రెండేళ్ల క్రితం కావచ్చు బహుశా… హఠాత్తుగా మహేశ్ బాబు జీతెలుగు తెర మీద కనిపించాడు… యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, త్రినయని సీరియల్ నటి ఆషికా ఉంది… మూడు సీరియళ్లకు ఒకే యాడ్‌లో ప్రమోషన్ చేసేశాడు… వాటి పేర్లు త్రినయని, ప్రేమ ఎంత మధురం, తూర్పుపడమర… అందులో త్రినయని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లది… వాటిల్లో త్రినయని, ప్రేమ ఎంత మధురం సవాలక్ష వంకర్లతో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి… నెత్తిమాశిన సీరియళ్లు అవి… వివరంగా చెప్పడానికి స్పేస్ సరిపోదు ఇక్కడ…
తూర్పుపడమర గతేమిటబ్బా అని బార్క్ రేటింగుల ఫైల్ ఓపెన్ చేస్తే దాని పేరే కనిపించలేదు… బహుశా అర్థంతరంగా, అనామకంగా ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది… అసలు ఈ కథనం ఆ సీరియళ్ల గురించి కాదు… వాటికి మహేశ్ బాబు ప్రమోషన్ ఎందుకూ అని..? తను కూడా టీవీ, సినిమా ఫీల్డ్‌లో ఉన్నాడు కాబట్టి ప్రచారం చేస్తే తప్పులేదు… కానీ తన రేంజ్ ఏమిటి..? తను ప్రచారం చేసే ఆ మురికి సీరియళ్ల రేంజ్ ఏమిటి..? అప్పట్లో అలా అనుకున్నారు చాలామంది…
ఇప్పుడు హఠాత్తుగా మరో సీరియల్ ప్రమోషన్‌కు వచ్చాడు… పడమటి సంధ్యారాగం దాని పేరు… తనొక్కడే కాదు, ఈసారి బిడ్డ సితారను కూడా తెర మీదకు తీసుకొచ్చాడు… అవసరమా..? అదేమిటయ్యా అంటే… సదరు చానెల్‌కు మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అట… కోట్లు తీసుకుంటున్నాడు అట… మరిక సీరియల్ ప్రమోషన్ చేయవయ్యా అంటే చేయడా..? ఇతరత్రా హిందీ స్టార్లు వదిలేస్తున్నా సరే, లెంపలేసుకుంటున్నా సరే, మహేశ్ బాబు మాత్రం ఆ గుట్కా ప్రమోషన్ యాడ్స్ ఇంకా చేస్తూనే ఉన్నాడుగా… డబ్బు బాసూ డబ్బు…
Ads
ఆమధ్య జీతెలుగులో కొత్తగా స్టార్ట్ చేసిన ఏదో డాన్స్ షో లాంచింగుకు కూడా సితారను తీసుకునే వచ్చాడు… డబ్బు సంపాదిస్తుంటే ఎవరూ వద్దనరు, ఏవో గుండె ఆపరేషన్లనీ, ఏవో సేవా కార్యక్రమాలనీ చేస్తున్నందుకూ సంతోషమే… కానీ ఆ సంపాదన కూడా మహేశ్ బాబు రేంజులో ఉండాలి… ఈ పిచ్చి సీరియళ్లకు నువ్వు డప్పు కొట్టడం ఏమిటి మహేశా..? ఒక త్రివిక్రముడితో మళ్లీ కలిశావు… అదొక లెవల్… ఒక రాజమౌళితో కలవబోతున్నావు… పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ సినిమా… అదీ నీ రేంజ్… నీ అడుగులు ఆ రేంజులోనే పడాలి… ఈ చిల్లర పైసలు నీకెందుకు చెప్పు..?
చివరగా… అభిమానులు అంగీకరించడం వేరు, అభిమానులు గర్వించడం వేరు… ఈ కూల్‌డ్రింకులు, ఈ గుట్కాలు, ఈ చెత్తా సీరియళ్ల ప్రమోషన్లు నీకేల..? తెలుగు ఇండస్ట్రీలో నీకున్నది ఓ డిఫరెంట్ ఇమేజీ… ఏ పిచ్చి పంచాయితీల్లోనూ అడుగు పెట్టవు, రాజకీయాల్లోకి పోవు, నువ్వేమిటో, నీ సినిమాలేమిటో, నీ కుటుంబమేమిటో… అంతే… మరి ఈ చిల్లర మరకలు దేనికి మహేశా..?!
Share this Article