మహావృక్షం నేలకొరిగింది… వంటి పదాల్ని నేను వాడదల్చుకోలేదు… కానీ కృష్ణంరాజు మరణం తప్పకుండా మీడియాకు ప్రయారిటీ వార్తే… తన మరణం తాలూకు కవరేజీని తక్కువ చేయడానికి నిన్న అంత పెద్ద కొంపలు మునిగే అధిక ప్రయారిటీ వార్తలు ఏమీలేవు కూడా… పైగా నిన్నంతా టీవీలు, సైట్లు, ట్యూబ్ చానెళ్లు రకరకాల వార్తలతో హోరెత్తించాయి… పాత సంగతులన్నీ పూసగుచ్చాయి… మరి తెల్లవారి పత్రికల్లో ఏముండాలి..? కొత్తగా ఇంకేం చెప్పాలి..? ఎప్పటిలాగే ఈ ప్రశ్న తెలుగు మీడియాను వేధించింది, ఎప్పటిలాగే చేతులెత్తేసింది…
మనం చెప్పుకునేది ఏమిటంటే…? చివరకు పేరున్న ఓ నటుడు, మాజీ కేంద్ర మంత్రి మరణిస్తే… ఆ కవరేజీకి కూడా లెక్కలు వేసుకుంది తెలుగు మీడియా… ఇలాంటి విషయాల్లోనూ తటస్థతను, పరిపక్వతను మెయింటెయిన్ చేయలేని మీడియా దరిద్రం ఓ విషాదం… ప్రతి అంశంలోనూ ఇవే అడ్డమైన లెక్కలా..? సమీకరణాలా..? చివరకు ప్రాంతం, పార్టీ తదితర అంశాలు ఈ కవరేజీని ప్రభావితం చేయాలా..?
ముందుగా ఆంధ్రజ్యోతిని అభినందించాలి… మొదట పేజీ టాప్‌లో అరపేజీ లీడ్ స్టోరీ… అఫ్‌కోర్స్, మళ్లీ తన యెల్లో లెక్క ప్రకారం జాగ్రత్తగా చంద్రబాబు వెళ్లి, ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఫోటో ఫస్ట్ పేజీలో వేశారు… (సాక్షి ఒక ఫోటోలో చంద్రబాబు కనిపించేంతమేరకు కత్తిరించి పారేసింది… చంద్రబాబు మొహం కనిపిస్తే పత్రిక అపవిత్రం అయిపోతుందా..? చివరకు ఇలాంటి సందర్భాల్లో కూడా జాతివైరం ప్రదర్శించాలా..?)
Ads
ఆంధ్రజ్యోతి లోపల పేజీల్లో దాదాపు రెండున్నర పేజీల స్పేస్ కేటాయించింది… అనేక ఆసక్తికరమైన సంగతుల్ని పేర్చింది… తన సినిమాలు, తన రాజకీయాలు, తన జీవితం గట్రా అన్నీ కవర్ చేసింది… స్థూలంగా చూస్తే సూపర్‌లేటివ్ విశేషణాలతో ‘అతి’ అనిపించవచ్చుగాక… కానీ ఏఎన్నార్, ఎన్టీయార్, కృష్ణ, శోభన్‌ల సమకాలీనుడు, నిర్మాత, హీరో, మాజీ కేంద్ర మంత్రి తదితర కోణాల్లో చూసినప్పుడు ఈ భారీ ప్రయారిటీకి కృష్ణంరాజు అర్హుడే అనిపిస్తుంది… పాఠకాసక్తి కూడా ఉంటుంది…
నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఈనాడు హఠాత్తుగా మేల్కొని, పేజీల కొద్దీ వార్తల్ని పరిచేస్తుంది… ఎందుకోగానీ ఈసారి జస్ట్, ఒక పేజీకి పరిమితం అయిపోయింది… పెద్దగా ఇంట్రస్టింగు అంశాలు కూడా ఏమీలేవు… చప్పగా ఉంది కవరేజీ… సాక్షి కూడా ఎందుకో లైట్ తీసుకుంది… ఫస్ట్ పేజీలో సరైన ప్రయారిటీ కనిపించినా, లోపల ఓ హాఫ్ పేజీ తూతూమంత్రం కవరేజీ కనిపించింది… సాక్షికి ఓ క్లారిటీ మిస్సయినట్టుంది… తను పాత ప్రజారాజ్యంలో ఉండేవాడు, అంతేతప్ప తనకు జనసేనకు సంబంధం లేదు… పైగా జగన్ ప్రేమిస్తున్న బీజేపీ మనిషే కృష్ణంరాజు…
లెఫ్ట్ కవరేజీ ఎలా ఉందని నవతెలంగాణ ఓపెన్ చేస్తే… అదీ తూతూమంత్రమే… ఎందుకంటే, కృష్ణంరాజు బీజేపీ మనిషి కదా… జస్ట్, సినిమా పేజీలో ఓ పెద్ద వార్త కవర్ చేసి, చేతులు దులుపుకుంది… నమస్తే తెలంగాణ మరీ విచిత్రం… కేసీయారే తనకు కృష్ణంరాజు ఆత్మీయుడని, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయిస్తున్నట్టు ప్రకటించాడు… (తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలే తెలంగాణ జాతి ఇష్టాయిష్టాలు అని గమనించగలరు…)
అలాంటప్పుడు కాస్త సరైన ప్రయారిటీతో కవరేజీ ఇవ్వవచ్చు కదా… ఫస్ట్ పేజీలో ఓ చిన్న ఇండికేషన్ పడేసి, లోపల పేజీల్లో కూడా ‘ఏదో రాశాంలే’ అన్నట్టుగా ఓ మొక్కుబడి కవరేజీ… బహుశా ‘ఆంధ్రుడు’ అనే భావన కవరేజీని ప్రభావితం చేసిందా..? అదే నిజమైతే తప్పు… కృష్ణంరాజును తెలంగాణ ప్రాంతం కూడా అభిమానించింది… తను చాలాకాలంగా హైదరాబాద్ నివాసి…
చివరకు బీజేపీ వాసనలున్న వెలుగు కూడా బీజేపీ మనిషి మరణిస్తే ‘ఏదో కవర్ చేశాంలే’ అన్నట్టుగా స్పందించింది… అల్లూరి విగ్రహావిష్కరణకే ఆయన్ని పిలవలేదు, బహుశా కృష్ణంరాజు బీజేపీతనాన్ని పార్టీ గుర్తించడం మానేసిందేమో..!! ఇక ప్రధాన టీవీ చానెళ్ల కవరేజీని విశ్లేషిస్తే అది పెద్ద పుస్తకం అయ్యేట్టుంది…!!
Share this Article