సూపర్ స్టార్ మహేష్ బాబు, బిడ్డ సితారతో పాటు ఓ టీవీ షోకు రావడం… అదీ ఓ తెలుగు చానెల్‌లో వచ్చే డాన్స్ షోకు…! సితార స్టెప్పులేయడం, మహేష్ బాబు మురిసిపోవడం.., ఓ ఇద్దరు డాన్సర్ల డాన్స్ చేసి, మీకు నా సినిమాల్లో చాన్స్ ఇస్తానని మహేష్ ఔదార్యం చూపించడం, వాళ్లు పరుగెత్తుకెళ్లి కాళ్ల మీద పడిపోవడం, ఈయన కౌగిలించుకోవడం… ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది…
మామూలుగా మహేష్ బాబు మాటల్లో గానీ, ప్రెస్ మీట్లలో గానీ పెద్దగా హిపోక్రసీ ఉండదు, కృతిమత్వం కనిపించదు… అసలు తను పెద్దగా ఈ మీట్లు, ఈ టీవీ షోలు, గెస్టు అప్పియరెన్సులు మన్నూమశానం జోలికి పోనేపోడు… ఏ వివాదంలోకి కాలు పెట్టడు… వేలు పెట్టడు… ఖాళీ దొరికితే చాలు, ఫ్యామిలీతో ఎంచక్కా ఏ యూరపో వెళ్లిపోతాడు…
అలాంటిది జీతెలుగులో వచ్చే డాన్స్ ఇండియా డాన్స్ షోకు తను రావడం, అక్కడి ఎపిసోడ్ అంతా కృత్రిమంగా అనిపించింది… ఎందుకు అంటే..? తను డబ్బు దగ్గర స్ట్రిక్ట్… నో కాంప్రమైజ్… తను కోట్లు ఖర్చు పెట్టి గుండె ఆపరేషన్లు చేయిస్తాడు, ఆ ఔదార్యం గ్రేట్… కానీ డబ్బు విషయంలో కొన్ని కోణాల్లో తను ఎవరి విమర్శలనూ పట్టించుకోడు…
Ads
ఉదాహరణకు… అదే గుట్కా యాడ్… అదేలెండి, అసలు గుట్కా బ్రాండ్ పేరు స్ఫురించేలా చేసే పాన్ మసాలా యాడ్… వాటినే సరోగసీ యాడ్స్ అంటారు… సొసైటీ పట్ల బాధ్యత చూపించాల్సిన ఓ మాస్ హీరోగా అది తను చేయకూడదు… కానీ చేశాడు… ఒకవైపు అమితాబ్ లెంపలేసుకుని, ఆ డబ్బు కూడా వాపస్ ఇచ్చేశాడు, అక్షయ్ కుమార్ ఛిఛీ, ఇకపై ఆ డబ్బు జోలికి పోను అని ప్రామిస్ చేశాడు… కానీ మహేష్ బాబు అవేమీ పట్టించుకోలేదు… తనకు డబ్బొచ్చిందా లేదా..? అంతే…
సేమ్, కూల్ డ్రింక్స్ యాడ్స్… మానవ ఆరోగ్యానికి అవి ప్రమాదహేతువులు… అనేక పరిశోధనలు వెల్లడించాయి… మహేష్ బాబు వంటి హీరో ప్రమోట్ చేస్తున్నాడు అంటే వాటి పట్ల పిల్లలు, యూత్ అట్రాక్ట్ అవుతారు, అడిక్ట్ అవుతారు… ఆ విమర్శల్ని కూడా మహేష్ పట్టించుకోలేదు… డబ్బు వచ్చిందా, యాడ్ చేశామా… అంతే…
అలాంటిది ఓ టీవీలో వచ్చే ఓ డాన్స్‌షోకు వెళ్లాడా..? తీరా ఆరా తీస్తే తెలిసింది ఇదీ డబ్బు యవ్వారమే అని… సదరు చానెల్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకుంటోందని… 9 కోట్లు చెల్లిస్తోందని… గతంలో 5 కోట్లేనట… ఇప్పుడు పెంచేశాడట… బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇలా ఏదేని టీవీ షోలోకి గెస్టుగా అప్పియరెన్స్ ఇవ్వడమా..? ఫాఫం, ఆ చానెల్… దానికి ఈ ఒప్పందంతో వచ్చే ఫాయిదా ఏమిటి..?
అసలే డాన్స్, మ్యూజిక్, కామెడీ తదితర రియాలిటీ షోల విషయంలో చానెల్స్ బలంగా పోటీపడుతున్నయ్… కానీ టీఆర్పీలనే కల్లోలితం చేయగల కెపాసిటీ ఉన్న స్టార్‌మాటీవీ బిగ్‌బాస్ అస్త్రాన్ని తీస్తోంది… అది నాన్-ఫిక్షన్ కేటగిరీలో మాటీవీని కాస్త పైన నిలబెడుతుంది… మరీ నాగార్జున, కంటెస్టెంట్లు కంపు చేయకుండా ఉంటే…! ఈ స్థితిలో ప్రతి రియాలిటీ షో విషయంలో ఫ్లాప్స్ తప్ప ఇంకేమీ లేని జీతెలుగు ఈ బ్రాండ్ అంబాసిడర్ ఖర్చుతో సాధించేది ఏముంటుంది..? ఏమో మరి… వాళ్లు ఇస్తున్నారు, ఆయన తీసుకుంటున్నాడు… చల్నేదో బాలకిషన్… !!
Share this Article