ఇప్పటితరానికి తెలియకపోవచ్చుగాక… విఠలాచార్య సినిమాలు అంటేనే తెలుగు సినిమా చరిత్రలో ఓ అధ్యాయం… జానపద, ఫాంటసీ కథల్ని చెప్పడంలో మొనగాడు… తేడా వస్తే హీరో పాత్రను హఠాత్తుగా మేకలాగో, కుక్కలాగో మార్చేసి, కథంతా దాంతోనే నడిపించేసి, చివరలో మళ్లీ హీరో పాత్రను ప్రత్యక్షం చేసి, శుభం కార్డు వేస్తాడు… ఐనాసరే, జనం పిచ్చిపిచ్చిగా చూశారు ఆ సినిమాల్ని…
తన సినిమాలే కాదు, మనవాళ్లు గతంలో తీసిన పౌరాణిక సినిమాల్లోనూ భీకరాకృతిలో రాక్షసపాత్రల్ని, పిశాచగణాల్ని, వింతజీవుల్ని కూడా చూపించేవాళ్లు… అప్పట్లోనే సినిమా అంటే రీళ్లు, ఫిలిమ్… ఇప్పటిలాగా డిజిటల్ ఫామ్‌లో ఉంటే, గ్రాఫిక్స్‌తో కబడ్డీ ఆడుకునే టెక్నాలజీ లేదు అప్పట్లో… ఐనాసరే, ఆ సినిమాలు జనాదరణ పొందాయి… ఎందుకు..? (1978 నాటి జగన్మోహిని సినిమాలో ఓ దెయ్యం తన కాళ్లనే కట్టెలుగా చేసి, మంట పెట్టి వంట చేస్తున్న సీన్ గుర్తుందా..? గ్రాఫిక్కూ లేదు, పెద్ద టెక్నిక్కూ లేదు, కానీ అదరగొట్టేసింది ఆ సీన్… అలాంటివి విఠలాచార్య బోలెడు చూపించాడు…)
సినిమాకు ప్రాణం కథ, కథనం… ఒక కథను కొత్తగా ఎలా ఆసక్తికరంగా చెప్పావు..? లేదా కొత్త కథను హత్తుకునేలా ఎలా చెప్పావు..? ఈ రెండే ప్రధానం… మంచి పాటలు, పంచ్ డైలాగులు, అచ్చెరువొందే గ్రాఫిక్స్, అదరగొట్టే బీజీఎం, అందమైన కథానాయికలు, ఐటమ్ సాంగ్స్ సినిమాను నిలబెట్టవు… అవన్నీ అసలు సరుకు విలువకు వాల్యూ ఆడిషన్ మాత్రమే… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… కెప్టెన్ సినిమా…
Ads
జంషాద్ సెత్తిరకత్తు… తమిళ హీరో ఆర్య అసలు పేరు అదే… తన ఖాతాలో మంచి హిట్లున్నాయి… 2005 నుంచీ ఫీల్డులో ఉన్నాడు… కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకూ కాస్త పరిచయమే… అలాగే దర్శకుడు శక్తి సౌందరరాజన్ టిక్ టిక్ టిక్, టెడ్డీ, నాయిగల్ జాకిరత్తయ్ వంటి భిన్నమైన కంటెంటుతో సినిమాల్ని తీసినవాడే… మరి ఆ ఇద్దరూ కలిసి వింత జీవుల్లా ప్రేక్షకుల మీదకు కెప్టెన్ పేరుతో దాడి చేశారు ఏమిటో…
ప్రిడేటర్ సినిమా చూసి… ఓసోస్, అలాంటి కథల్ని మనం తీయలేమా అనుకోవడంలోనే ఓ భ్రమ… మన బడ్జెట్ ఎంత..? మన రీచ్ ఎంత..? హాలీవుడ్ రేంజ్ ఎక్కడ..? పోనీ, నాసిరకం గ్రాఫిక్స్‌తో కథ చుట్టేయాలని అనుకున్నా సరే, ఆ కథాకథనాలు ఓ రీతిలో ఉండాలి కదా… మరీ టీవీ సీరియళ్లలాగా తీసిపడేశారు…
మన దేశంలోనే ఓ అడవి… అక్కడికి ఎవరూ వెళ్లరు… జనావాసాలు ఉండవు… భీకరాకృతిలో వింత జీవులు ఉంటయ్… ఎవరైనా పొరపాటున అటు వెళ్తే, వాళ్లను వాళ్లే కాల్చుకునేలా చేస్తాయి… ఈ ఆపరేషన్‌ను ఆర్య నేతృత్వంలోని ఓ సైనిక బృందం చేపడుతుంది… కాన్సెప్టు వరకూ వోకే… కానీ ప్రజెంటేషన్‌లో అడ్డదిడ్డంగా వెళ్లిపోయాడు దర్శకుడు… ఒక్కటంటే ఒక్క సీన్ కనెక్ట్ కాదు మనకు…
సినిమా అంటే ఓ హీరోయిన్ ఉండాలనేది మనవాళ్లు నమ్మిన సూత్రం… అందుకని ఐశ్వర్య లక్ష్మిని తీసుకున్నారు, ఆమెకు ఓ పాట పెట్టారు… లవ్ ట్రాక్ పెట్టారు… తీరా చూస్తే రెండే సీన్లు ఆమె కనిపించేది… సిమ్రాన్ ఓ సైంటిస్టు… కానీ హీరో ఆమెకు సైన్స్ మెళకువలు చెబుతుంటాడు… హీరో అన్నాక, ఎలాగైనా గెలవాలి కాబట్టి, ఆ వింతజీవుల ఆటకట్టిస్తాడు… థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు అర్జెంటుగా వెళ్లి తలా ఒక డోలో-650 వేసుకుని, బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంటారు…
చివరగా ఒక మాట :: ఎంత నాసిరకం సినిమా అయినా సరే, ఏదో ఒక్క అంశాన్నైనా మొహమాటం కోసమైనా సరే, బాగుంది అంటాం… ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు… ఈ వింతజీవుల్ని అక్కడే తమిళంలోనే అంతం చేయకుండా, తెలుగు థియేటర్ల మీదకు కూడా వదలడం కళాద్రోహం..!!
Share this Article