ఒక దృశ్యం… ఒక మంచం వేసి ఉంది… దానిపై ఓ బట్ట… దాని నాలుగు కోళ్ల దగ్గర నాలుగు రాళ్లు తెచ్చిపెట్టారు… వాటి మీద నీళ్లు జల్లి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టారు… ఇద్దరు బాలింతలు తమ చంటి బిడ్డలను అక్కడికి తీసుకువచ్చారు… అలంకరించిన చాటల్లో పడుకోబెట్టారు… పైన తెల్లటి వస్త్రాన్ని కప్పారు… తరువాత ఆ ఇంటి పెద్దను, అనగా అత్తగారిని పిలిచారు…
ఆమె చాటను ఒకవైపు లాగుతూ ఈ బిడ్డ నీకా నాకా అనడుగుతుంది… కోడలు తనవైపు లాక్కుంటూ ఈ బిడ్డ నాకే అని చెబుతుంది… ఇలా మూడుసార్లు… తరువాత ఓ బాలింతను బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని మంచం మీద కూర్చోమన్నారు… ఆమెపైన నిండుగా మరో తెల్లటి వస్త్రాన్ని కప్పారు… అదే అత్తగారితో దిష్టి తీయించారు… ఇది బిడ్డ బతికి ఉన్న బాలింతకు చేసే పురుడు అట…,
ఆమధ్య ఏదో దిక్కుమాలిన చానెల్‌లో ఒకావిడ చెప్పింది కదా… ఐదు యాలకులు పర్సులో పెట్టుకొండి, కరెన్సీ నోట్లకు ఖాళీ స్థలం దొరకదు అని… సేమ్, అలాగే అయిదు వెల్లుల్లిపాయలు కుచ్చిన మాలను ముగ్గురు బాలింతల మంగళసూత్రాలకు కడుతుంది ఆ అత్తగారు… ఇది పురుడు తంతులో ప్రధానమట… మరోవైపు ఇంకో మొగుడు… తన పెళ్లాన్ని పక్కకు తీసుకుపోయి మొహం మీద కాటుక బొట్లు పెట్టి, ఓ తెల్లటి వస్త్రాన్ని కాల్చి, ఆమె చుట్టూ తిప్పి, కింద పడేశాడు… బిడ్డ చచ్చిపోయిన బాలింతకు అలా చేయాలట…
Ads
మీకు జుత్తు పీక్కోవాలని అనిపించడంలో తప్పులేదు… అసలు తలతిక్క యూట్యూబ్ చానెళ్లను తిడతారు గానీ… మెయిన్ స్ట్రీమ్ టీవీ చానెళ్లు అంతకన్నా దరిద్రంగా మారిపోతున్నయ్… ఇప్పటిదాకా నేను చెప్పింది త్రినయని అనే సీరియల్‌లో ఓ సీన్… శనివారం రోజంతా ఇదే ఎపిసోడ్… అసలు సీరియళ్లంటేనే పెద్ద దరిద్రం కదా, మళ్లీ వాటిని తిట్టి నోరు ఖరాబు చేసుకోవడం దేనికి అంటారా..? ఇలాంటి మూఢ ప్రక్రియల్ని ప్రచారంలోకి తీసుకురావడం, దాన్నే మన కల్చర్ అని ముద్రవేయడం నీచం కాదా…
ఇది జీతెలుగు టీవీలో వస్తుంది… ఆ టీవీ సీరియళ్లలో టాప్ వన్ రేటింగ్… అందుకే చెప్పుకోవాలి… వాటికి వచ్చే యాడ్స్ డబ్బు మన జేబుల్లో నుంచి సంగ్రహించబడేదే… అందుకని విశ్లేషించాలి… ఈ సీరియల్ మరీ ఎంత ఘోరం అంటే… ప్రతి సీరియల్‌లో వీలున్నంతవరకు పునర్జన్మలు, మాయలు, మంత్రాలు, తాయెత్తులు, విశేష పూజలు, లీలలు, బాబాలు, సోదెమ్మల్ని ఇరికిస్తుంటారు… అసలు రోజూ పొద్దున్నే శ్రీకరం-శుభకరం, ఓంకారం అనే ప్రోగ్రామ్స్ ఇలాగే మూఢనమ్మకాల్ని బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నయ్…
విచిత్రం ఏమిటంటే… వాటిని చూసే ప్రేక్షకుల సంఖ్య, నమ్మేవారి సంఖ్య విపరీతంగా ఉండటం… అందుకే మరి ఐదు యాలకుల వంటి వీడియో బిట్లు అంత పాపులర్ అవుతున్నాయి… ఇప్పుడు త్రినయనిలో చూపించిన సీన్ భిన్నంగా ఏముంది..? నిజానికి ఇది బెంగాలీ సీరియల్… ఇప్పుడు ఏడు భాషల్లోకి రీమేక్… భోజ్‌పురిలో పేరు త్రికాలి (అభిశాప్ యా వరదాన్)… ఇది మాత్రం డబ్బింగ్ వెర్షన్.., మిగతా తెలుగు (త్రినయని), పంజాబీ (నయన్, జో వేకే ఉన్వేఖ), మరాఠీ (సాతవ్య ములీచి, సాతవీ ములగీ), తమిళం (మారి), ఒడియా (దిబ్యదృష్టి) అన్నీ రీమేక్స్… అన్నీ జీ నెట్‌వర్కే ప్రసారం చేస్తుంటుంది…
తెలుగులోకి రీమేక్ చేసుకున్నప్పుడు దాన్ని స్థానీకరించుకోవాలి… అనగా మన నేటివిటీకి తగినట్టు రాసుకోవాలి… బెంగాలీ కల్చర్‌ను యథాతథంగా దింపేస్తే ఎలా..? మన బుర్రల్లోని చటాక్ గుజ్జు కూడా పనిచేయదా..? పోనీ, పైన చెప్పిన పురుడు తంతు బెంగాల్‌లో కూడా ఉండి ఉండదు… ఎలాగూ కథాకథనాలు పరమ దరిద్రం… కనీసం ఇలాంటి సీన్లను జనం నెత్తి మీద రుద్దేటప్పుడైనా కాస్త ఆలోచించండర్రా… మీ దుంపతెగ… యాణ్నుంచి పట్టుకొస్తున్నార్ర భయ్ మిమ్మల్ని…!!
Share this Article