ఓ వార్త చదువుతుంటే… ఇలాంటి మనోభావులు ఇన్నేళ్లూ ఎక్కడ నిద్రిస్తున్నారబ్బా అనిపించింది… ముందుగా ఆ వార్తేమిటో చదవండి… ‘‘బాలీవుడ్ నటులు సిద్ధార్థ మల్హోత్రా, అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం పేరు థాంక్ గాడ్… ఇందులోని కొన్ని సంభాషణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ న్యాయవాది హిమాంశు శ్రీవాత్సవ యూపీలోని జానపూర్ కోర్టులో ఓ పిటిషన్ వేశాడు… ఓ కేసు నమోదైంది…
‘‘అజయ్ దేవ్‌గణ్ సూటు వేసుకున్నాడు.., చిత్రగుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశాడు… చిత్రగుప్తుడు అంటే పాపకర్మలు లెక్కించేవాడు… మనుషుల మంచీచెడూ రికార్డు చేసేవాడు… దేవుళ్లను అలా చూపిస్తే… అది మతం మనోభావాలను దెబ్బతీసినట్టు కాదా” అనేది సదరు లాయర్ హిమాంశు అభ్యంతరం… ఈయన స్టేట్‌మెంట్‌ను నవంబరు 18న కోర్టు రికార్డు చేయనుందని వార్త… అప్పటిలోగా సినిమా రిలీజ్, తాడోపేడో తేలిపోవడం పూర్తయిపోతయ్ అంటారా..? అది వేరే సంగతి…
ఇందులో రకుల్ ప్రీత్ హీరోయిన్… శుక్రవారం ట్రెయిలర్ రిలీజ్ చేశారు కదా… దాని ఆధారంగా హిమాంశు తన పిటిషన్ ఫ్రేమ్ చేసుకున్నాడు… కాస్త వ్యంగ్యం, కాస్త ఉద్వేగం, కాస్త కామెడీ మిక్స్ చేసినట్టుగా ఉంది ట్రెయిలర్… నిజానికి ట్రెయిలర్లు, ప్రోమోలు కట్ చేయడం దర్శకత్వంకన్నా క్లిష్టమైన ఆర్ట్… ఈ ట్రెయిలర్‌లో అంత పంచ్ ఏమీ లేదు… 3 నిమిషాల ట్రెయిలర్‌లో కొత్తదనం పెద్దగా ఏమీ కనిపించలేదు… ఏదో దిక్కుమాలిన వెబ్ సీరీస్ పోకడ తప్ప…
Ads
ప్రతి అంశానికీ మనోభావాల్ని లింక్ చేసి, వివాదాల్లోకి లాగడం చాన్నాళ్లుగా ఓ ట్రెండ్… ట్రెండ్ అనొచ్చా…? ఇంకేమైనా పదం ఉందా..? సర్లెండి, ప్రస్తుతానికి ఆ చర్చ వదిలేద్దాం… నిజానికి ఆ ట్రెయిలర్ మరీ వెగటుగా, చిత్రగుప్తుడి పాత్రను వెకిలి చేస్తున్నట్టుగా ఏమీ అనిపించలేదు… అది యమలోకం కూడా కాదు… మధ్యలో మృతుడి ఆత్మను ఆపేసి, మంచీచెడు లెక్కలు తేలుస్తున్నాడు చిత్రగుప్తుడు… ఆ తరువాత నరకానికా, స్వర్గానికా చెబుతాడన్నమాట… ఓ కొత్త ప్రయోగం… క్రియేటివిటీ…
కౌన్ బనేగా కరోడ్ పతి, కపిల్ శర్మ కామెడీ షో, ఇండియన్ ఐడల్ తదితర సెట్లన్నీ మిక్స్ చేసి ఓ కొత్త తరహా సెట్ వేసినట్టున్నారు… అజయ్ దేవగణ్ ఫుల్ సూట్‌లో ఉన్నాడు… మనోభావాలు దెబ్బతినేంత అభ్యంతరకరంగా ఏమీ లేదు… మన తెలుగు సినిమా ప్రబుద్ధుల్ని, సారీ, ప్రసిద్ధుల్ని ఓసారి గుర్తు చేసుకొండి… యముడిని ఎన్నిరకాలుగా భ్రష్టుపట్టించారు… నేల మీదకు లాక్కొచ్చారు, తిట్టారు, బెదిరించారు… చిత్రగుప్తుడినైతే జోకర్‌గా మార్చేశారు…
యముడిపై తిరుగుబాట్లు, ఓట్లు, సమ్మెలు కూడా… కొందరైతే పిచ్చి డ్రెస్సులు వేయించారు, ఆభరణాల్ని అమ్మించారు, హిమక్రీములు అంటూ ఎదవ పోకడలకు పోయారు… మరీ ఇంకో అంతర్జాతీయ స్థాయి బృహత్ దర్శకుడైతే నానా ఛండాలం పనులూ చేయించాడు యముడితో… చిత్రగుప్తుడితో కుట్రలు చేయించాడు… ఎవడికిష్టం వచ్చిన రీతిలో అలా యముడు, చిత్రగుప్తుల పాత్రలతో ఆడుకున్నారు… వీళ్ల లెక్కలన్నీ ఆ చిత్రగుప్తుడు రాసుకున్నాడో లేదో తెలియదు గానీ… హఠాత్తుగా వీళ్లిద్దరినీ ప్రేమించే మనోభావులు కనిపిస్తున్నారు… విశేషమే..!!
Share this Article