అబ్బే, తేడా మన మొహం మీదే కొట్టేసింది భయ్యా…!!
అవునూ, అతి సర్వత్రా వర్జయేత్ అని కదా మనం చెప్పుకుంటున్నది… ఎస్, బింబిసార, సీతారామం, కార్తికేయ జస్ట్, మినిమం ప్రమోషన్ వర్క్… ఒకరకంగా మా సినిమా వస్తుంది అని చెప్పే ఇంట్రడక్షన్, అంతే… ఒద్దిక.., ఎక్కడా అతి లేదు… కానీ బాక్సాఫీసు దగ్గర అవి దుమ్మురేపుతున్నయ్… కటౌట్‌లో నగ్నత కాదు, కంటెంట్‌లో నవ్యత అవసరం… అది తెలియనప్పుడు మైక్ టైసన్ కూడా గెలిపించలేడు… ఇదీ తాజా నిజం..!! (ఇది యూఎస్ ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ఆధారిత కథనం, ఇది ఫార్ములా రివ్యూ కాదు)… చివరిగా :: ఎవడో విదేశీ ఫైటర్ టైసన్ కూ లోకల్ కరీంనగర్ రమ్యకృష్ణకూ క్రాస్ బ్రీడ్ బిడ్డ అనే అంశమే పెద్ద యాంటీ- సెంటిమెంట్… వివ్ రిచర్డ్స్ – నీనా గుప్తా టైపులో…!
Share this Article