అవమానించారు… ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచీ కత్తెరపెట్టారు… ఉంటే ఉండు, పోతేపోవోయ్ అన్నారు… తీరా సుధీర్ బయటికి వెళ్లిపోయాక లెంపలేసుకుని, రా బాబూ రా ప్లీజ్ అని ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లోకి తీసుకొచ్చారు… ఈటీవీ 27 సంవత్సరాల కార్యక్రమం ‘భలేమంచిరోజు’లో మాత్రమేనట… అంతేతప్ప, సుధీర్ ఏదో అర్జెంటుగా మళ్లీ జబర్దస్త్‌లో, ఢీలో, శ్రీదేవి డ్రామా కంపెనీలో దూరిపోతున్నాడని కాదు..!
అంతెందుకు… వినాయకచవితిన ప్రసారం చేయబోయే ‘మనవూరి దేవుడు’ స్పెషల్‌లో అసలు సుధీర్ కనిపించడమే లేదు… (ప్రోమోల్లో)… ఈటీవీతో తనకు ఏళ్ల అనుబంధం ఉంది కాబట్టి 27 ఇయర్స్ స్పెషల్‌లోకి ఓసారి వచ్చిపొమ్మన్నారు… అంతే… అలా రీఎంట్రీ, సుధీర్ ఈజ్ బ్యాక్ అని ప్రోమోలు దంచారు కదా… తీరా చూస్తే అందులో సుధీర్‌కు పెద్ద సీనేమీ లేదు… అదే ఆది, అదే రాంప్రసాద్, అదే ఇంద్రజ హవా… మరి ఎందుకు సుధీర్ పేరు పదే పదే ప్రచారంలోకి తెస్తున్నట్టు..? అదొక మార్కెటింగ్ మాయ…
నిజానికి ఈటీవీ 27 ఏళ్ల వార్షికోత్సవం అంటే ఈ ప్రోగ్రాంలో ఈటీవీ ఎదుగుదలకు కీలకంగా వ్యవహరించిన కొందరు పెద్దల్ని (వీలయితే రామోజీ, ఇంకా బాగుండేది..) పరిచయం చేస్తే బాగుండేది… అదే అనసూయ, అదే చమ్మక్ చంద్రను పట్టుకొచ్చారు… పైపైన చూస్తే ఈటీవీని వదిలేసి వెళ్లిన వాళ్లంతా మళ్లీ వచ్చేస్తున్నరు అనే కలరింగు అది…
Ads
ఈటీవీ సీరియళ్లు పెద్దగా ఎవరూ చూడరు, ఆ ఆర్టిస్టులతో ఓ షో ప్లాన్ చేశారు, కానీ ఎవరు చూడాలి..? అందుకని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్లను పట్టుకొచ్చి, ఓ షో చేశారు… అంతే… ఒక్క ముక్కలో చెప్పాలంటే… నిన్నటి భలేమంచిరోజు చూస్తుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం చూస్తున్నట్టే అనిపించింది…
షూట్ చేస్తూ వెళ్తే అదేదో లంబా చోడా అయినట్టుంది… బాహుబలిని రెండు భాగాలుగా నరికినట్టు, దీన్ని కూడా నిలువునా నరికి, రెండో పార్ట్ వచ్చే ఆదివారం ప్రసారం చేస్తాం అని ప్రదీప్‌తో చెప్పించారు… ఇదేదో బాగుంది… తక్కువ ఖర్చు, డబుల్ బెనిఫిట్… అసలు సుధీర్‌ను తెచ్చారు సరే, కానీ రష్మితో కలిసి తను ఉంటే కదా ఆ షోకు ఓ చమక్కు… ప్చ్, అది లేకపోయాక ఇంకేముంది..? పండుగ స్పెషల్‌లో రష్మి ఒక్కతే ఉంటుందట, 27 ఏళ్ల వార్షికోత్సవం ప్రోగ్రాంలో మాత్రం సుధీర్ ఒక్కడే ఉంటాడట… మరి అదేం జంట..? అసలు వాళ్లిద్దరూ కలిసి ఓ డాన్స్ బిట్ చేస్తే కదా అసలు మజా… మళ్లీ సుధీర్ ఎక్కడ పాపులర్ అయిపోతాడో అని మళ్లీ గుంజాటన… అందుకే సుధీర్ రీఎంట్రీ వాల్యూ లేకుండా పంక్చర్ చేశారు…
ఏమాటకామాట… విజయ్ ఏసుదాసు, ఎస్పీ చరణ్ కలిసి కాసేపు తెలుగు సినిమా పాటలు పాడి, బాలును కూడా స్మరించుకున్నారు… ఆ బిట్ బాగుంది… ఈటీవీ న్యూస్ చదివే నలుగురు రియల్ న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టి, నాలుగు కామెడీ బిట్లు చదివిపించారు, వాళ్ల తప్పేమీ లేదు కానీ చివరకు ఈటీవీ న్యూస్ కూడా కామెడీ అయిపోవడం ఎందుకో సరైందిగా అనిపించలేదు… అవునులే, ఒక వినోదచానెల్‌కు న్యూస్ ప్రధానఊతంగా ఉండటమే ఓ కామెడీ కదా… పర్లేదు…
అలాగే నవరసాల నాయికల పేరిట ఓ ఎపిసోడ్ చేశారు, కాన్సెప్టు బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్… (నిన్న ఆదివారం కదా, మధ్యాహ్నం ఒరిజినల్ శ్రీదేవి డ్రామా కంపెనీ నడిచింది, సాయంత్రం ఇదేతరహా డ్రామా కంపెనీ నడిచింది… నాలుగైదు గంటలపాటు అవే మొహాలు, అవే పిచ్చి పంచులు…)
మిగతా షో విషయానికివస్తే పండుగ పూట వేయబోయే ‘మనవూరి దేవుడు’ ప్రోగ్రాం కూడా సేమ్, అదే ఖుష్బూ, అదే ఇంద్రజ, అదే రష్మి, అదే ప్రగతి… సేమ్, శ్రీదేవి డ్రామా కంపెనీయే… పండుగ డబ్బంటే ఎవరికి చేదు..? అందుకే జీవాడు ‘మన వూరి రంగస్థలం’ పేరిట, మాటీవీ వాడు ‘మాతో పండగే పండగ’ గణేష్ చతుర్థి స్పెషల్స్ చేశాయి, ప్రోమోలు కుమ్మేస్తున్నాయి… ఆ విశేషాల్ని మరో స్టోరీలో చెప్పుకుందాం…
Share this Article