విక్రమ్… అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్… క్రిస్టియన్ ఫాదర్, హిందూ మదర్… పుట్టిన ఊరు రామనాథపురం జిల్లా, పరమకుడి… ఆ ఊరు జాతీయ అవార్డు గ్రహీతల ఊరు… కమల్‌హాసన్, చారుహాసన్, సుహాసిని పుట్టిన ఊరు… వాళ్లే కాదు, విక్రమ్ కూడా జాతీయ అవార్డు గ్రహీతే… నటన అంటే పిచ్చి… ప్రయోగాలు అంటే పిచ్చి… సేమ్, కమల్‌హాసన్, రకరకాల వేషాల కోసం దేహాన్ని ఎన్నిరకాలుగానైనా హింసించుకోగలరు…
ఆ కమల్‌హాసన్ దశావతారం చూశాం కదా… ఏకంగా పది పాత్రలు ఒకే సినిమాలో… అవీ భిన్న దేశాలు, భిన్న లింగాలు, భిన్న వయస్సులు, భిన్న వృత్తులు… మరుగుజ్జు పాత్ర నుంచి ఆడపాత్రలు, ముసలిపాత్రలు ఏవైతేనేం, భిన్నంగా కనిపించడానికి తహతహలాడతాడు… ఆ ఊరి నీరే కదా మరి… విక్రమ్ కూడా అంతే… తాజాగా తను నటించిన కోబ్రాలో ఏడు గెటప్స్ కనిపిస్తయ్… అంతకుముందు ఐ అనే సినిమాలో అసలు హీరో పాత్రలో విక్రమ్ కనిపించడు… అదేదో గ్రహాంతరజీవిలా చూసేవాళ్లకే జలదరించే గెటప్…
ఐతే భిన్నమైన గెటప్స్, ఎక్కువ గెటప్స్, వాటికోసం పడే శ్రమ సినిమాను సక్సెస్ చేస్తాయా..? ప్రేక్షకుడిని అలరిస్తాయా..? లేదు… కేరక్టరైజేషన్ ముఖ్యం… సినిమా కథాకథనాలు ముఖ్యం… వాటి ప్రజెంటేషన్ ముఖ్యం… కేవలం అవేకాదు, సంగీతం, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, ఎడిటింగ్ ఎట్సెట్రా ఎన్నో కలిస్తేనే, కుదిరితేనే హిట్… సినిమాకు పెట్టే ఖర్చు, హీరో పడే శ్రమ మాత్రమే సినిమాను ఎప్పుడూ సక్సెస్ చేయదు… ఇదే విక్రమ్ అంతటి భారీ సక్సెస్‌ఫుల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఐ సినిమా చేశాడు… అట్టర్ ఫ్లాప్… ఆ పాత్ర కోసం విక్రమ్ పడినంత శ్రమ, చూపించిన మెరిట్ బహుశా భారతీయ చిత్రాలకు సంబంధించి వేరే ఏ నటుడికీ చేతకాలేదు… ఐతేనేం, తన్నేసింది…
Ads
ఐనాసరే, ఈ గెటప్స్ పిచ్చిపోదు… మళ్లీ అదే యావ… ఎందుకో గానీ, విక్రమ్ పడే శ్రమకూ, తన సక్సెస్ రేటుకూ నడుమ చాలా దూరం ఉండిపోతోంది… వోకే, తన డిమాండ్ ఏమీ తగ్గడం లేదు… పైగా కొడుకు కూడా అందివచ్చాడు… అది వేరే సంగతి… అప్పుడెప్పుడో అపరిచితుడు సినిమా చూశాం… విక్రమ్ నటనకు ఫిదా అయిపోయాం… రెండు ఫుల్ కంట్రాస్టు పాత్రలు అప్పటికప్పుడు చూపించే వేరియేషన్స్ నభూతో అనిపించింది… సూపర్ హిట్… 17 ఏళ్లు గడిచిపోయాయి ఆ సినిమా వచ్చి…
మళ్లీ ఏది ఒక్క హిట్..? ఏవేవో తీస్తున్నాడు… చివరకు మణిరత్నం తీసిన రావణ్ కూడా ఫ్లాప్… ఐశ్వర్య అందం కూడా కాపాడలేకపోయింది సినిమాను… పాపులర్ తమిళ హీరోలకు సమానమైన పాపులారిటీ ఉంది విక్రమ్‌కు తెలుగులో కూడా… తనను సరైన రీతిలో ప్రొజెక్ట్ చేసే సినిమా మళ్లీ రాలేదు… తనలో అద్భుతమైన నటుడున్నాడు… కానీ ఈ గెటప్స్‌కే వేస్ట్ అయిపోతున్నాడు… ఇప్పుడు కోబ్రా కూడా అంతే… అన్ని గెటప్స్ దేనికో, ఆ లెక్కేమిటో అర్థం కాదు… (దశావతారంలో పది గెటప్స్ కావు, అవి వేర్వేరు పాత్రలు, వేర్వేరుగా కేరక్టరైజేషన్…, భాష, బాడీ లాంగ్వేజీ వేర్వేరు… కానీ ఇందులో నిజానికి పాత్రలు రెండే… మిగతావన్నీ కేవలం గెటప్స్… వీటికి అంత కష్టపడటం దేనికో అస్సలు సమజ్ కాదు…)
ఒరిజినల్ పాత్ర లెక్కల మాస్టర్… కానీ గ్లోబల్ హంతకుడు… హత్యల వెనుక కూడా లెక్కల పరిజ్ఙానం… ఇంకేవో మానసికమైన పైత్యాలు… అనగా చిత్తభ్రమలు… వెరసి గందరగోళం… తను ఏం చెప్పాలని అనుకున్నాడో ప్రేక్షకుడికి అర్థం కాదు, జుత్తు పీక్కుంటాడు… సంగీతం రెహమాన్ అయితేనేం, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో ఉంటేనేం, శ్రీనిధి షెట్టి అందచందాలు ప్లజెంటుగా కనిపిస్తేనేం… అసలు కథేమిటో బుర్రకెక్కితే కదా… దర్శకుడు జ్ఞానముత్తు ప్రేక్షకుడిని జ్ఞానానికి పెద్ద పరీక్ష పెట్టేశాడు… వెరసి విక్రమ్ మరోసారి తుస్…
బాగున్నవి… విక్రమ్ టెరిఫిక్ యాక్షన్… Bgm… ఇంటర్వల్ బ్యాంగ్.. అధీరా పాట… ఒకటీ రెండు ట్విస్టులు… మరి మైనసులు ఏమిటంటే… అతి యాక్షన్ ఎపిసోడ్స్… బోరింగ్ లవ్ ట్రాక్… సెకండాఫ్ సీన్స్… 3 గంటల రన్ టైం… పేలవమైన స్క్రీన్ ప్లే … ఎడిటింగ్ వైఫల్యం… పాటల ప్లేస్ మెంట్… పాటల ఆరవ వాసన… (US ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ రివ్యూ…) హత్యలకు లెక్కలు కాదోయ్ దర్శకా… ప్రేక్షకుడిని మెప్పించే కథాకథనాల లెక్కలు… ముందుగా అర్థం చేసుకో…!!
Share this Article