అనవసరంగా చిరంజీవి బుర్ర బద్దలు కొట్టుకుంటూ… కొడుకు, తాను కలిసి ప్రతిష్ఠాత్మకంగా కొత్త కొత్త స్టెప్పులేస్తూ నటించినా సరే, ఆచార్య అంత ఘోరంగా డిజాస్టర్ కావడానికి కారణాలేమిటబ్బా అని కారణాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనే లేదు… చాలా సింపుల్… తను అంతకుముందు టికెట్ రేట్ల తగ్గింపు కోరుతూ, జగన్ ఎదుట చేతులు జోడించి వేడుకుంటూ, ప్రాధేయపడుతూ, బాబ్బాబు ప్లీజ్ అన్నట్టుగా బతిమిలాడాడట కదా… అదుగో, అందుకే ప్రేక్షకదేవుళ్లు ఆచార్య సినిమాను ఛీఫో అన్నారట…
అంతే, పెద్ద పెద్ద తోపులం అని చెప్పుకునే రివ్యూయర్లు అచార్య అడ్డగోలు ఫ్లాప్‌కు ఏవేవో కారణాలు రాసేశారు… రాస్తూనే ఉన్నారు… కానీ ఇలాంటి కారణం ఉంటుందని ఊహించారా..? లేదు కదా… కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊహించాడు… ఎస్, ఆచార్య డిజాస్టర్ వెనుక చిరంజీవి దేబిరింపు వీడియో కారణమని తేల్చేశాడు… జగన్ మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి, చిరంజీవి అంతటివాడు అలాంటి జగన్ ఎదుట ప్రాధేయపడిన తీరును జనం జీర్ణించుకోలేకపోయారు, అందుకే సినిమా దెబ్బతినిపోయింది, నిజానికి సినిమా మరీ అంత నాసిరకం ఏమీ కాదు… అని పోస్ట్ మార్టం రిపోర్ట్ పబ్లిష్ చేశాడు ఈరోజు… నమ్మడం లేదా..? మీరే చదవండి… ఆయన రాతల నుంచే ఓ పార్ట్ ఇది…
‘‘ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే చిరంజీవి అంతటివాడు జగన్మోహన్ రెడ్డి వద్ద చేతులు జోడించి వేడుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతినడానికి ఈ వ్యతిరేకతా ఒక కారణమైంది. నిజానికి ఆ సినిమా మరీ అంత నాసిరకంగా లేదని అంటారు. కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంటుంది. ఉదాహరణకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన ‘కథానాయకుడు’ చిత్రం విడుదలైంది. ఎన్.టి.రామారావు బయోగ్రఫీ ఆధారంగా నిర్మితమైన ఆ చిత్రం బాగున్నప్పటికీ ప్రజలు ఆదరించలేదు. చిరంజీవి సినిమా ‘ఆచార్య’ దెబ్బతినగా, పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సక్సెస్ కావడం ప్రజాభిప్రాయం సినిమాలపై ప్రతిబింబిస్తుందనడానికి మరో నిదర్శనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన ‘యాత్ర’ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది…’’
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ తన తండ్రి బయోగ్రఫీ ఆధారంగా కథానాయకుడు తీశాడు కదా… ఆ సినిమా బాగున్నప్పటికీ జనం తిరస్కరించడానికి కారణం చంద్రబాబు మీద వ్యతిరేకత అప్పటికే పెరిగిపోవడం అన్నమాట… అలా కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తూ ఉంటుందట కూడా… సేమ్, చంద్రబాబు కారణంగానే వైఎస్ పాదయాత్ర మీద తీసిన యాత్ర అనే మూవీ హిట్ టాక్ తెచ్చుకుందట…
Ads
ఒక సినిమా హిట్, ఫ్లాప్ వెనుక ఇలాంటి కారణాలు కూడా ఉంటాయా..? అని మరీ హాశ్చర్యపడిపోవద్దు… జగన్ మీద వ్యతిరేకత పెరుగుతోంది గనుకే, తనను వ్యతిరేకించే పవన్ కల్యాణ్ సినిమా బీమ్లానాయక్ సక్సెస్ అయ్యిందట… పూరి జగన్నాథ్, దేవరకొండ విజయ్‌ల సినిమా లైగర్ భారీగా దెబ్బ తినడానికి కేసీయార్, జగన్‌ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడమే కారణమని రాధాకృష్ణ లింకు పెడతాడేమో అనుకున్నాను గానీ కనిపించలేదు… హమ్మయ్య… థాంక్ గాడ్…
అనవసరంగా మనం ఇన్నాళ్లూ కథలో దోషాలు, కథనలోపాలు, నాసిరకం సంగీతం, ఆకట్టుకోని పాటలు ఎట్సెట్రా ఎన్నెన్నో కారణాల్ని ఏకరువు పెడుతున్నాం గానీ… ఈ కోణంలో ఒక్కసారీ ఆలోచించలేకపోయాం… హన్నా… ఇప్పుడు రాధాకృష్ణ చెబితేనే… ఈ కారణాల్ని కూడా రివ్యూల్లో విశ్లేషించాలనే సోయి కలుగుతోంది… అసలు నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఆడటం ఏమిటీ అనుకున్నారేమో ఎవరైనా ఇప్పటివరకు… తప్పు, బింబిసార సక్సెస్‌కు కారణం జగన్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, చంద్రబాబు పట్ల పెరుగుతున్న సానుకూలత… అంతేకదా ఆర్కే గారూ…!!
Share this Article