2001 సంవత్సరం… కృష్ణవంశీ అప్పట్లో ఫుల్లు పాపులర్… మహేష్ బాబుతో సినిమా… మురారి… పాటలన్నీ అద్భుతంగా వచ్చినయ్… కామెడీ భలే కుదిరింది… బావామరదళ్ల సరసం కూడా చక్కగా గిలిగింతలు పెట్టేలా అమిరింది… కానీ ఏదో ఓ మూఢ నమ్మకం చుట్టూ సినిమా కథ… ఉంటే ఉండనివ్వండి, మన ప్రేక్షకులు ఏదైనా భరిస్తారు… కానీ సినిమా నిడివి… మూడు గంటలు… ఓ రెండు నిమిషాలు ఎక్కువే…
అనేకచోట్ల ప్రేక్షకులకు నచ్చలేదు… కాస్త కట్ చేద్దామయ్యా అంటే దర్శకుడు ఒప్పుకోడు… అవును మరి, ప్రతి దర్శకుడినీ తను ఇష్టపడి తీయించిన ప్రతి బిట్టూ అపురూపమే… దాన్ని కట్ చేయడమంటే సొంత కన్నపేగును ఎవరో కత్తిరించినట్టు ఫీలవుతారు… పలుచోట్ల థియేటర్ల వాళ్లే ఎవరికి తోచినట్టు వాళ్లు పావుగంట వరకూ సినిమాను కట్ చేసినట్టు గుర్తుంది… దర్శకుడు లబోదిబోమన్నా సరే వినలేదు… మరి సినిమా ఆడాలి కదా…
ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… కోబ్రా సినిమాను 20 నిమిషాల మేరకు నిర్మాతలే కత్తిరించి పారేశారు… ఎందుకు..? జనం బూతులు తిట్టారు కాబట్టి… ఒరేయ్, అసలే ఆ లెక్కలు, మానసిక భ్రమల పైత్యంతో దర్శకుడు చంపి పాతరేశాడు, పైగా ఆ దిక్కుమాలిన ఫ్లాష్‌బ్యాక్ ఒకటి… సినిమా డిజాస్టర్‌కు అదే కారణమంటూ చీవాట్లు పెట్టారు… కళ్లు తెరుచుకున్న నిర్మాతలు చివరకు అర్జెంటుగా ఎడిటర్‌ను పిలిచి ఎంతో కొంత నరికి పారెయ్ అని ఆర్డరేశారు…
Ads
జర్నలిస్టులు, ప్రేక్షకులు, ఎగ్జిబిటర్లు, ఫ్యాన్స్, వెల్‌విషర్స్ సూచన మేరకు ఇలా కత్తిరించామనీ, ఇక నిడివి తక్కువ సినిమాను నిరభ్యంతరంగా చూడండి అని ప్రచారం కూడా చేసుకున్నారు… ఇది సరే, మరి ఈ సోయి ముందు ఎక్కడ పోయింది..? అసలు ఎడిటర్ అనేవాడు సినిమాకు పనిచేశాడా..? ఎడిటింగ్ అనేది సినిమా నిర్మాణంలో ఎంత కీలకమో ఇప్పుడు అర్థమైందా..? కోబ్రా కసుక్కున కాటేస్తే తప్ప తెలివి రాలేదా..?
ఇది ఉండాల్సిందే, ఇదీ ఉండాల్సిందే, ఇదైతే తప్పక ఉండాల్సిందే అని దర్శకుడు ప్రతి బిట్టూ, ప్రతి సీనూ అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాడు… సీన్ల నిడివిని కూడా పట్టించుకోడు… తన క్రియేటివిటీ మీద తనకు ప్రేమ… కానీ రన్ టైమ్ చూసుకోవాలి కదా… సరైన ఎడిటింగ్ లేకపోతే సినిమా బోర్ బోరర్ బోరెస్ట్ అయిపోతుంది కదా… అయితే ఇక్కడ రన్ టైమ్ మీద పెద్దగా ప్రేక్షకుల నుంచి విమర్శలు ఏమీ లేవు… రన్ టైమ్ ఎక్కువైనా సరే సినిమాలను చూస్తున్నారు ప్రేక్షకులు…
సీతారామం సినిమా కూడా రెండు గంటల 42 నిమిషాలు… ఐనా హిట్ చేశారు కదా ప్రేక్షకులు… పైగా చాలామంది ప్రేక్షకులు అప్పుడే అయిపోయిందా అని నిట్టూర్చారు కూడా… అంతెందుకు..? మంచి వెబ్ సీరీస్ దొరికితే గంటల తరబడీ ఆపకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు… ఎటొచ్చీ సినిమాలో జిగి, బిగి అవసరం… కోబ్రాలో లోపించింది అదే… ఏదో 20 నిమిషాలు నరికేశాం, ప్రాబ్లమ్ క్లియర్ అనేస్తే సరిపోయేట్టు లేదు… అసలు సినిమా కథే పెద్ద గందరగోళం… అర్థం లేకుండా పలు గెటప్పుల మీద ధ్యాస… లవ్ ట్రాక్ నీరసం… సంగీతం నాసిరకం… మరి వాటినేం చేస్తారు సర్..?!
Share this Article