కంటిచూపుతో ఓ వంద వాహనాల్ని పేల్చేయగల రజినీకాంత్ అయినా సరే… దీటైన తెలుగు హీరో బాలయ్య అయినా సరే……. నిన్నగాక మొన్న కళ్లుతెరిచి కేర్మంటున్న ఓ పిల్ల హీరో కార్తీకరాజా అయినా సరే… మాస్ హీరో అనిపించుకోవాలంటే ఇదుగో చేతిలో ఇలా ఓ పెద్ద గన్ను పట్టాల్సిందే… గన్ను అంటే Gun కాదు… బండల్ని పిండిచేసే పెద్ద సైజు సుత్తి… మరి సౌత్ సినిమా మాస్ హీరో అంటే ఈమాత్రం బరువైన, బండ ఆయుధం చేతిలో లేకపోతే ఎలా..?
పగిలితే బాక్సాఫీసు పగలాలి… లేదంటే ప్రేక్షకుల బుర్రలు పగలాలి… తగ్గేదేలా… మరి హీరో అంటే మజాకా..? అత్యంతాధునిక పోర్టబుల్ మిసైల్ లాంచర్ చేతిలో ఉన్నా సరే… ఓ మెషిన్ గన్ చేతికిచ్చినా సరే… ఆకు రౌడీలు గాలిలో తేలుతూ పోతున్నా సరే… హీరో ఈ గన్ను పట్టాల్సిందే… తెర నిండా నెత్తురు పారాల్సిందే… థియేటరంతా రక్తపు కంపు వాసన గుప్పుమనాల్సిందే… అదీ మన హీరో రేంజ్ అంటే… ఇలాంటి వేషాలు ఇప్పుడు నడవడం లేదు, జనం ఛీకొడుతున్నారురా, నవ్వుతున్నారురా బాబూ అన్నా ఎవడూ వినడు ఇక్కడ… ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ఎవడికి కావాలి..?
గన్ను పట్టామా..? ఓ నూటాయాభై మందిని చితగ్గొట్టామా లేదా..? అసలు చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాల్లో అనవసరంగా పిచ్చి పిచ్చి దివ్యాస్త్రాలను వాడారు గానీ… ప్రతి సేనాధిపతి చేతిలో ఈ గన్ను పెడితే సరిపోయేది… దెబ్బకు కోట తలుపులు విరిగిపడేవి… కోట గోడలు పగుళ్లు బారి, తోవనిచ్చేవి… ఇప్పటికైనా మన డీఆర్డీఓ పిచ్చి పిచ్చి ఆయుధాలపై పరీక్షలు, ప్రయోగాలు వదిలేసి, మన ఆర్మీ కూడా ఆ గన్నులకు బదులు, ఈ గన్నులు వాడితే చైనాను నిలువరించవచ్చునని అనిపిస్తోంది… అందుకే ఈ గన్ను మన సౌతిండియా ఫిలిమ్ ఇండస్ట్రీకే ఓ ఐకాన్… తాజాగా కార్తీక్ రాజు అనబడే హీరో నటిస్తున్న అధర్వ సినిమా వార్త చదువుతుంటే ఇలాగే అనిపించింది…
Ads
సరే, అధర్వ పేరు బాగానే ఉంది, ఇంతకీ ఎవరబ్బా ఈ సుప్రీం మెగా స్టారుడు అని ఇంకాస్త లోపలకు వెళ్తే… అది ‘‘పాన్ సౌత్ ఇండియా’’ సినిమా అని తెలిసింది… వావ్… జస్ట్, ద్రవిడ భాషలకే పరిమితమయ్యే ఉపజాతీయ సినిమా అన్నమాట… సూపర్… మోషన్ పోస్టర్ లుక్ చూస్తే అదే తెలిసింది.,. ఇక్కడ మోషన్ అంటే కదిలే అని అర్థం… కంపు కొట్టే ఇతర అర్థాల జోలికి వెళ్లకండి…
అసలు ఎవరబ్బా ఈ గన్నర్ అని వివరాలు వెతికితే… వైజాగ్ రాజు అని పిలవబడే ఏ-క్లాస్ నిర్మాత కొడుకట… ఓహో, వారసరత్నమా..? సరే, సరే, ఈ గన్నులు ఎక్కువగా ఉపయోగించేది వాళ్లే… తప్పు లేదు, సంప్రదాయం కదా, తప్పలేదు… పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు అడిగారట గానీ, తండ్రికే తనను లాంచ్ చేసే చాన్స్ ఇద్దామనీ, తండ్రిరుణం తీర్చుకుందామని అనుకున్నాడట… అలా టిప్పు అనే సినిమా వచ్చిందట… తరువాత పడేశావే అని మరో సినిమాలో చేశాడట… ఐతేనేం, అనామక హీరో అని ఎవరు ముద్రవేస్తారు..? అసలే పాన్ సౌత్ హీరో… చేతిలో గన్నుంది జాగ్రత్త..!!
Share this Article