రాజకీయ నాయకులు అంటేనే ఇప్పుడు అందరికీ ఓ వెగటు సరుకు కదా… వాళ్ల నడవడిక కూడా అలాగే ఉంటోంది… ప్రజలు చీదరించుకుంటే ఆశ్చర్యం ఏముంది..? కానీ కొందరు ఉంటారు… అసలు ఇలాంటోళ్లు కదా రాజకీయాల్లో ఉండాల్సింది అనిపిస్తారు… చాలా తక్కువ మంది… అందులో ఒకరు మన విదేశాంగ మంత్రి జైశంకర్… నిజానికి తను పొలిటిషియన్ కాదు… ఫారిన్ సర్వీస్‌లో చాలా కీలక పోస్టుల్ని నిర్వహించాడు… చివరకు మోడీ విదేశాంగ శాఖకు తననే పికప్ చేసుకున్నాడు… సరైన ఎంపిక…
తను ప్రపంచాన్ని చూశాడు… బాధల్ని, సంతోషాల్ని అనుభవించాడు… అనేక దేశాల నడుమ సంబంధాల లోతుపాతులు తెలిసినవాడు… సంక్లిష్టమైన భారతదేశ విదేశీ వ్యవహారాల్ని నిభాయించినవాడు… ఎంత మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది..? అందుకే ప్రతి మాట ఆచితూచి వస్తుంది… పొల్లు మాట ఒక్కటీ ఉండదు… హుందాగా, సంస్కారయుతంగా ఉంటుంది తన నడత… ఇప్పుడు హఠాత్తుగా ఈయన గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే..?
బెంగుళూరు వెళ్లాడు… అక్కడ వీవీపురంలో తిండిబీథి… అంటే ఫుడ్ స్ట్రీట్… రకరకాల ఫుడ్ స్టాళ్లు… కృపాల్ అనే వ్లాగర్ తెలుసు కదా… రకరకాల ప్లేసుల్లోకి వెళ్లి, అక్కడి రెస్టారెంట్లు, హోటళ్ల డిషెస్ రుచిచూస్తూ, పరిచయం చేస్తూ, వివరిస్తూ వీడియోలు చేస్తుంటాడు… చాలా పాపులర్ యూట్యూబ్‌లో… అక్కడ ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లిన కృపాల్ కనిపించాడు… ఇక అక్కడ రకరకాల చిన్న చిన్న డిషెస్ మంత్రికి తినిపిస్తూ, వాటి విశేషాలు వినిపిస్తూ పోయాడు… దాదాపు గంటసేపటివరకూ అక్కడే ఉన్నాడు మంత్రి…
Ads
కృపాల్ చెప్పినట్టే ఒక్కొక్కటే టేస్ట్ చేస్తూ, జస్ట్ ఓ ఫుడ్ లవర్ అన్నట్టుగా… షాపుల వద్ద ఆగడం, ఏదో కాస్త టేస్ట్ చేయడం, వాళ్లకు ఓ జాతీయ జెండా ఇవ్వడం… హర్ ఘర్ తిరంగాను ప్రమోట్ చేయడం… కానీ నయాపైసా ఓవరాక్షన్ ఉండదు… అసలు ఓ కేంద్ర మంత్రి అన్నట్టుగా ఉండడు… ఒద్దిక, అణకువ… కొన్ని సంస్కారాలు పదవులతో రావు, నడమంత్రపు సిరితో కూడా రావు… వాళ్లు అక్కడ ఏమేం టేస్ట్ చేశారనే వివరాల జోలికి నేను వెళ్లడం లేదు… బోలెడు దేశాలు తిరిగి, వందల రకాల డిషెస్ టేస్ట్ చేసిన ఘటం అది… ఇంట్లోనే ఓ విదేశీ కేరక్టర్ ఉంటుంది… దిగువన ఓ యూట్యూబ్ లింక్ ఇస్తాను, చూడండి…
ఇంతకీ ఎవరీ జైశంకర్..? మూలాలు ఏమిటి..? ఆయన కుటుంబ నేపథ్యం తెలిస్తే సర్‌ప్రయిజ్ అవుతారు… తనవి తమిళ బ్రాహ్మణ మూలాలు… పుట్టిందీ పెరిగిందీ ఢిల్లీ… కానీ వర్తమానంలో ఓ విశ్వమానవుడు… నిజం…
- జైశంకర్ తండ్రి సుబ్రహ్మణ్యం… ఓ సివిల్ సర్వెంట్, ఓ జర్నలిస్ట్, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు, వ్యాఖ్యాత… ఆయన రాతల ప్రభావం మన విదేశీ వ్యవహారాల మీద బాగా ఉండేది…
- జైశంకర్ సోదరుడు సంజయ్ సుబ్రహ్మణ్యం… ఫేమస్ చరిత్రకారుడు… బోలెడు పుస్తకాలు రాశాడు… (పాపులర్ యూసీఎల్‌ఏ హిస్టారియన్, అమెరికన్ ప్రొఫెసర్ కెరోలిన్ ఫోర్డ్‌ను పెళ్లి చేసుకున్నాడు…
- జైశంకర్ మరో సోదరుడు విజయకుమార్… ఐఏఎస్… కేంద్ర రూరల్ డెవలప్‌మెంట్, మైనింగ్ సెక్రెటరీగా చేశాడు… పలు కీలక పోస్టుల్లో బాధ్యతల్ని నిర్వర్తించాడు… ఇప్పుడు TERI లో ఉన్నాడు…
జైశంకర్ ఢిల్లీ జేఎన్‌యూలో అంతర్జాతీయ సంబంధాలు అంశంపై పీహెచ్‌డీ చేశాడు… 1977లో సివిల్స్ కొట్టాడు… తెలుసు కదా, ఆ సర్వీసులో ఐఏఎస్‌కన్నా ఐఎఫ్ఎస్ ప్రిస్టేజియస్… విదేశాంగశాఖలో చేరిపోయాడు… చైనాలో ఎక్కువకాలం పనిచేసిన భారతీయ రాయబారి తను… అమెరికా, సింగపూర్, చైనా, రష్యా, జపాన్ వంటి కీలక దేశాల్లో కీలకసందర్భాల్లో పనిచేశాడు…
జపాన్‌లో పనిచేస్తున్నప్పుడు తన భార్య శోభ కేన్సర్‌తో మరణించింది… తరువాత అక్కడే పరిచయమైన జపాన్ మహిళ క్యోకోను పెళ్లి చేసుకున్నాడు… అప్పటికే తనకు ధ్రువ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు… తరువాత అర్జున్… ధ్రువ అమెరికన్ స్నేహితురాలు కసాండ్రాను పెళ్లిచేసుకున్నాడు…
పలు రంగాల్లో నిష్ణాతుడైన కొడుకు ప్రస్తుతం రిలయెన్స్ వాళ్ల థింక్ టాంక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్)కు అమెరికా హెడ్‌గా చేస్తున్నాడు… మేధ కూడా అక్కడే, క్రియేటివ్ సైడ్ వర్క్ చేస్తోంది… ప్రొడ్యూసర్… మొత్తం కుటుంబం అంతా బాగా చదువుకుని, ప్రాంతాల హద్దులు దాటి, తమకు ఇష్టమైన రంగాల్లో పనిచేసుకుంటున్నారు…
జైశంకర్ సైలెంట్ వర్కర్… కేంద్రం పద్మశ్రీ ఇచ్చింది తనకు… మోడీ ప్రధాని హోదాలో అమెరికా వెళ్లినప్పుడు పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేశారు కదా… దాన్ని విజయవంతం చేసింది జైశంకరే… తరువాత కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి అయ్యాడు… చాలా ఇంపార్టెంట్ పోస్టింగు అది…
రిటైర్ అయ్యాక కొన్నాళ్లు టాటా సన్స్ గ్రూపు గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ విభాగానికి ఛైర్మన్‌గా చేశాడు… కానీ అప్పటికే మోడీ తన సేవల్ని విదేశాంగ శాఖకు వినియోగించుకోవాలనే భావనతో ఉన్నాడు… 2019లో కేంద్ర విదేశాంగ శాఖకు మంత్రి అయిపోయాడు… మొదట్లో రాయబారిగా, తరువాత విదేశాంగ శాఖ కార్యదర్శిగా, ఇప్పుడు విదేశాంగ మంత్రిగా వెళ్తున్నాడు రష్యాకు, చైనాకు, అమెరికాకు, జపాన్‌కు..!
విదేశీ వ్యవహారాల్లోనే పండిపోయాడు కాబట్టి ఆ మంత్రిగా పనిచేయడం తనకు ఈజీయే కావచ్చు గాక… కానీ ప్రతిరోజూ టఫ్ టాస్కులే… కేబినెట్ సెక్రెటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వంటి కొందరు తప్ప జైశంకర్ విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోరు… ఎస్, రోజురోజుకూ ఇండియా విదేశాంగ విధానం కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నవేళ రెగ్యులర్ పొలిటిషియన్స్ కాదు… ఇలాంటి సిన్సియర్, బ్యాలెన్స్‌డ్, మెచ్యూర్డ్, ఎక్స్‌పీరియెన్స్‌డ్ బ్యూరోక్రాట్సే అవసరం..!!
Share this Article