పేరున్న పెద్ద సైట్లతోపాటు చాలా చానెళ్లలో, సైట్లలో ఓ వార్త కనిపించింది… నటులు, లేడీ సెలబ్రిటీల కలర్ విషయంలో మన మీడియా కురచ బుద్ధులు ఇప్పటికీ మారలేదు అని రూఢీ అయిపోయింది… ఫెయిర్ కలర్, డార్క్ షేడ్ మీద పరువు తీసేలా, ఆయా నటుల ఆత్మస్థయిర్యం, నైతికసామర్థ్యం దెబ్బతినేలా ఎవరైనా నెత్తిమాశిన వార్తలు రాస్తే, ఆ జర్నలిస్టులను టీవీ, సినిమా ప్రపంచం వెలివేసినట్టు చూస్తోంది కొన్నిచోెట్ల…
ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కనిపిస్తే లేడీ యాక్టివిస్టులు ఇమీడియెట్‌గా రియాక్టవుతారు… ఇక్కడే ఏ స్పందన కనిపించదు… కాకపోతే అనసూయ- ఆంటీ గోకుడు వివాదాలు ఎక్కువ మనకు… అఫ్‌కోర్స్, అలా గోకేది, గోకించుకోబడేది అనసూయే… సరే, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఆ వార్త ఏమిటయ్యా అంటే…
‘‘బిగ్‌బాస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లకు కాస్త మేకప్ తగులబెట్టండి నిరంజన్ గారూ… ఆ నల్లటి మొహాల్ని చూడలేకపోతున్నాం… ఫుల్లుగా మేకప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చారు కదా… తమ రెగ్యులర్ వృత్తుల్లో మేకప్పుతోనే కనిపిస్తారు కదా…’’ ఇదీ ఆ వార్తల సారాంశం… పైగా ఈసారి అందరూ అలాంటివాళ్లే హౌజులో చేరారంటూ బాగా బాధపడిపోయారు కొందరు నెట్ జర్నలిస్టులు…
Ads
ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధాన సూత్రాలు రెండు… కలర్ అనే అంశానికి రాను రాను పెద్ద ప్రాముఖ్యం ఉండటం లేదు… కలర్ బాగా ఉండీ, జీవం లేని మొహాలకన్నా కాస్త డార్క్ షేడ్ ఉన్నా సరే, మొహంలో కళ ఉండాలనే సోయి, భావన ఇప్పుడు వ్యాప్తిచెందుతోంది… పైగా సెలబ్రిటీలు అందంగా ఉంటారని అనుకోవడం ఓ భ్రమ… వాళ్లు అందంగా చూపించబడతారు… అలాగని 24 గంటలూ రంగుపూసుకునే బతకలేరు… మరి బిగ్‌బాస్‌లో ఎప్పుడూ మేకప్పులో కనిపించడం ఎలా సాధ్యం..?
నిద్ర నుంచి లేవగానే మొహాలు చూపిస్తారు… తినేటప్పుడు, టాస్కులు చేసేటప్పుడు, ఆడేటప్పుడు, ఇతర కంటెస్టంట్లతో వాగ్వాదాలప్పుడు… చాలా సందర్భాల్లో వాళ్ల ఒరిజినల్ మొహాలు కనబడతాయి… సో వాట్..? ఇదొక మైనస్ పాయింట్ ఉంటుందని తెలిసీ హౌజులోకి వస్తున్న వాళ్ల చొరవను మెచ్చుకోవాలి కదా… (ఈ జర్నలిస్టులు అడ్డమైన మగ గడ్డాలు, మీసాలు, కలర్ గురించి మాట్లాడరు, అదేమిటో…)
ఈసారి హౌజులోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్లు ఎవరంటే..? కీర్తిభట్, ఫైమా, అరోహి, ఇనయ, నేహ చౌదరి, అభినయశ్రీ, సుదీప, మరీనా, శ్రీసత్య, గీతూ, వాసంతి… పది మంది… వీరిలో ఇనయ, సుదీప, మరీనా, శ్రీసత్య ఫెయిర్ కలరే… నేహ, అభినయశ్రీ కాస్త ఛాయ తక్కువ… గీతూ కలర్‌కన్నా తన బరువే ఆమెకు కాస్త ఇబ్బంది, తనే చెప్పుకుంది… బడబడా ఏదేదో వాగేయడం ఓ మైనస్ పాయింటైనా సరే, అలాంటోళ్లు ఉంటేనే సందడి, ఆమె గెలుకుతూ ఉంటేనే ఆటలో మజా…
కీర్తిభట్ మనిసిచ్చిచూడు, కార్తీకదీపం తదితర సీరియళ్లలో మేకప్‌తోనే కనిపించేది… ఇప్పుడు బిగ్‌బాస్‌లో పెద్దగా రంగు పూసుకోవడం లేదు, ఒరిజినల్‌గానే కనిపించడానికి ప్రయత్నిస్తోంది… గుడ్… నిజంగానే కాస్త డార్క్ షేడ్ ఆమె… ఐతే నేహ, అభినయశ్రీలాగే ఆమెదీ ఫ్లెక్సిబుల్ బాడీ, డాన్సర్… బిగ్‌బాస్‌లో ఉన్న కెమెరా యాంగిల్, అక్కడున్న లైటింగ్ బట్టి కూడా కొన్నిసార్లు కాస్త డార్క్ షేడ్‌లో కనిపిస్తున్నారు కొందరు… లైటింగు బాగున్నప్పుడు బాగానే కనిపిస్తున్నారు…
ఆరోహి దీనికి ఉదాహరణ… తను కాస్త డార్క్ షేడే… దాన్నెవరూ చూడటం లేదు… ఆమె మాటతీరు, అకారణ కోపం, చిరాకు, అసహనం, ఏడుపు, తొందరపాటు, అనవసర వ్యాఖ్యలు గట్రా ఆమె పట్ల నెెగెటివిటీని బాగా పెంచేస్తున్నయ్… ఫైమా కలర్ గురించి కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు… జబర్దస్త్‌లో కూడా తను ఇలాగే కనిపిస్తుంది… సో, వాళ్ల మాటతీరు, యాక్టివిటీ, ఉద్వేగాలే ప్రేక్షకులకు ముఖ్యం, అంతేగానీ రంగూరూపం పెద్దగా పరిగణనలోకి రాదు, రావడం లేదు… మెరిట్ మాత్రమే వాళ్లలో ఎవరు నాలుగు వారాలపాటు హౌజులో ఉండాలనేది నిర్దేశిస్తుంది, అంతే…!
అనసూయకు ఈ డార్క్ షేడ్ బాధ లేదు… లేకపోతే ఎవరైనా డార్క్ షేడ్ మీద ట్రోల్ చేసినా, ఏమైనా రాసినా, కూసినా… ఇప్పుడు ఏజ్ షేమింగ్ అన్నట్టుగా… కలర్ షేమింగ్ అని కేసు పెట్టేసేదేమో..!! అవునూ… హౌజులోని రఫ్ మగ తోపుల గురించి, వాళ్ల మొహాలు, కలర్ గురించి ఏం రాయరు ఎందుకో…!!
Share this Article