థియేటర్లకు వెళ్లే రోజులు కావివి… అవి దోపిడీ కేంద్రాలు… బయట వినోదపార్కులు, రిసార్టుల ఖర్చు జేబుకు చిల్లు పెట్టేదే… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం టీవీ… అందులోనూ న్యూస్ చానెళ్లు చూడలేం, ప్రత్యేకించి వాటిల్లో చెత్త డిబేట్లు చూస్తే ఎర్రగడ్డే దిక్కు… అసలు ఆ ప్రజెంటర్లే పెద్ద వైరసులు… సీరియళ్లకన్నా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నయం… కాస్తోకూస్తో నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ షోలే కాస్త చూడబుల్…
వాటిని సైతం సినిమా ప్రమోషన్ల వేదికలుగా మార్చాక అవీ చూడబుద్దేయడం లేదు… బూతులున్నా సరే, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీని భరిద్దాం అనుకుంటే, వాటిల్లోనూ ఈమధ్య కొత్త పైత్యం మొదలైంది… ఈరోజు ఈటీవీలో పండుగ స్పెషల్ ఒకటి ప్రసారం చేశారు… అసలు పండుగపూట కాస్త చూడబుల్ షో చేయొచ్చు కదా, ఆ సోయే లేదు వాళ్లకు… ప్రత్యేకించి వర్ష, ఇమ్ము గురించి చెప్పుకోవాలి…
ఎందుకోగానీ ఈటీవీలో పదే పదే ఈ జంటను ప్రేక్షకులకు నిర్బంధంగా రుద్దుతున్నారు… అసలు ఆ జంటే సూటబుల్, చూడబుల్ అనిపించదు… పాపం శమించుగాక… వాళ్లను సుధీర్, రష్మి స్థాయిలో జనం నెత్తి మీదకెక్కిస్తున్నారు… ఈ పైత్యం చివరకు ఎక్కడిదాకా వెళ్లిందంటే… వర్షతో స్టంట్లు చేయించారు… గతంలో సుధీర్ చేసేవాడు కదా, బైకు మీద వెళ్లి అద్దాల్ని పగులగొట్టడం ఎట్సెట్రా… ఖాళీ కుండల్ని పగులగొట్టే ప్రయాస సరేసరి… వర్ష చేతులు మీదుగా కార్ల టైర్లను నడిపించడం అవసరమా..?
Ads
పైగా ఈ స్టంట్లకు పక్కనే కోచ్ అన్నట్టుగా హైపర్ ఆది… కాలిపోయిన ట్యూబ్‌లైట్లతో కొట్టుకోవడం… నిజానికి సుధీర్, రష్మి జంట అంటే… వాళ్లిద్దరి కామెడీ టైమింగ్ వేరు, వాళ్ల డాన్సులో ఓ గ్రేస్ కనిపిస్తుంది… సరిగ్గా అలాగే వీళ్లిద్దరినీ తీర్చిదిద్దాలనీ, ప్రేక్షకులపై రుద్దాలనీ పిచ్చి ప్రయత్నం ఎందుకో అర్థం కాదు… ఇమ్ముకు గానీ వర్షకు గానీ డాన్స్ రాదు… సుధీర్ వెళ్లిపోతే వెళ్లిపోయాడు, అర్జెంటుగా ఇంకో సుధీర్‌ను తయారు చేయాలా..? సుధీర్ మ్యాజిక్ బిట్స్ చేయగలడు… రాబోయే ఎపిసోడ్లలో ఇమ్ముతో అవీ చేయిస్తారా ఏమిటి కొంపదీసి..?
ఎవరో ఇంటర్వ్యూల జర్నలిస్టు పేరిట చిన్న బిట్… సోది… ఎవరో ప్రేమవంచిత పేరిట రష్మి సాంగ్… అదో తలనొప్పి… ఇవి గాకుండా ఎప్పటిలాగే ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది కలిసి పంచులు అనబడే డవిలాగ్స్… ప్రేక్షకులను మరీ అంతగా మీదపడి గుద్దాల్సిన అవసరం ఉందా..? గతంలో రోజా కాస్త స్థూలకాయంతో కూడా డాన్సులు, స్టెప్పులు వేసేది… చూడటానికి ఇబ్బందిగా ఉండేది… కానీ ఆమెకు చెప్పేవాళ్లు ఎవరు..? సేమ్, ఇప్పుడు ఇంద్రజ తయారైంది…
రెయిన్ డాన్స్ చేసింది… (అది రెయిన్ కూడా కాదు, ఏం ప్రొడక్షన్ టీంరా బాబూ… అయిదారు ధారల నీళ్లు, అంతే… జల్లు కాదు)… ఇంద్రజ ఏదో పాడుతూ తెలుగు సినిమా మార్క్ స్టెప్పులు వేసింది… తనంతట తనే మురిసిపోయింది… 22 ఏళ్లయింది, రెయిన్ డాన్స్ చేయక, భలే కొత్తగా ఉంది అంటూ సంబరపడిపోయింది… ప్రేక్షకుడికి మరీ అంత ఆనందం ఏమీ లేదమ్మా…!! ఏమాటకామాట, ఈమధ్య తన డాన్స్ రీల్స్ చేస్తుంటుంది కదా ప్రగతి ఆంటీ… ఆమెకూ ఓ సాంగ్ పెట్టారు, అదీ ఇంద్రజ చేసినట్టే ఉంది… ఈ ఎపిసోడ్లకు తోడు బురదలో దొర్లిన దురద ఎపిసోడ్ మరీ దరిద్రం…
ఆఫ్టరాల్ ఒక షోకు ఇంత విశ్లేషణ అవసరమా అంటే… అవసరమేనేమో అనిపిస్తుంది… చౌకగా, అందుబాటులో ఉన్నదే ఈ కాస్త వినోద సౌకర్యం… దాన్నీ ఇలా భ్రష్టుపట్టిస్తే చెప్పుకోవద్దా..? ఆ యాడ్స్ డబ్బు కూడా మన జేబుల్లోనిదే… పండుగపూట స్టార్ మాటీవీ వాడు కూడా ఓ షో చేశాడు… దాని గురించి చెప్పుకోవడం మరీ వేస్టున్నర… ‘మాతో పండగే పండగ’ దాని పేరు… ఆ టీవీ సీరియళ్ల నటీనటులను పట్టుకొచ్చి, కిట్టీ పార్టీలాగా చిన్న చిన్న పోటీలే ప్రత్యేక షో… ఇలాంటివి ఎన్ని వందలసార్లు చేశారు..? ఇదుగో, టీవీలు కూడా ఇలా తయారయ్యాయి కాబట్టే… ఓటీటీలు ఓపెన్ చేస్తున్నారు ప్రేక్షకులు… ఓటీటీలు క్లిక్ అవుతున్నాయీ అంటే ఈ వికారాలు కూడా కారణమే…!!
Share this Article