ఒక కథ చెబుతాను… ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఓ మహిళ కథ అది… తమ్ముడిని వేలుపట్టుకుని నడిపిస్తూ, ఓ సామ్రాజ్యాధినేతను చేసిన ఓ ఆడ చాణుక్యుడి చరిత్ర అది… కత్తి చేత్తో పట్టకుండా, ఇతర రాజులందరినీ వణికించిన తెలివి ఆమెది… అద్భుతమైన అందగత్తె అయినా సరే, సొంత రాజ్యరక్షణకు బ్రహ్మచారిణిగా మిగిలిపోయిన త్యాగశీలి ఆమె… చెబుతూ పోతే, ఆమెకు దీటైన పాత్రలు భారతీయ రాజగాథల్లో అతి తక్కువ… ఆమె పేరు కుందవి…
పొన్నియిన్ సెల్వన్ సినిమా హైప్ పెరిగే కొద్దీ… అసలు ఆ కథేమిటి అనే ఆసక్తి పెరుగుతుంది… కానీ చోళ మహాసామ్రాజ్య స్థాపనకు సంబంధించిన ఆ కథంతా మనకు అరగదు… అసలు చదవడమే చాలా కష్టం… మనం రుద్రమదేవి కథ చదివాం… సినిమా చూశాం… ఆమె కేరక్టరైజేషన్ చుట్టూ కాకతీయ చరిత్ర తిరుగుతుంది… ఝాన్సీరాణి (మణికర్ణిక సినిమా) కూడా అంతే… ఆమె చుట్టూరా కథ తిప్పుతూ, అప్పటి బ్రిటిష్ రాజ్యపు పోకడల్ని చూపిస్తుంది దర్శకురాలు…
భారతం, రామాయణం, భాగవతమే కాదు… పెద్ద పెద్ద ఉద్గ్రంథాల్ని పిండి, పిండి, సారం తీసి, కేవలం ఒక్క సినిమా నిడివికి కుదించడం చాలా కష్టం… అందుకే ఒక ప్రధాన పాత్రను తీసుకుని, ఆ కోణంలోనే కథను తిప్పడం ఒక పద్ధతి… ఆమధ్య మలయాళ దర్శకుడు శ్రీకుమార్ మేనన్ నేతృత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు… బడ్జెట్ 1000 కోట్లు, సరే, వర్కవుట్ కాలేదు గానీ… అది పూర్తిగా భీముడి కోణం నుంచి రాయబడిన భారతం… రండమూజ్తం అనే పుస్తకం ఆధారంగా కథ- స్క్రీన్‌ప్లే రాసుకున్నారు…
Ads
ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… 2000 పేజీల పుస్తకాన్ని, చరిత్రను కుదించీ కుదించీ మణిరత్నం రెండు భాాగాల సినిమాకు సరిపడా సంక్షిప్తీకరించుకున్నాడు… నిడివి భయంతో ఎంత ప్రధానమైన కంటెంటుకు కత్తెరపడిందో చెప్పలేం… అయితే తను తీస్తున్న సినిమాలో కుందవి పాత్ర ఎంత..? నిజానికి ఆమె కోణంలో గనుక ఈ సినిమా కథ సాగితే, మణిరత్నం ప్రయాస, స్వప్నం మరింతగా తెరపై పండేదేమో…
కుందవి కథకు వద్దాం… ఆమె చోళ రాజ్య యువరాణి… అందరూ చోళరాజు రాజరాజచోళుడి ఘనత గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ, చిన్నతనం నుంచీ తన వెన్నంటి ఉండి, తమ్ముడిని తీర్చిదిద్దిన అక్క కుందవి… తమ్ముడికి రాజ్యపాలన, రాజ్యరక్షణకు సంబంధించిన అన్ని మర్మాలూ బోధించింది ఆమే… రాజ్యం చిక్కు పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని, యంత్రాంగాన్ని- మంత్రాంగాన్ని నడిపింది ఆమే… తంజావూరులో కావేరీ నదీ తీరాన అత్యంత పెద్ద శైవ ఆలయాన్ని కట్టించింది ఆమే… తన సోదరి కుందవి అంటే రాజ రాజ చోళునికి కూడా మహా ప్రేమ… అందుకే తన బిడ్డకు ఆమె పేరే పెట్టుకున్నాడు…
రాచరికం అనగానే అంతఃపుర స్త్రీలు పరదాల చాటున ఉండాలి, జనజీవితంలోకి రారు, విలాసజీవనాలు గడుపుతారు అంటుంటారు కదా… ఈమె పూర్తి విరుద్ధం… చుట్టుపక్కల రాజ్యాలతో సంధి ప్రయత్నాలు, సయోధ్య ఒప్పందాలు, యుద్ధ నిర్ణయాలు… అన్నీ ఆమే… ఇతర రాచకన్యల్లాగే ఆలోచించి, ఏ రాజ్యానికో మహారాణి అయిపోయి ఉండొచ్చు… కానీ ఆమె అలా చేయలేదు… తాతలు, తండ్రులు స్థాపించిన రాజ్యాన్ని కాపాడటం ఆమె లక్ష్యం…
అందచందాలకు కొదవు లేదు… అన్నింటినీ మించి ఆమె బుర్ర పాదరసం… ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, తమ్ముడిని ముందు పెట్టి, కీలక నిర్ణయాలు తనే తీసుకుని, ఇరుగుపొరుగు రాజ్యాలను, సామంత రాజులను అదుపులో పెట్టేది… రాజకీయ చదరంగమే కాదు… కుందవి బహుముఖ ప్రజ్ఞావంతురాలు… సంగీతం, సాహిత్యం ఆమెకు ఇష్టం… స్వయంగా వైణికురాలు… ఒకవైపు పాండ్య, లంక, చాళుక్య, చేర రాజ్యాల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకుంటూనే, విస్తరించుకుంటూనే మరోవైపు తన వ్యక్తిగత అభిరుచుల్లో రాజీపడేది కాదు…
శైవ నయనార్లు శివుడిని కీర్తించిన సాహిత్యం మొత్తాన్ని సేకరించి, ఒక్కచోట పొందుపరిచింది ఆమే… రాజ్యంలో శాంతి ఉండాలంటే సర్వధర్మ సమభావన అవసరమని గుర్తించింది… అందుకే జైన, శైవ, వైష్ణవ ఆలయాలకు సమాన ప్రతిపత్తి ఇచ్చేది… నిధులను అందించేది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె తెర వెనుక మహా సామ్రాజ్ఙి… ఆ కుందవి పాత్రకు త్రిష సరిపోతుందా..? ఐశ్వర్యారాయ్ అంటే మణిరత్నానికి మహా ఇష్టం… ఆమె పోషిస్తున్న మందాకినీదేవి పాత్రను ఎక్కువ చేసి చూపించడానికి కుందవి పాత్రకు కత్తెర్లు వేస్తాడా..? ఇవీ తమిళనాట చాలామంది సందేహాలు… అవునూ… మళ్లీ అదే డౌట్… త్రిష ఆ పాత్రకు సరైన ఎంపికేనా..?!
Share this Article